ఇరుకైన రోడ్డుతో ఇబ్బందులు..

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఇది సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మీదుగా వెళ్లే దారి. ఉప్పునుంతల మండల కేంద్రం నుండి వంగూరు వరకు డబుల్‌ రోడ్డు పనులు పూర్తయినా… కాంసానిపల్లిలో మాత్రం రోడ్డు విస్తరణ పనులు నేటికీ మొదలు పెట్టలేదు. హైద్రాబాద్‌ నుండి శ్రీశైలం వెళ్లే వారు, అచ్చంపేట నుండి హైద్రాబాద్‌కు వెళ్లే వారు ఎక్కువ శాతం ఈ రోడ్డు మార్గం గుండానే వెళ్తున్నారు. దూర, వ్యయభారం తగ్గడంతో పాటు… సీఎం స్వంత ఊరు నుండి వెళ్తున్నామన్న ధీమాతో ఈ రోడ్డు గుండా వెళ్దామంటే కాంసానిపల్లిలో ఇరుకైన రోడ్డు ఉండటంతో రాకపోకలకు అంతరాయం కల్గుతుంది. ఇరుకైన రోడ్డుపైనే రాళ్లు, ఇతర వస్తువులు ఉంచి కనీసం ఒక్కకారు, బస్సులు వెళ్లడానికి కూడా స్థలం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రయాణీకులు వెళ్లాల్సి వస్తోంది. ఈ మార్గం గుండా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారులు, దూర భారం తగ్గుతుందని నిత్యం వందలాది ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు, లారీలు, డీసీఎంలు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి. కాంసానిపల్లి గ్రామం మధ్య నుండి రోడ్డు మార్గం ఉండటంతో తీవ్ర అంతరాయం కల్గుతోందని వాహనదారులు అంటున్నారు. అలాగే రోడ్డుపైనే ప్రైవేటు వాహనాలు నిలిపి ఉంచడం కూడా అంతరాయం కల్గుతోంది. ప్రమాదాలు కూడా అధికంగానే జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు కాంసానిపల్లి రోడ్డుపై దృష్టి పెట్టాలని ఆ గ్రామ ప్రజలతో పాటు, వాహనదారులు కోరుతున్నారు.
Spread the love