
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
వాహనదారులు గమ్యస్థానాలకు చేరేంతవరకు మార్గమధ్యంలో మద్యం సేవించవద్దని హుస్నాబాద్ సిఐ ఎర్రల్ల కిరణ్ అన్నారు. బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కిరణ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కుటుంబం వీధిన పడుతుందని అన్నారు.భార్యా పిల్లలు కుటుంబం గురించి ఆలోచించి బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజల రక్షణ కోసం రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రతిరోజు వాహనాల తనిఖీ జరుగుతుందన్నారు. ఫైన్ లు వేయడం కోర్టుకు పంపడం మా అభిమతం కాదని, ప్రజలలో మార్పు కోసం అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.