గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోరా..!

– 7 రోజున జీపీ కార్మికుల అర్థ నగ్న ప్రదర్శన 
– కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ 
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
7 రోజులుగా తాము సమ్మె చేస్తున్న రాష్ట్ర  ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధకరమని గ్రామ పంచాయతీ కార్మికులు అన్నారు. దుబ్బాక మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 7వ రోజు చేరిన సందర్భంగా కార్మికులంతా మోకాళ్ళపై అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండల నాయకులు ప్రశాంత్, రవీందర్, శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీపి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు  జీవో ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. ఉమ్మడి దుబ్బాక మండల పరిధిలోనీ 30 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులపై సెక్రటరీలు, ప్రజా ప్రతినిధులు వేధింపులు మానుకోవాలని హెచ్చరించారు. ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించక పోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిద్రలేచిన నుంచి మొదలు గ్రామాల్లో సేవలు చేస్తున్న మా బాగోగులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను పెంచి, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికులందరికీ న్యాయం చేసే వరకు తాము సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రశాంత్, శ్రీను, రవి, శ్రీకాంత్, దుర్గవ్వ, ఎల్లవ్వ, బాబాయి, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.
Spread the love