పెద్దల సభకు మోసగాళ్లను పంపొద్దు

పెద్దల సభకు మోసగాళ్లను పంపొద్దు– ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు ఖాయం
– మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ-నల్లగొండటౌన్‌
పెద్దల సభలకు మేధావులను పంపాలే కానీ మోసగాళ్లను కాదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థుల గుణగణాలను చూసి గ్రాడ్యుయేట్లు ఓట్లేసి గెలిపించాలన్నారు. ఈ ఉప ఎన్నికల్లో రాకేశ్‌రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు అవకాశమిస్తే అడుగడుగునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. బ్లాక్‌మెయిల్‌ దందా చేసే కాంగ్రెస్‌ అభ్యర్థిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఒక్క ఉద్యోగ నియామకం కాలేదని, తమ ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్‌లకే అపాయింట్‌మెంట్‌ లెటర్లు పంచుతూ సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికలలో విద్యావంతునికి పట్టం కడతారా..? బ్లాక్‌మెయిలర్‌కు పట్టం కడతారా నిరుద్యోగులే ఆలోచించాలన్నారు.
56 కేసులు ఉన్న బ్లాక్‌ మెయిల్‌ అభ్యర్థికి ఓటు వేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తుందన్నారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో నాలుగుసార్లు గెలిచి విజయఢంకా మోగించామని, ఈసారి కూడా విజయం తమదేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైందన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపించాలని కోరారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్నాహక సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, పార్లమెంట్‌ అభ్యర్థులు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్‌, బూడిద భిక్షమయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Spread the love