అడవుల్ని నరికి యదేచ్చగా అక్రమపోడు

– కబ్జాలతో కుంచించుకు పోతున్న అడవులు
– అడవుల నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ – తాడ్వాయి
అడవి.. తనను నమ్ముకున్నోళ్లకు, అమ్ముకున్నోళ్లకు మధ్య నలిగిపోతుంది. ఆక్రమణలు దౌర్జన్యాలు అటవీక చేష్టలకు చిక్కి శల్యమైపోతూ అరణ్య రోధన చేస్తుంది. పలుకుబడి గల పెద్దలు రాజకీయ ముసుగులోని స్థానిక నాయకులు, కబ్జాదారులు  ‘వనా’ లను లేకుండా చేస్తున్నారు. వన జీవన విధానాన్ని నాశనం చేస్తూ, అడవులను నరికేస్తూ అడవుల నరికేస్తూ, ఆక్రమిస్తూ రకరకాల ముసుగుల్లో పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26.9 లక్షల హెక్టార్లు (24 శాతం). ప్రభుత్వం దీన్ని 33% పెంచాలని లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఓ పక్క ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే మరొక అడవి భూముల ఆక్రమణ, చెట్ల నరికివేత వంటి ఘటనలు పర్యావరణం తీవ్రంగా నష్టపోతుంది.
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం బయ్యక్కపేట్ అటవీ ప్రాంతంలో విచ్చలవిడిగా ఇష్ట రాజ్యాంగా అడవులను నరికి పోడు కబ్జా కోరల్లో నలిగిపోతుంది. బయ్యక్కపేట్ రహదారి వెంట  సారలమ్మ గుంపుకు పోయే దారిలోని అడవి ప్రాంతం టేకు చెట్లు, వనాలు పూర్తిగా నరికి ధ్వంసం చేస్తున్నారు. అడవుల్ని ఇష్టారాజ్యంగా నరికి, యదేచ్చగా అక్రమంగా పోడు చేసుకుని కబ్జాలకు పాల్పడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు, స్థానిక నాయకుల కనుసందలోనే అడవిని నాశనం చేస్తున్నట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి అడవి నాశనం అయిన చూసుకుంటూ అంటిమట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి క్షేత్రస్థాయిలో ఎంక్వయిరీ చేసి అడవులను నరుకుతున్న  వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, అడవి నాశనానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారకులవుతున్న అటవీశాఖ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వన ప్రేమికులు కోరుతున్నారు.
Spread the love