రాజ్యసభ చైర్మెన్‌కు ఆప్ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్‌కు ఆప్ సీనియర్ నేత సంజరు సింగ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎంపీల ఫిరాయింపులు ప్రజా తీర్పునకు ద్రోహం చేయడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ముఖ్యంగా ఫిరాయింపులకు పాల్పడిన వారిలో ఆరుగురు పంజాబ్ నుంచి ఆప్ టిక్కెట్టుపై ఎన్నికయ్యారని తెలిపారు. ఇప్పడు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆక్షేపించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు వారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా రాజ్యసభ చైర్మెన్‌ను కోరినట్టు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి శుక్రవారం గట్టి దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్బజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మలివాల్‌లు బీజేపీలో విలీనమైనట్టు ప్రకటించారు. కేజ్రీవాల్ పార్టీ ఏ సిద్ధాంతాల తో మొదలైందో ఆ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని వారు ఆరోపించారు. తమ విలీనాన్ని సమర్ధించుకుంటా వ¶డింట రెండువంతుల మంది మరో పార్టీలో విలీనమయ్యేందుకు రాజ్యాంగ నిబంధన అనుమతిస్తుందని రాఘవ్ చద్దా చెప్పారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి పది మంది సభ్యులుండగా అవసరమైన దానికంటే ఎక్కువ మంది సభ్యులు తమ గ్రూప్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే ఈ వాదనను సంజరు సింగ్ తోసిపుచ్చారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సహా పలువురు రాజ్యాంగ నిపుణులను తాము సంప్రదించామని, చట్టప్రకారం ఆప్ నుంచి ఫిరాయించిన ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయండి
- Advertisement -
- Advertisement -



