నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు 

నవతెలంగాణ –  కంటేశ్వర్ 
యువ కేంద్ర జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి ఉపన్యాస పోటీలను నిర్వహిస్తోంది అని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యువజన అధికారిని నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ శుక్రవారం ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీలను కొన్ని జిల్లాల వారిగా విభజించి అందులో సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కేంద్రాలకు కలిపి నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆన్లైన్ ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తోంది.ఈ పోటీల్లో ప్రతి జిల్లా నుండి ఇద్దరు విజేతలు రాష్ట్రస్థాయికి ,రాష్ట్రస్థాయిలో గెలిచినవారు జాతీయస్థాయి పోటీలకి ఎంపిక అవుతారు.జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రెండు లక్షల నగదు, రెండో బహుమతి 1,50,000 ,మూడవ బహుమతి లక్ష రూపాయలు, ప్రోత్సాహక బహుమతులు ఇద్దరికీ 50 వేల చొప్పున ఇవ్వబడతాయి అని తెలిపారు. పోటీలో పాల్గొనడానికి అర్హతలు ఒకటి ఫిబ్రవరి 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మై యువ భారత్ అనే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే అర్హులు అని తెలిపారు. ఉపన్యాస అంశాలు  భారత్ ను ప్రపంచ స్థాయి నాయకత్వ దేశంగా నిలబెట్టడంలో యువత పాత్ర మరియు మన దేశ ఆర్థిక స్థితిగతులలో రావాల్సిన మార్పులు, ఆత్మ నిర్మాణ భారత్ నుంచి వికసిత భారతం వైపు మన దేశ ప్రయాణంలో యువత పాత్ర., ఈ దేశ యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతూ స్వయం శక్తి కేంద్రాలుగా నిలపటం లో యువత పాత్ర పై ఉపన్యాసం ఇవ్వాలన్నారు.పోటీలో పాల్గొనే అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలి. న్యాయ నిర్ణయితల యొక్క నిర్ణయమే తుది నిర్ణయం.న్యాయ నిర్ణయితలు సూచించిన నిడివిలోనే మాట్లాడాలి అలాగే పైన సూచించిన అంశాలకు సంబంధించిన ఉపన్యాసం మాత్రమే ఇవ్వాలి.పోటీలలో పాల్గొన్న దలచిన పైన తెలుపబడిన సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట్, నగర్కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాల అభ్యర్థులు 19వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఈ కింద ఇవ్వబడిన లింక్ www.mybharat.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఈ పోటీలు 20వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్ ద్వారా నిర్వహించబడతాయి. ఇతర వివరాలకు జిల్లా యువజన అధికారిని నెహ్రూ యువ కేంద్ర ని 9100435410 ఆఫీసు సమయాల్లో సంప్రదించవచ్చు అని తెలియజేశారు.
Spread the love