వడివడిగా జాబిల్లి చెంతకు..!

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌ 3 జాబిల్లికి మరింత చేరువైంది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌, కమాండింగ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) చంద్రయాన్‌ 3 కక్ష్యను బుధవారం ఉదయం 8.30 గంటలకు కుదించి చివరిదైన 5వ కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో తెలిపింది. ‘జాబిల్లి దిశగా ఇక ఒక అడుగే దూరం..చంద్రుని చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య. 153 కిమీ × 163 కిమీ క్షక్ష్యలోకి వ్యోమనౌక ప్రవేశించింది. దీంతో చంద్రుని చేరేందుకు అవసరమైన విన్యాసాలు పూర్తయ్యాయి. ఇక ల్యాండ్‌ అవ్వడమే మిగిలింది’ అని ఇస్రో బుధవారం తెలిపింది. చంద్రయాన్‌ 3 వ్యోమనౌకలో ల్యాండర్‌ మాడ్యూల్‌ (ఎల్‌ఎం), ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ (పిఎం), రోవర్‌ వున్నాయి. ఈ నెల 17న పిఎం నుంచి ఎల్‌ఎం విడిపడి ప్రయాణాన్ని సాగిస్తాయని ఇస్రో పేర్కొంది. అన్ని సజావుగా సాగితే చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రయాన్‌ మోసుకెళ్లిన రోవర్‌ పరుగులు తీయనుందని తెలిపింది. గత జులై నెల 14వ తేదీన శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్‌ 3ని నింగిలోకి పంపిన సంగతి తెలిసిందే.

Spread the love