శాంతి కావాలా.. ఘర్షణ కావాలా..!

Do you want peace.. Do you want conflict..!– నిర్ణయించుకోవాల్సింది మనమే : చైనా నేత జిన్‌పింగ్‌
– కృత్రిమ మేథస్సుపై సహకారం పెంపునకు బైడెన్‌ అంగీకారం
– మిలటరీ కమ్యూనికేషన్‌ పునరుద్ధరణకు సమ్మతి
శాన్‌ఫ్రాన్సిస్కో: శాన్‌ఫ్రాన్సిస్కోకి దక్షిణంగా ఫిలోని ఎస్టేట్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. వ్యూహాత్మక, విస్తృతాంశాలపై, చైనా-అమెరికా సంబంధాలకు సంబంధించి దిశా నిర్దేశం చేయాల్సిన అంశాలపై ఇరువురు నేతలు సమగ్రంగా, కూలంకషంగా చర్చలు జరిపారు. అలాగే ప్రపంచ శాంతి, అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలపై కూడా వారు చర్చించారు. కృత్రిమ మేథస్సుపై సహకారం పెంచుకోవడంతో సహా వివిధ రంగాల్లో చర్చలను, సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అలాగే ఉన్నత స్థాయిలో ఇరు దేశాల మిలటరీల మధ్య కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించుకోవాలని కూడా నిర్ణయించాయి. అక్రమ మందుల సరఫరాలను నియంత్రించడంలో పరస్పరం సహకరించుకునేందుకు ఒక వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. సమానత్వం, గౌరవం ప్రాతిపదికన చైనా-అమెరికా రక్షణ విభాగ వర్కింగ్‌ గ్రూపుల సమావేశాలు నిర్వహించాలని, సముద్ర జలాల భద్రతపై సంప్రదింపుల యంత్రాంగం సమావేశాలు జరపాలని నిర్ణయించారు. ఇరు దేశాల మిలటరీ ప్రాంతీయ నేతలు క్రమం తప్పకుండా చర్చలు జరపాలని కూడా అంగీకరించారు. వచ్చే ఏడాదినుండి రెండు దేశాల మధ్య విమానాల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు అంగీకారం కుదిరింది. విద్య, అంతర్జాతీయ విద్యార్ధులు, యువత, సంస్కృతి, క్రీడలు, వాణిజ్య వర్గాలు తదితర రంగాల్లో పరస్పర మార్పిడులను విస్తరించాలని కూడా నిర్ణయించాయి. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కార్యకలాపాలను, చర్యలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. బుధవారం ఉదయం దాదాపు 11గంటలకు ప్రారంభమైన సమావేశం 1.35గంటలకు ముగిసింది. ప్రారంభ పలుకులు తర్వాత పలు సెషన్లలో పాల్గొని, వర్కింగ్‌ లంచ్‌ చేసిన తర్వాత ఇరువురు నేతలు చారిత్రకమైన ఆ ఎస్టేట్‌లో కాసేపు కలియతిరిగారని మీడియా వార్తలు తెలిపాయి.
సరైన దారి ఎంచుకోవాల్సింది మనమే : జిన్‌పింగ్‌
శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఈనాడు ప్రపంచం ప్రధానమైన మార్పులకు లోనవుతోందని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. చైనా, అమెరికాలకు రెండు అవకాశాలు వున్నాయి. సమైక్యతను, సహకారాన్ని పటిష్టపరచడం, ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొనేందుకు చేతులు కలపడం, అంతర్జాతీయ భద్రత, సంక్షేమాలను పెంపొందించడమన్నది మొదటి అవకాశం కాగా, తటస్థ వైఖరితో వుంటూ, కూటముల ఘర్షణలను రెచ్చగొట్టడం, సంక్షోభాలు, చీలికలు దిశగా ప్రపంచం పయనించేందుకు అనుమతించడమన్నది రెండవ అవకాశమని అన్నారు. ఈ రెండు అవకాశాలు రెండు భిన్నమైన మార్గాలు, ఇవి మానవాళి, ఈ భూగోళం భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సంబంధంగా చైనా-అమెరికా సంబంధాలను ఈ నేపథ్యంలోనే పరిగణించాల్సి వుందని అన్నారు. చైనా, అమెరికాలు రెండూ ఒకదాన్ని మరొకటి మార్చడానికి ప్రయత్నించడమనేది పూర్తి అవాస్తవికంగా వుంటుందన్నారు. వీటివల్ల వచ్చే పర్యవసానాలు, ఘర్షణలన్నవి ఎవరికైనా భరించరానివిగానే వుంటాయని జిన్‌పింగ్‌ నొక్కి చెప్పారు. అధికార పోటీ అన్నది చైనా, అమెరికా, ప్రపంచం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిం చదన్నారు. ఒకరు విజయం సాధించారంటే అది మరొకరికి అవకాశంగా వుంటుందన్నారు. తనదైన విధానాలు, నిబంధనలతో చైనా అభివృద్ది సాగుతుందని చెప్పారు. పాత వలసవాద విధానాన్ని చైనాఅనుసరించదన్నారు. ఎస్టేట్‌లో విలేకర్లతో మాట్లాడుతూ బైడెన్‌, చర్చలు బాగా జరిగాయన్నారు. నిజమైన పురోగతి సాధించామని సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించారు.

Spread the love