పత్రికా స్వేచ్ఛపై మోడీతో చర్చించండి

– బైడెన్‌కు అంతర్జాతీయ ప్రెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిమాండ్‌
వాషింగ్టన్‌ : భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ఎదురవుతున్న అవరోధాలపై ప్రధాని మోడీతో చర్చించాలని అంతర్జాతీయ ప్రెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐపీఐ) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను డిమాండ్‌ చేసింది. మోడీ హయాంలో పాత్రికేయులపై చట్టం అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారని, అక్కడ ఇది సర్వసాధారణమై పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్‌ మాట్లాడుతూ భారత్‌లో పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛకు ఎదురవుతున్న సవాళ్లు తమకు తెలుసునని, అయితే వాటిపై తాము ఉపన్యాసాలు ఇవ్వదలచుకోలేదని చెప్పారు. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ ఆందోళనకరమైన స్థాయిలో దాడికి గురవుతోందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఐపీఐ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి స్వదేశంలోనూ, విదేశాలలోనూ కృషి చేయాలని బైడెన్‌ను కోరింది. భారత భద్రతా చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణపై ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆరుగురు పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సంస్థ పత్రికలలో ప్రకటనల రూపంలో సమాజం దృష్టికి తెచ్చింది.
ఎన్నో అవరోధాలు
గత సంవత్సరంలో భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి 200 బెదిరింపులు లేదా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఐపీఐ గుర్తు చేసింది. ‘వేధింపులు, ఆన్‌లైన్‌లో విద్వేష పూరిత ప్రసంగాలు, భౌతిక దాడులు, బీజేపీని విమర్శించే పాత్రికేయుల నిర్బంధాలు వంటి ఘటనలు జరిగాయి. 2019లో మోడీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దు చేసినప్పుడు ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలలో కార్యకలాపాలు సాగిస్తున్న స్వతంత్ర మీడియాపై ఉక్కుపాదం మోపారు. అప్పటి నుండి ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలు నిలిచిపోయాయి. కాశ్మీర్‌ పాత్రికేయుల పర్యటనలపై ఆంక్షలు విధించారు. దాడులు, నిఘాలు, విచారణలు నిత్యకృత్యమైపోయాయి. పాత్రికేయుల విధులకు ఆటకం కలిగించేందుకు అనేక చట్టాలను ప్రయోగించారు. రాజద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ దానిని మళ్లీ తీసుకురావాలని, దాని పరిధిని విస్తరించాలని ఇటీవలే లా కమిషన్‌ సిఫార్సు చేసింది. దీనివల్ల దేశంలో అసమ్మతిని అణచివేయడం మరింత సులభమవుతుంది’ అని ఐపీఐ వివరించింది. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరు గాంచిన భారత్‌లో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాత్రికేయులపై దాడులు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కావు. ఇలాంటి విషయాలన్నింటినీ మోడీ దృష్టికి తీసికెళ్లాల్సిన అవసరం ఉంది. భారత ప్రధాని పర్యటనను ఇందుకోసం వినియోగించుకోవాలి. భారత పాత్రికేయులు స్వతంత్రంగా, స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించుకునేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని మోడీని డిమాండ్‌ చేయాలి’ అని ఐపీఐ తెలిపింది.

Spread the love