నా టిక్కెట్‌ రద్దుచేసే ధైర్యముందా..?

Do you have the courage to cancel my ticket?– వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌
– బీజేపీ ఎంపీ ప్రకటనపై డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఆగ్రహం
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషన్‌ సింగ్‌ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని అన్నారు. యూపీలోని బారబంకిలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ మాట్లాడుతూ.. ‘నా టిక్కెట్‌ను ఎవరు రద్దు చేస్తారు? మీరు చేస్తారా? చేస్తారా?… మీకు ధైర్యముంటే… ఎవరు రద్దుచేస్తారో.. పేరు చెప్పండి..’ అని అన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు పాల్పడ్డారని బ్రిజ్‌భూషన్‌ సింగ్‌పై ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, అవేమీ బ్రిజ్‌ భూషన్‌ను రాజకీయంగా బలహీనపర్చటం లేదు. తనపై వచ్చే ఆరోపణలను ఏమీ పట్టించుకోకుండా, వాటికి సమాధానమివ్వకుండా అటు బీజేపీ అధిష్టానం, ఇటు బ్రిజ్‌ భూషన్‌ వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాననీ, తన టిక్కెట్‌ను ఎవరూ రద్దు చేయలేరని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
బ్రిజ్‌ భూషణ్‌కు ‘పెద్ద మద్దతు’ ఉన్నది : డీసీడబ్ల్యూ చీఫ్‌ స్వాతి మలివాల్‌
వీడియో వైరల్‌ కావడంతో బ్రిజ్‌ భూషణ్‌పై సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వస్తున్నది. ఆయనపై కేసు విచారణలో ఉన్నప్పటికి అతను అహంకారపూరితంగా వ్యవహరించటాన్ని సోషల్‌ మీడియాలో చాలా మంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌(డీసీడబ్ల్యూ) చీఫ్‌ స్వాతి మలివాల్‌ కూడా ఇదే రీతిలో స్పందించారు. బ్రిజ్‌ భూషణ్‌ మాటలకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు అంత శక్తి అహంకారాన్ని చూపించడానికి వెనుక ”పెద్ద మద్దతు” ఉన్నదని ఆరోపించారు. ”దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన కూతుళ్లను లైంగికంగా వేధించిన బ్రిజ్‌ భూషణ్‌ తన టికెట్‌ రద్దు చేసే ధైర్యం ఎవరికి ఉందని బహిరంగంగా సవాల్‌ చేస్తున్నాడు? ఒక పెద్ద మనిషి మాత్రమే దీనికి బాధ్యత వహించాలి. అందుకే అతనికి అధికార అహంకారం ఉంది”అని ఆమె పేర్కొన్నారు. స్వాతి మలివాల్‌ గతంలోనూ డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ను నిందించారు. దేశంలోని మల్లయోధుల నుంచి లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపు ఆరోపణలు వచ్చిన తర్వాత.. అతను జైలులో ఉండాలి..పార్లమెంటులో కాదు అని ఆమె ఆరోపించారు.

 

Spread the love