మానవాళికి శత్రువులు మాదకద్రవ్యాలు

మానవాళికి శత్రువులు మాదకద్రవ్యాలుఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ ఒక సంచలనాత్మక వార్తగా నిలిచింది. మత్తుమందులు సేవించడం, పెద్ద పెద్ద వాళ్ళు ఈ వ్యవహారంలో ఉన్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో మత్తుమందు వాడకం ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వాడకం అధికమవడం, తరచూ పట్టుబడటం కనపడుతుంది. ఇక ఇటీవల ఖమ్మంలో మత్తుకు బానిస అవ్వద్దు అని తండ్రి మందలిస్తే, సాక్షాత్తు ఆ తండ్రినే కడతేర్చాడు ఒక కొడుకు. ఇలా… రకరకాల అఘాయిత్యాలు, దాడులు, ఆత్మహత్యలకు కారణం మాదకద్రవ్యాలు వాడకం అని తెలుస్తోంది. భవిష్యత్తులో మంచి సమాజం ఏర్పడాలి అంటే తక్షణమే మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. జూన్‌ 26వ తేదీన ‘ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం…
గత దశాబ్ద కాలంలో ప్రపంచ జనాభాలో 22 శాతం మత్తు మందులకు బానిసలుగా చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 296 మిలియన్ల మంది డ్రగ్స్‌ వాడుతుండగా, వీరిలో 36 మిలియన్ల మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 40 శాతం యువత మత్తులో మునిగి తేలుతోంది. 315 మిలియన్ల అమెరికన్‌ డాలర్ల డ్రగ్స్‌ వ్యాపారం జరుగుతోంది. హైదరాబాద్‌ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ప్రపంచంలో ఉగ్రవాదం తరువాత అంత ‘పెనుసవాలు’గా పరిణమిస్తున్న సమస్య మాదకద్రవ్యాల వినియోగం. పురాతన కాలంనుండి చాలా దేశాల్లో ఈ సమస్య ఉన్నప్పటికీ కొద్ది మందికి మాత్రమే పరిమితమై, రెండు మూడు రూపాల్లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభ్యమయ్యే పరిస్థితి ఉండేది. అయితే నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, రకరకాల మాధ్యమాలు, పద్ధతులు ద్వారా పట్టణాల నుండి మారుమూల ప్రాంతాలకూ అందుబాటులోకి వచ్చాయి డ్రగ్స్‌. ముఖ్యంగా వీటికి యువత బలవుతోంది. మత్తుకు అలవాటు పడిన వారు శారీరకంగా మానసికంగా అనారోగ్యాలకు గురై, మరణాలు పెరుగుతున్నాయి. ఈ ఊబిలోంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగానే, డ్రగ్స్‌ వాడకం వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కలిగించే దిశగా జూన్‌ 26వ తేదీని ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. 2024 సంవత్సరానికి ‘పీపుల్‌ ఫస్ట్‌.. స్టాప్‌ స్టిగ్మా అండ్‌ డిస్క్రిమినేషన్‌, స్ట్రెంథన్‌ ప్రివెనెషన్‌’ అనే థీమ్‌తో జరుపుతున్నారు.
‘1987 డిసెంబర్‌ 7వ తేదీన వియన్నాలో సమావేశమైన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 42/ 112 తీర్మానం చేసి, 1989 జూన్‌ 26వ తేదీన మాదకద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ‘ఇంటర్నేషనల్‌ డే అగైనెస్ట్‌ డ్రగ్‌ అబ్యూస్‌ అండ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫికింగ్‌’ రోజుగా జరపాలని నిర్ణయించారు. 2021 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది మత్తుమందులకు బానిసలై, జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. ఇక మన దేశంలో పదిహేను శాతం జనాభా మత్తుమందులకు బానిసలయ్యారని, 18 లక్షల మంది ‘కోకైన్‌’ వాడుతున్నారని, వీరిలో సుమారు ఐదు (4.6) లక్షల మంది పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. మాదకద్రవ్యాల వాడకంలో ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఆల్కహాల్‌, కెనాబిస్‌, నల్లమందు, హెరాయిన్‌, బ్రౌన్‌షుగర్‌ వంటి మత్తు మందులు మనదేశంలో ఎక్కువగా వాడుతున్నట్లు సమాచారం.
ముందు సరదాగా, హుషారు కోసం అలవాటు పడి, తరువాత బానిసలై, శారీరక మానసిక బాధలు అనుభవిస్తూ, జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. దీనికి అలవాటు పడిన వారు శారీరక, మానసిక నియంత్రణ కోల్పోతారు. విలక్షణ శైలి ప్రదర్శిస్తారు. శరీరభాగాలు మెదడు, మూత్ర పిండాలు, నాడీవ్యవస్థ, గుండె, లివర్‌, జీర్ణవ్యవస్థ వంటి సున్నిత భాగాలు బాగా దెబ్బతిన్ని, మత్యువాత పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి, అయినవారికి దూరమై బతుకు బుగ్గిపాలవుతున్న మత్తుబానిసలు ఎందరో!
సరిహద్దు దేశాలు ఆప్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ నుంచి విరివిగా మత్తు పదార్థాలు మనదేశంలో రహస్య మార్గాలలో చేరుతున్నట్లు సమాచారం. జల, వాయు మార్గాల ద్వారా చీకటి వ్యాపారాలు చేస్తూ, మత్తు సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో అనేక చిన్న, పెద్ద వ్యక్తులకు సంబంధాలన్నట్లు భోగట్టా. ముఖ్యంగా, మారిజువానా, చరస్‌, నల్లమందు, హెరాయిన్‌, బ్రౌన్‌ షుగర్‌, యన్‌.పి.యస్‌ తదితర మత్తు మందులు మనదేశంలో ఎక్కువగా వాడుతున్నారు. పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో ఎక్కువ మత్తు మందు వినియోగంలో ఉండగా, క్రయవిక్రయాలు మాత్రం హైదరాబాద్‌, చెన్నైలో ఎక్కువగా జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. చైనా, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో కొన్ని కోట్ల రూపాయల మత్తు మందులు మనదేశ సిబ్బంది పట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఆఫ్రికా దేశాలనుండి అనేక రకాల మత్తుమందులు, గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు.
మారుమూల ప్రాంతాల్లో పండిస్తూ, అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ తరచూ పట్టుబడడం నిరంతరం చూస్తూనే ఉన్నాం. మనదేశం నార్కోటిక్స్‌, డ్రగ్స్‌ అండ్‌ సైకో ట్రాఫిక్‌ సబ్స్టన్స్‌ చట్టం చేశారు. దీనిని ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు..
ఈ డ్రగ్స్‌ ముక్కు, నోరు, ఇంజెక్షన్‌, ద్వారా తీసుకుని మరో ప్రపంచంలో తూలుతున్నారు. రసాయనిక పూతతో మాత్రలు, చూర్ణం, ద్రవాలుగా సుమారు ఏడు వందల రూపాల్లో మత్తుబాబులు స్వీకరిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. నూతన ప్రసార మాధ్యమాలు వాట్సాప్‌, వివిధ వెబ్‌ సైట్లు ద్వారా ఈ దందా నడుపుతున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీ, కాలేజీ విద్యార్థులను ఈ మత్తు పదార్థాలకు బానిసలు చేసి, వారి వ్యాపారం వృద్ధి చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాలు పట్టణాల్లోనే కాకుండా, చిన్నపల్లెలో చిల్లర దుకాణంలో కూడా కొన్ని చోట్ల లభ్యమవుతుంది. మనదేశంలో సోదాలు చేసే క్రమంలో అక్రమంగా దొరికే మాదకద్రవ్యాలల్లో అరవై శాతం (60%) ఒక్క పంజాబ్‌ రాష్ట్రంలో దొరుకుతుండటం గమనార్హం. అక్రమ మాదకద్రవ్యాల కేసుల్లో దొరికిన వారిని విదేశాల్లో ముఖ్యంగా చైనా, సౌదీ అరేబియా, సింగపూర్‌, అమెరికా లాంటి దేశాల్లో ఉరిశిక్షను అమలు చేస్తున్నారు. మనదేశంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎక్సైజ్‌, ఎన్ఫోర్స్మెంట్‌, పోలీసులు శాఖల వారు కేసులు నమోదు చేస్తున్నారు. ఇంకా పదునైన చట్టాలు తయారు చేసి, పటిష్టంగా అమలు చేయాలి. ఈ మహామ్మారిని అరికట్టేందుకు ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైం (యు.యన్‌.ఓ.డి.సి)”సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ‘డ్రగ్‌ ఫ్రీ వరల్డ్‌’ చేయాలని అందరం కషి చేయాలి.
ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటేరస్‌ మాట్లాడుతూ.. ముఫై ఐదు మిలియన్ల మంది మాదకద్రవ్యాలకు బానిసై, అనేక రుగ్మతలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ మత్తు పదార్థాలకు బానిసలై బలహీన క్షణాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మనదేశంలో వీధి పిల్లలు (స్ట్రీట్‌ చిల్డ్రన్‌) కూడా మత్తుకి బానిసలౌతున్నారు. అలాగే ధనికవర్గానికి చెందిన వారు కూడా ఈ మత్తులో మునుగుతున్నారని మీడియా ద్వారా తరచూ వింటున్నాం. 2019లో జరిగిన ఆత్మహత్యల్లో 98.2 శాతం ఈ బాపతివే అని నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డ్రగ్స్‌ పై సీరియస్‌ చర్యలు తీసుకుంటామంటున్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సమస్యలు పరిష్కారం కోసం ‘1800-11-0031’ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఆలోచనలు, అలవాట్లు గమనిస్తూ ఉండాలి. తప్పులుంటే సవరించాలి. అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు చికిత్స అందివ్వాలి. మత్తుకు బానిసలైన వారికి డ్రగ్స్‌ అడిక్షన్‌ కేంద్రాలు/ మానసిక వైద్యులు ద్వారా చికిత్స అందించి, మామూలు స్థితికి వచ్చేటట్లు చూడాలి. బాధ్యతలు నేర్పుతూ మంచి పౌరులుగా ఎదిగేటట్టు చూడాలి. కుటుంబ సభ్యులు మధ్య మంచి వాతావరణం ఉండేటట్లు చూడాలి. మార్కులు, ర్యాంకుల కంటే పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సెల్‌ ఫోన్ల వాడకం మీద, వారు చేసే స్నేహాల పైనా, వారు సూచే వివిధ వెబ్‌ సైట్లు పరిశీలిస్తుండాలి. రేవ్‌ పార్టీలు, రిజార్ట్‌ పార్టీల వంటివాటి జోలికి పోకుండా నియంత్రించాలి. పిల్లల సాధక బాధకాలు తెలిసుకుని, వారి సమస్యలు విని, స్నేహితుల్లా తల్లిదండ్రులు మెలగాలి. మత్తుమందులకు చిత్తు కాకుండా, మంచి పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దుటలో తల్లిదండ్రులు ప్రధాన బాధ్యత తీసుకోవాలి. డబ్బులు ఇస్తే సరిపోతుందనే ఆలోచన పక్కన పెట్టి, రోజూ కొంత సమయం పిల్లలకు కేటాయించాలి. తల్లిదండ్రులు ఉద్యోగ, ఉపాధి పనుల్లో, మరికొందరు రాత్రీ పగలు వివిధ వినోదం కార్యక్రమాలు చూస్తూ కాలం గడుపుతూ, తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపటం లేదనే మాట వినబడుతుంది. ముఖ్యంగా మైనర్‌ పిల్లలు పట్ల మరింత శ్రద్ధ వహించాలి. వివిధ మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు, స్వచ్ఛంద సంస్థలు మత్తు మందుల వాడకం వల్ల వచ్చే అనర్ధాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యం కలిగించాలి. అక్రమ రవాణాపై ఒక కన్నేసి, అక్రమార్కుల భరతం పట్టాలి. కరోనా కాలంలో ప్రపంచమంతా తల్లడిల్లుతున్న సమయంలో ఎక్కువ మంది మత్తుకు బానిసలయ్యారు.
మత్తుమందులకు బానిసలు కాకుండా మన పిల్లలను, కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ, ఆరోగ్య భారత్‌ను, ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించటంలో అందరం భాగస్వామ్యం అవటమే ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ పరమార్థం .
ఐ.ప్రసాదరావు,
9948272919

Spread the love