ఉదయం పూట..నడి రోడ్డుపై మద్యం తాగుతూ హల్‌చల్‌

ఉదయం పూట..నడి రోడ్డుపై మద్యం తాగుతూ హల్‌చల్‌– యువతీ యువకుని దురుసు ప్రవర్తన
– మార్నింగ్‌ వాకర్స్‌తో వాగ్వాదం
నవతెలంగాణ-నాగోల్‌
పొద్దు పొద్దున్నే ఓ యువతీ యువకుడు నడిరోడ్డుపై మద్యం తాగుతూ హంగామా సృష్టించారు. మార్నింగ్‌ వాకర్స్‌తో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన హైదరాబాద్‌ లోని నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నాగోల్‌ డివిజన్‌ ఫతుల్లాగూడ సమీపంలో గుర్తుతెలియని యువకుడు, యువతి కారులో వచ్చారు. సర్వీస్‌ రోడ్డుపైనే మద్యం తాగుతూ హల్‌చల్‌ చేశారు. బీర్లు, సిగరెట్‌ తాగుతూ కారులో పాటలు పెట్టుకున్నారు. దాంతో పబ్లిక్‌ ప్లేస్‌లో ఈ న్యూసెన్స్‌ ఏంటని వాకింగ్‌ చేస్తున్న వారు ప్రశ్నించడంతో యువతీ యువకుడు వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారు. ”మీరు తాగట్లేదా..’ అంటూ యువతి దుర్భాషలాడగా.. వాకర్స్‌లో ఒకరు ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. దాంతో అతని వద్ద నుంచి వారు ఫోన్‌ లాక్కోవడానికి ప్రయత్నించారు. వాకర్స్‌ ఇది మంచి పద్ధతి కాదని వారిని వారించారు. అయినా వారు స్థానికులతో దురుసుగా ప్రవర్తించడంతో యువతీయువకున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉండగా, ఫతుల్లాగూడ సర్వీసు రోడ్డులో వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని, పలువురు యువకులు కార్లు, బైకుల రైడింగ్‌లు చేయడంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు స్పందించి ఫతుల్లాగూడ సర్వీస్‌ రోడ్డులో పర్యవేక్షణ చేస్తూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Spread the love