పూర్వ విద్యార్ధులుచే పాఠశాలకు వాటర్ కూలర్ వితరణ

– చదువుకున్న పాఠశాల ఋణం తీర్చుకుంటున్న పూర్వ విద్యార్ధులు…
– నేటి తరం విద్యార్ధులకు ఆదర్శంగా నాటి తరం బాలలు…
– రూ.24 వేలు విలువ గల వాటర్ కూలర్ వితరణ అందజేసిన 1999 పదో తరగతి బ్యాచ్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్వంత లాభం కొంత మాని పొరుగు వారి తోడ్పడవోయ్..అనే నాటి మహనీయులు అడుగుజాడలు గుర్తులుగా కొందరు సమాజానికి ఏదో రకంగా సేవలు అందిస్తున్నారు.తాము చదువుకున్న పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తూ పాఠశాల ఋణం తీర్చుకుంటున్నారు.నేటి తరం విద్యార్ధులకు ఆదర్శంగా నాడు విద్య అభ్యసించిన పాఠశాల లోని బాలలు నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా,కుక్కునూరు మండలంలోని అమరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు అయి 75 ఏండ్లు అయిన సందర్భంగా గతేడాది సెప్టెంబర్ లో ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను పూర్వ విద్యార్ధులు ఘనంగా నిర్వహించి పలు తీర్మానాలు చేసారు.
ఈ క్రమం లో 1999 లో పదోతరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్ధులు అమరవరం పాఠశాలకు ఇటీవల వాటర్ కూలర్ ను అందించారు. దీంతో ప్రస్తుతం ఉపాద్యాయులు,విద్యార్ధిని విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పై శ్రద్ద చూపిస్తున్న పూర్వ విద్యార్ధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆ పాఠశాల కు పూర్వ విద్యార్ధులు ఈ విధంగా సందేశం పంపారు.
అందరికీ నమస్కారం, మీ అందరితో ఒక మంచి శుభవార్తను పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము! 1999 వ సంవత్సరం పదోతరగతి బ్యాచ్ కు చెందిన మేము మా పాఠశాల కొరకు ఉడతా భక్తి సహాయం చేద్దామని నిర్ణయించు కున్నాము. ఈ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులు సౌకర్యార్ధం వాటర్ కూలర్ ను  బహుమతిగా ఇచ్చాము.ఈ ప్రక్రియ మా పాఠశాల తో మా శాశ్వత సంబంధాన్ని మరియు మమ్మల్ని తీర్చిదిద్దిన సమాజానికి తిరిగి ఇవ్వడానికి మా నిబద్ధతను సూచిస్తుంది. ఈ సహకారానికి గర్వ పడుతూనే మా పాఠశాలకు మాకు వీలైన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాము.
Spread the love