టికెట్‌ వచ్చిందని ఇగోలకు పోవద్దు

టికెట్‌ వచ్చిందని ఇగోలకు పోవద్దు– జగన్‌ కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
– పార్టీ నాయకులతో టిడిపి అధినేత చంద్రబాబు
అమరావతి: టికెట్‌ వచ్చిందనే అహంకారం (ఇగో)తో వ్యవహరిస్తే కుదరదని పార్టీ అభ్యర్థులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంత సీనియర్‌ నేతయినా, నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలున్నా చివరి వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలని సూచించారు. టిడిపి-జనసేన తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులకు చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని, వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమని, ఎక్కడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదని చంద్రబాబు చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదన్నారు. ఒక్క సీటూ ఓడిపోవడానికి వీల్లేదన్నారు. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రకటించామని, ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. తటస్తులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి, అన్ని తరగతుల మద్దతు కోరాలన్నారు. మిత్రపక్షంగా ఉన్న జనసేన నేతలను గౌరవించాలని, వారిని కలుపుకొని వెళ్లాలని తెలిపారు. రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుందన్నారు. ఐదేళ్ల పాలనపై గ్రామాల్లో వైసిపి నేతలు, కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారని, పార్టీలోకి వస్తే ఆహ్వానించాలని సూచించారు. ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని, ప్రతి అభ్యర్థీ న్యాయవాదిని నియమించుకోవాలని సూచించారు. ఊహించని స్థాయిలో వైసిపి అధినేత జగన్‌ కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. జగన్‌ తన పాలనను కాకుండా దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లను నమ్ముకున్నారని విమర్శించారు. ఎన్నికలకు జగన్‌ సిద్ధంగా లేరని, సభలు నిర్వహిస్తూ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయారని అన్నారు.
టికెట్‌ రాని నేతలకు బుజ్జగింపులు
టిడిపి తొలి జాబితాలో చోటుదక్కని నేతలకు పార్టీ అధిష్టానం బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఆదివారం ఉండవల్లిలో తన నివాసంలో కొంతమంది నేతలను పిలిపించుకుని వారికి సర్ది చెప్పారు. తెనాలి సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, అనకాపల్లి సీటు ఆశించిన పీలా గోవింద సత్యనారాయణకు పొత్తులో భాగంగా త్యాగం చేయక తప్పదని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం రాగానే తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మైలవరం నుంచి వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ పోటీ చేస్తారని, పెనమాలూరు నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో చెప్పినట్లు తెలిసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చెప్పారు. గంటా విశాఖ నుంచి గానీ, భీమిలి నుంచి గానీ పోటీ చేస్తానని తన అభిప్రాయం చంద్రబాబుతో చెప్పారు. బిజెపి అడగకపోతే రాజమండ్రి లోక్‌సభ సీటు కేటాయిస్తానని బొడ్డు వెంకటరమణతో అన్నట్లు తెలిసింది. సోమవారం కూడా పలువురు నేతలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు.

Spread the love