ఎంఎస్‌పీ చట్టం చేయం

MSP Let's make the law– ఐదు పంటలకే ఐదేండ్లపాటు ఎంఎస్‌పీ
– కనీస మద్దతు ధరపై కేంద్రం ప్రతిపాదన
– మిగిలిన పంటలకు ఎటువంటి హామీలేదు
– ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్‌కేఎం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఐదు పంటలకు ఐదేండ్ల పాటు ఎంఎస్‌పీ ఇస్తామని ప్రతిపాదించింది. మిగిలిన పంటల సేకరణకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. రైతులతో చర్చలు ప్రారంభమైన తర్వాత ఆదివారం (ఫిబ్రవరి 18) జరిగిన నాలుగో విడత చర్చల సందర్భంగా కనీస మద్దతు ధర హామీ అంశంపై రైతు నేతల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. ఆదివారం రాత్రి చండీగఢ్‌లోని మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్‌లో రైతులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన చర్చలు సోమవారం తెల్లవారుజామున 1.30 వరకూ 5:30 గంటల పాటు సుదీర్ఘంగా జరిగాయి. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు పాల్గొన్నారు. ఈ చర్చల్లో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, పంజాబ్‌ వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్‌ సింగ్‌ ఖుడియాన్‌ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రుల బృందం కీలక ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ ఏజెన్సీలు రైతులతో చట్టపరమైన ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఐదేండ్లపాటు మూడు పప్పుధాన్యాలు (మినుములు, కందులు, ఎర్రకందిపప్పు), మొక్కజొన్న, పత్తిని కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేస్తాయని ప్రతిపాదించింది. కేంద్రం తెచ్చిన ఈ ప్రతిపాదనపై రెండు రోజుల్లో తమ ఫోరమ్‌లలో చర్చించి, ఆ తరువాత భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని మంత్రులకు రైతు నేతలు తెలిపారు.
ఆందోళన కొనసాగుతుంది : రైతు నేతలు
చర్చల అనంతరం రైతు నేతలు దల్లెవాల్‌, సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ విలేకరులతో మాట్లాడుతూ ”ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై సంబంధిత ఫోరమ్‌లు, నిపుణులతో చర్చిస్తాం. అప్పుడు, మేం ఒక నిర్ధారణకు వస్తాం” అని తెలిపారు. ”రాబోయే రెండు రోజుల్లో తుది ఫలితం రాకపోతే ఈ నెల 21 నుంచి మా ‘ఢిల్లీ చలో’ కొనసాగుతుంది అన్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్‌కేఎం
ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ ప్లస్‌ 50 శాతంతో కూడిన మొక్కజొన్న, పత్తి, కందులు, మినుములు, ఎర్రకందిపప్పు వంటి ఐదు పంటలను కొనుగోలు చేయడానికి, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి రైతులు ఐదు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకోవాలని చండీగఢ్‌లో కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) తిరస్కరించింది. ఇది 2006లో ఎంఎస్‌ స్వామినాథన్‌ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్‌ సిఫార్సు చేసిన సి2ప్లస్‌50 శాతంతో కూడిన ఎంఎస్‌పీ హామీతో కూడిన అన్ని పంటల సేకరణ డిమాండ్‌ను దారి మళ్లించడమేనని ఎస్‌కేఎం పేర్కొంది. ఏ పంటలకైనా సి2ప్లస్‌50శాతంతో కూడిన ఎంఎస్‌పీ కంటే తక్కువ ఇచ్చిన ఏ హామీ దేశ రైతులకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. రుణమాఫీ, విద్యుత్‌ ప్రయివేటీకరణ, సమగ్ర ప్రభుత్వ రంగ పంటల బీమా పథకం, 60 ఏండ్లు పైబడిన రైతులకు నెలవారీ రూ.10 వేల పెన్షన్‌, లఖింపూర్‌ ఖేరీ మారణకాండకు ప్రధాన కుట్రదారు కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించి, ప్రాసిక్యూట్‌ చేయాలనే డిమాండ్లపై మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో స్పష్టం చేయాలని కేంద్ర మంత్రులను ఎస్‌కేఎం డిమాండ్‌ చేసింది. మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను, కార్పొరేట్‌ అవినీతిని బట్టబయలు చేసేందుకు రైతులు పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. పంజాబ్‌ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులపై క్రూరమైన అణచివేతకు స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. దేశ వ్యాప్తంగా బీజేపీ, ఎన్డీయే ఎంపీల నియోజకవర్గాల్లో శాంతియుత ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించాలని ఎస్‌కెేఎం పిలుపునిచ్చింది. ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న ఎస్‌కేఎం జనరల్‌ బాడీ సమావేశం పరిస్థితిని సమీక్షిస్తుందనీ, అన్ని డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటాన్ని ఉధృతం చేసేందుకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపింది.
రైతులపై పెల్లెట్‌ గన్‌ల ప్రయోగంపై జోక్యం చేసుకోండి : సుప్రీంకోర్టును కోరిన మానవ హక్కుల సంఘాలు
హర్యానా పోలీసులు, కేంద్ర బలగాలు ఢిల్లీకి మార్చ్‌ చేస్తున్న రైతులపై పెల్లెట్‌ గన్‌లను ప్రయోగించకుండా ఆపేలా జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘాలు న్యాయస్థానాన్ని కోరాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశాయి. లేఖ రాసిన వాటిలో పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల సంఘాలు ఖల్రా మిషన్‌ ఆర్గనైజేషన్‌ (కేఎంఓ), పంజాబ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ (పీహెచ్‌ఆర్‌ఓ), హ్యూమన్‌ రైట్స్‌ జస్టిస్‌ ఫోరమ్‌ ఉన్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు పెల్లెట్‌ గన్‌లను ప్రయోగిస్తున్నందున జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ముగ్గురు రైతులకు చూపు పోయిందనీ, వారిలో పలువురు పంజాబ్‌, చండీగఢ్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఈ సంఘాల నేతలు తెలిపారు.

Spread the love