‘కారు’లో అసమ్మతి ‘కాక’

Discord 'kaka' in 'car'– కలిసి రాక.. చొరవ లేక..
– కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌లో చల్లారని అసమ్మతి
– తాజా పరిణామాలతో అభ్యర్థుల్లో ఆందోళన
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘కారు’లో కలహాలు.. అసమ్మతి కాకరేపుతున్నాయి.. బీఆర్‌ఎస్‌ అధిష్టానం గత నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రచారానికి సమయం లభించడమే కాక అసమ్మతి నేతలను సమన్వయం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని భావించింది. కానీ నెల రోజులు గడుస్తున్నా.. అసమ్మతి చల్లారకపోగా పెరుగుతోంది. వ్యతిరేకిస్తున్న వారితో కలిసిపోయేందుకు అభ్యర్థులు చొరవ తీసుకోకపోవడం, అసమ్మతివాదులు కూడా పట్టు వీడకపోవడంతో రోజురోజుకూ విభేదాలు ముదిరి పాకాన పడి కొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి.
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని బీఆర్‌ఎస్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కలహాలు ఎంతకూ చల్లా రడం లేదు. అసమ్మతి వాదులు, అభ్యర్థుల మధ్య సయోధ్య కుదరకపోగా.. సమన్వయం కోసం అధిష్టానం ఇన్‌చార్జీలను నియమించకపోవడంతో ఇరుగ్రూపులకు దూరం కొనసాగు తోంది. పార్టీలో నాయకులు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తుండటంతో క్యాడర్‌లో ఆందోళన నెలకొంది.
కుత్బుల్లాపూర్‌పై శంబీపూర్‌ రాజు నజర్‌
ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఇప్పటికే ప్రభుత్వ విప్‌తోపాటు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ముందే తానే కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకున్నారు. అనూహ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కే మళ్లీ టికెట్‌ దక్కడంతో శంభీపూర్‌ రాజు షాక్‌ తిన్నారు. ఈనెల 3వ తేదీన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనలేదు. తనకు ఎమ్మెల్యే కేపీ వివేకాంద్‌ నుంచి ఆహ్వానం అందలేదని, అందుకే హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీతోపాటు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మేయర్‌, కొంపల్లి, దుండిగల్‌ మున్సిపల్‌ చైర్మెన్లు సహా ఎమ్మెల్సీ అనుచరులుగా పేరొందిన వారెవరూ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ తర్వాత గాజుల రామారంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరైనా, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఆయన అనుచరులు హాజరు కాలేదు. నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ నీలా గోపాల్‌రెడ్డి, దుండిగల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కృష్ణవేణి, కొంపల్లి మున్సిపల్‌ చైర్మెన్‌ శ్రీశైలం యాదవ్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా హాజరు కాలేదు. టికెట్‌ దక్కకపోవడంతో శంభీపూర్‌రాజు ఇంకా లోలోన మదనపడుతూనే ఉన్నారు.
ఉప్పల్‌లో ఊగిసలాట..
ఉప్పల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని బండారి లక్ష్మారెడ్డికి టికెట్‌ కేటాయించారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నిరాశకు గురయ్యారు. ఇద్దరు నేతలూ కొద్ది రోజులు ఎడ ముఖం పెడ ముఖంగా ఉన్నా.. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమ ఇద్దరిలో టికెట్‌ ఎవరికి ఇచ్చినా ఓకే కానీ.. బండారి లక్ష్మారెడ్డికి మాత్రం ఇవ్వొద్దని అభ్యర్థించారు. ఆ తర్వాత ఇద్దరూ సైలెంట్‌ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క విమర్శకానీ, బీఆర్‌ఎస్‌ వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేయలేదు. చర్లపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను రెండ్రో జుల కిందట మంత్రి తలసాని ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భేతి, ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరైనా, బొంతు రామ్మోహన్‌ హాజరు కాలేదు. సోమవారం ఉప్పల్‌లో బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకు మంత్రి కేటీఆర్‌ హాజరైనా.. ఎమ్మెల్యే భేతి దూరంగా ఉన్నారు.
తొలగని అంతరాలు..
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు మధ్య ఇంకా దూరం కొనసాగుతూనే ఉంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో ఇరువురూ ఒకరినొకరు కలుసుకున్నప్పటికీ వారి మధ్య అంతరం అలాగే ఉన్నది. దీంతో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు అన్నట్టుగా ఉంటున్నారు. ఇక ఉప్పల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్‌ కలిసినా.. ఎమ్మెల్యే అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో సఖ్యత లేదు. ఈ ఇద్దరూ ఇప్పటికీ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన సందర్భంలో అందరూ కలిసి పని చేయాలని సూచించినా జరగడం లేదు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి బొంతు రామ్మోహన్‌ ఎలాంటి కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. కార్యకర్తలనూ కలవడం లేదు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే ఇంకా ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో అసమ్మతి చల్లారేలా లేదు.
కనిపించని సమన్వయ నేతలు
అసంతృప్తులు ఉన్న చోట సమన్వయ నేతలను నియమించిన బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో మాత్రం నియమించలేదు. ఎవరికి వారే మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ వద్దకు వచ్చి తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారే తప్పా.. వీరిని ఎవరూ పిలిపించుకుని మాట్లాడటం లేదు. తాజా పరిణామాలతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అసమ్మతి నేతలు తమకు సహకరిస్తారో..? లేదో..?, తమ గెలుపునకు కృషి చేస్తారో..? లేదో..? అని ఎమ్మెల్యే అభ్యర్థులు ఆలోచనలో పడ్డారు.

Spread the love