బెదిరింపులకు త‌లొగ్గ‌క‌…

Don't give in to threats...దాదాపు దశాబ్ద కాలంగా అక్రమ రవాణాదారుల నుంచి పిల్లలను కాపాడే పనిలో నిమగమయ్యింది పల్లవి ఘోష్‌. 2012లో గ్రాడ్యుయేషన్‌ కోసం ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చిన ఆమె ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌లో చేరింది. చెన్నైలో జెండర్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ కూడా పూర్తి చేసింది. తన చిన్న వయసులో ప్రత్యక్షంగా చూసిన ఓ ఘటన ఆమె జీవితంలో చెరగని ముద్రవేసింది. అసోంలోని లుమ్‌డింగ్‌లో పుట్టి పెరిగిన ఆమెను 12 ఏండ్ల వయసులో ఎదురైన ట్రాఫికింగ్‌ కేసు ఆమె జీవితాన్ని ఎలా మలుపుతిప్పిందో
ఈనాటి మానవిలో…
పశ్చిమబెంగాల్‌లో నివసించే తన మేనమామ ఇంటికి ప్రతి వేసవి సెలవుల్లో వెళుతుండేది పల్లవి. అప్పుడు ఆమె వయసు 12 ఏండ్లు. 6వ తరగతి చదువుతుంది. అక్కడ ఓ భయంకరమైన ఘటన చూసింది. కూతురును కోల్పోయిన ఓ వ్యక్తి అరుపులతో ఆమె చలించిపోయింది. కోల్‌కతాలోని 24 పరగణాల గ్రామంలో ఓ వ్యక్తి నిస్సహాయంగా అరుస్తూ నడుస్తున్నాడు. తన కూతురుని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకుపోయాడు. తన వయసులో ఉన్న బాలిక ఎలా అదృశ్యమైందో అప్పుడు పల్లవికి అర్థంకాలేదు. ఎవరు తీసుకెళ్ళారు? ఆమెను ఏం చేస్తారు? అనేక ప్రశ్నలు వెంటాడాయి. అన్నిటికీ మించి ఆ బాలిక తండ్రి ఆవేదన వర్ణనాతీతం… ‘ఏక్‌ భయ్యా ఆతే హై యమహా మే ఔర్‌ ఇన్హే లేకే జాతే హై (ఒక వ్యక్తి యమహా మీద వచ్చి అమ్మాయిని ఎత్తుకెళ్ళాడు) అని ప్రత్యక్షసాక్షి ఒకరు బాధితురాలి తండ్రికి చెప్పటం తనూ విన్నది. కొన్ని వారాల తర్వాత.. సెలవులు ముగిసి ఇంటికి తిరిగి వచ్చినా.. ఆ సంఘటన ఆమెను వెంటాడుతూనే ఉంది.
‘తప్పిపోయిన పిల్లలను వెతకడం మొదలుపెట్టాను’
అక్రమ రవాణాని అర్థం చేసుకోవడానికి ఆమె వయస్సు చాలా చిన్నది. అయినప్పటికీ ఆమెలోని ఉత్సుకతే ఆ చీకటి ప్రపంచం గురించి క్రమంగా తెలుసుకునేలా చేసింది. తప్పిపోయిన పిల్లల గురించి తెలుసుకునే ప్రయత్నంలో తల్లిదండ్రులు, స్నేహితులు, తన చుట్టూ ఉన్న ఇతరులతో మాట్లాడటం ప్రారంభించింది. కానీ ఎవరి దగ్గరా సమాధానాలు దొరకలేదు. తను 11వ తరగతిలో ఉన్నప్పుడు ఈ సమస్యపై స్వయంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకుంది. ‘అసోంలో, మా ఇంటికి సమీపంలో ఒక పోలీసు స్టేషన్‌ ఉంది. పిల్లలను ఎత్తుకొచ్చి వీధులు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లలో భిక్షాటన వృత్తిలోకి నెడతారని పోలీసు అధికారి ఒకరు నాతో చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది’ అంది పల్లవి.
అసోంలోని రైల్వే స్టేషన్‌లకు వెళ్ళి అక్కడ పరిశీలించేది. గౌహతి రైల్వే స్టేషన్‌లో చిన్న పిల్లలు అనర్గళంగా హిందీ మాట్లాడుతుండటాన్ని గుర్తించింది. వారితో మాట్లాడగా.. వారు రాజస్థాన్‌, బీహార్‌కు చెందినవారని తెలుసుకుంది. అక్రమ రవాణా ద్వారానే వారంతా ఇక్కడకు తీసుకురాబడ్డారని అర్థమైంది. రైల్వే స్టేషన్ల వద్ద అడ్డుక్కోవటమేకాదు.. ముఖ్యంగా వ్యభిచార గృహాలకు ఆడపిల్లలను అమ్మేస్తున్నారు. అక్కడ వారిని సెక్స్‌ వర్కర్లుగా మారుస్తున్నారు. ‘నేను వెళ్లిన ప్రతిచోటా సమస్య ఎంత జటిలమైందో అర్థమైంది. ఆ సంఘటన నాపై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే ఈశాన్య, పశ్చిమ బెంగాల్‌లో అక్రమ రవాణాపై పరిశోధన చేయడం ప్రారంభించాను’ అని ఆమె చెప్పింది.
‘ఒక దుర్మార్గం. అనేక కారణాలు’
దేశంలో అక్రమ రవాణాకు పేదరికమే ప్రధాన కారణం. నిరుద్యోగం, నిరక్షరాస్యత, వలసలు (ఇంట్రా, ఇంటర్‌-కంట్రీ), సోషల్‌ మీడియా ప్రభావం వంటివి ఇతర కారణాలు. వ్యభిచార కూపాలకు అమ్మేసేందుకు బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారు. బలవంతపు, బాల్య వివాహాలు చేసుకోని వారిని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి మురికి కూపాల్లోకి నెట్టేస్తున్నారు. లేబర్‌ పని, ఫ్యాక్టరీ పని కోసం… మగపిల్లలను ఎత్తుకెళుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కానింగ్‌ ప్రాంతం నుంచి అక్రమ రవాణాకు గురైన సీత గురించి చెబుతూ… ‘బెంగాల్‌కు చెందిన సీతను ఓ వ్యక్తి ప్రేమలోకి దించాడు. ఢిల్లీలో మెరుగైన జీవితం కల్పిస్తానని ఆశ చూపాడు. ఆమెను తీసుకొచ్చే క్రమంలో… హౌరా స్టేషన్‌లో టీ తాగించాడు. అందులో మత్తు పదార్థాన్ని కలిపాడు. అది తాగిన ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చేసరికి వ్యభిచార గృహంలో ఉంది. ‘2015లో ఢిల్లీ రెడ్‌ లైట్‌ ఏరియా నుంచి సీతతో పాటు మరో ఎనిమిది మంది బాలికలను రక్షించాం.. ఆ తర్వాత ఆమెను తన ఇంటికి చేర్చాం. ఎల్‌ అండ్‌ టీలో పనిచేస్తున్న ఇంజనీర్‌ని సీత వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు నాలుగేండ్ల పాప’ అని పల్లవి గుర్తుచేసుకుంది. పల్లవి ప్రకారం… దేశంలో ప్రతిరోజూ 2,000 మంది పిల్లలు అక్రమంగా రవాణాకు గురవుతున్నారు.
ఢిల్లీలో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా…
సమస్యపై దృష్టి సారించిన ఆమె… 2012లో ఢిల్లీలోని అటువంటి కేసులను పరిష్కరించే సంస్థలో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా చేరింది. ఓ రోజు రెస్కూ ఆపరేషన్‌కు సిద్ధమవ్వగా.. అందుకు సంబంధించిన అధికారి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో పల్లవి ఆ రెస్క్యూ మిషన్‌కు నేతృత్వం వహించింది. రెస్క్యూ మిషన్‌ విజయవంతమైంది. ఇలాంటి పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురాగలనన్న నమ్మకం ఆమెలో పెరిగింది. ఆ తర్వాత ఆరేండ్లు అదే సంస్థలో కొనసాగింది. గత 11 ఏండ్లలో 10,000 మందిని అక్రమ రవాణా నుంచి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో కలిసి రక్షించింది.
అక్కడితో ఆగలేదు
పిల్లలను రక్షించడం మాత్రమే సరిపోదు. వారికి పునరావాసం కల్పించడం కీలకం. పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది. ఇందుకు సొంతంగా ఓ సంస్థను ప్రారంభించాలనుకుంది. డిసెంబర్‌ 2020లో ‘ఇంపాక్ట్‌ అండ్‌ డైలాగ్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించింది. చైల్డ్‌ ట్రాఫికింగ్‌పై దేశంలో అవగాహన తక్కువ. అసోం, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నది. అక్రమ రవాణా గురించి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పిస్తున్నది. ‘నేను లక్ష్యంగా ఎంచుకున్న ఆ ప్రాంతాల్లోని ఇండ్లకు వెళ్ళి.. అక్రమ రవాణా గురించి మహిళలతో మాట్లాడటానికి ప్రయత్నించగా వారు ఏదోలా చూసేవారు.. ముఖం మీదే తలుపులు మూసేసేవారు. అయినా పట్టు వదలకుండా తిరిగాను. ఆ తర్వాత వారికి అర్థమైంది. ఇప్పుడు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తారు’ అంటుంది. ఏడాదిన్నర వ్యవధిలో, పల్లవి ఈశాన్య ప్రాంతంలోని 75,000 మంది మహిళలకు చేరువయ్యింది. పిల్లల అక్రమ రవాణా, జాగ్రత్తగా ఎలా ఉండాలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నది. సామాజిక దురాచారాలపై వర్క్‌షాప్‌లు, కథనాల ద్వారా వారిని చైతన్యవంతులను చేస్తున్నది. 2014 నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థితో కూడా పనిచేసింది. ఓ కేసులో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం వచ్చిన సత్యార్థితో ఆమె కలిసి పనిచేసింది.
సొంతకాళ్ళపై నిలబడేలా…
మురికి కూపాల నుంచి బయటపడిన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం వల్ల వారి జీవితాలు మెరుగుపడవనీ, వారి జీవితాల్లో సమూలమైన మార్పు తీసుకురావాలని అర్థమైంది. వారిని శక్తివంతులను చేసే సొంత పునాదిని ఏర్పాటుచేయాలనుకుంది. అసోంలో ఒక మ్యాపింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది పునరావాసంలో శిక్షణ పొందిన బాలికలు.. ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి వీలు కల్పిస్తుంది. టైలరింగ్‌లో అనేక మంది బాలికలు శిక్షణ పొందారు. కొంతమంది వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ‘నేను ప్రారంభించిన ఫౌండేషన్‌ ఇంత ప్రభావం చూపుతుందని ఊహించలేదు’ అంటుంది పల్లవి.
2019లో గుజరాత్‌లో ఓ అమ్మాయిని వ్యభిచార గృహానికి అమ్మేసిన కేసు గురించి చెబుతూ… తను ఇప్పుడు డాక్టర్‌ చదువుతోంది. రక్షించే అమ్మాయిలను ఏదో విధంగా నిలదొక్కుకునేలా చేయాలన్నదే పల్లవి ప్రయత్నం. ఆమె రక్షించిన మరొక అమ్మాయి ఇప్పుడు ఫౌండేషన్‌లో నిర్ణయాలు, విధాన రూపకల్పన ప్రక్రియలో భాగస్వామి. ‘దీదీ నాకు రెండో జీవితమిచ్చింది. నేను మళ్లీ స్వేచ్ఛగా ఉంటానని ఊహించలేదు. నా కాళ్లపై నేను నిలబడగలిగాను. ఇప్పుడు ట్రాఫికింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది నా ఆకాంక్ష. తద్వారా నేను మోసపోయినట్టు ఎవరూ మోసపోకూడదు..’ అంటుంది బాధితురాలు.
ప్రమాదంతో కూడుకున్నదైనా..
తను చేస్తున్న ఈ ఉద్యమం అంత ఈజీ కాదు. ప్రమాదంతో కూడుకున్నది. ట్రాఫికింగ్‌ మాఫియాల నుంచి బెదిరింపులు ఎదుర్కొంది. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. ‘తీస్‌ హజారీ కోర్టులోనే చంపేస్తామంటూ కత్తితో హెచ్చరించారు. అయితే, రక్షించిన అమ్మాయిల నుంచి పువ్వులు, ప్రశ్నంసలూ పొందుతున్నాను. వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. బెదిరింపులతో పోలిస్తే ఇవి ఎంతో విలువైనవి, సంతృప్తినిస్తాయి’ అంటుంది పల్లవి.

Spread the love