యే దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌!!

Ye Dil 'Mango' More!!వేసవి అంటేనే మామిడి పండ్లు, మామిడి పండ్లు అంటేనే వేసవి. సీజనల్‌గా వచ్చే ఈ పండ్లు వేసవిలో ప్రతి ఒక్కరి నోరూ ఊరించడం వీటి నైజం. ఘుమఘుమల వాసనతో మదిని నింపేస్తాయి. ప్రపంచంలో ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడి పండ్లు మాత్రం చాలా ప్రత్యేకం. మంచి రంగు, రుచి, వాసనతో మనుషులను ఇట్టే ఆకర్షించేస్తాయి. అందుకే వీటిని కింగ్‌ ఆఫ్‌ ఫ్రూట్‌ – పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు. వేసవిలో అందరి కళ్లు మామిడి చెట్లమీదే. ఆకుల మధ్యన వేలాడే పచ్చి మామిడికాయలను చూడగానే ఎంతటి వారికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి.
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మామిడి పండ్ల సొంతం. పచ్చిగా ఉన్న మామిడి కాయలను పచ్చళ్ళు, పప్పు, కూరలు వండుతారు. పండిన వాటితో పానీయాలు, స్మూతీలు, షేక్‌లు చేస్తుంటారు.
మూడువేల ఏళ్ల క్రితమే భారతీయతలో మామిడి పండ్ల ప్రస్తావన ఉంది. అయితే పాశ్చాత్య దేశాలకు ఈ పండ్లు చేరి వందల సంవత్సరాలవుతోంది. మామిడి ఆంగ్ల పేరు మ్యాంగో మళయాల పదం ‘మన్నా’ నుంచి పుట్టింది. 1498 ప్రాంతంలో కేరళతో పోర్చుగీస్‌ వాళ్లు సుగంధ ద్రవ్యాల వాణిజ్యం నిర్వహించేవారు. భారత్‌, పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలకు మామిడి జాతీయ పండు. మామిడి వృక్షం బంగ్లాదేశ్‌ జాతీయ వృక్షం. అతి ఖరీదైన మామిడి పండ్లలో అల్ఫోన్సా ఒకటి. వీటినే అఫోన్స్‌డే, అల్బుక్యుర్క్‌ అఫోస్‌, హపోజ్‌ అనే పేర్లతో పిలుస్తారు.
కొమ్మల నుంచీ గుమ్మాలకీ
మన సంస్కృతీ సంప్రదాయాల్లో మామిడికి పెద్దపీట ఉంది. మామిడి కొమ్మలు పర్వదినాల్లో గుమ్మాలకి వలస వెళ్ళి పండగ శోభని ఆహ్వానిస్తాయి. శుభ కార్యాలప్పుడు ఇండ్లకు మామిడి తోరణాలు కడతారు. యజ్ఞాలకీ, పూర్ణకుంభాలకీ, వ్రతాలకీ మామిడాకు తప్పనిసరి. మామిడితోరణాన్ని గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి రాకపోకలు సాగించే సమయంలో తలపై ఉండే బ్యాక్టీరియాను మామిడి ఆకులు పీల్చుకుంటాయి. మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోరణాలను ఆలయాల్లో కూడా కడుతుంటారు. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోను మామిడి ఆకారం చోటు చేసుకుంది.
వేసవి సీజన్‌ మార్కెట్లలో, రహదారుల పక్కన, సూపర్‌ మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి. రసాలు, కోత మామిడి అని మామిడి పండ్లలో చాలా రకాలే ఉంటాయి. కొన్ని రసంతో నోరూరిస్తే కొన్ని దిట్టమైన కండతో జిహ్వ చాపల్యాన్ని పెంచుతుంటాయి. అయితే ఏ మామిడి రకాన్ని తిన్నప్పటికీ మనకు కలిగే లాభాలు ఒకేవిధంగా ఉంటాయి. వేసవిలో శరీరానికి కావల్సిన పోషకాలు మామిడితో అందుతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
మామిడి రకాలు బంగినపల్లి, రసాలు, చిన్న రసాలు, పెద్దరసాలు, చెరుకు రసాలు, నూజివీడు రసం, అల్ఫాన్సా, ఇమాంపసంద్‌, చందూరా, రుమానియా, మల్లోవా, చక్కెర కుట్టి, చిలక ముక్కు మామిడి లేక బెంగుళూరు మామిడి, షోలాపురి, పంచదార కలశ, కోలంగోవా, ఏండ్రాసు, సువర్ణ రేఖ, పండూరి వారి మామిడి, కలెక్టెరు, కొండ మామిడి, దషేరి, జహంగీర్‌, డిల్లీ పసంద్‌, నూర్జహాన్‌, హిమాని, నీలీషాన్‌, పుల్లూర, పెరడు మామిడి, కొబ్బరి మామిడి, చాకులు, ఆచారి, జలాలు, చౌంసా, లంగ్రా, కేసర్‌… ఇన్ని రకాల మామిడి పండ్లు ఉన్నా అందరూ ఇష్టంగా తినే పండు బంగినపల్లి. అన్ని పండ్ల కంటే ఎంతో రుచిగా ఉండే ఈ పండ్లకి ఎప్పుడూ గిరాకీ ఎక్కువే. పసందైన రుచితో రాజులు, చక్రవర్తులను సైతం ఆకట్టుకున్న ఘనత మామిడికి మాత్రమే దక్కింది. ఇలా రకరకాల తన రుచులతో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్న ఘనత మామిడి పండ్లది.
ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి అమ్ముతారు. విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని ఆమ్‌ చూర్‌ అంటారు. కొన్ని ప్రదేశాలలో ఎండపెట్టిన మామిడి ఒరుగు ముక్కలను సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు.
అందరూ ఇష్టపడే మామిడిలో పోషక విలువలూ ఎక్కువే. న్యూట్రీషినల్‌ విలువలున్న మామిడి పండ్లతో ఎన్నో రకాల వంటలు చేయొచ్చు. పచ్చళ్లలోనైతే ఆవకాయ, మాగాయ, ముక్కల పచ్చడి, మామిడి తొక్కు పచ్చడి, బెల్లపు ఆవకాయ, నూనె ఆవకాయ, పెసరావకాయ, ఇలా ఇంకెన్నో రకాలు తరతరాలుగా అందరూ అభిమానించే రుచులున్నాయి.
మామిడిపండుతో హల్వా, ఐస్‌క్రీములు కూడా తయారు చేస్తారు. ఇక షర్బత్‌లు, జ్యూస్‌ల సంగతైతే సరేసరి. రెడీమేడ్‌గా ఫ్రూటీలు, మాజాలు ఉండనే ఉన్నాయి. వివిధ గార్నిష్‌లలో మామిడి ఉపయోగి స్తుంటారు. అన్నింటికన్నా అందరికీ నచ్చేది తాండ్ర. ఇది సీజన్‌తో సంబంధం లేకుండా మామిడి రుచిని జిహ్వపై నిలుపుతుంది. ఒక్క వేసవిలో మాత్రమే లబించే ఈ సీజనల్‌ ఫ్రూట్‌లో పదిహేను శాతం చక్కెర, ఒక శాతం మాంసకృత్తులు, తగిన మోతాదులో విటమిన్లు ఉంటాయి.
ఆరోగ్యప్రదాయిని
మామిడికాయలో ఉండే విటమిన్‌ ఎ, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇమ్యూన్‌ సిస్టమ్‌ను పటిష్టంగా మార్చుతుంది. మామిడికాయలో ఉండే కెరోటిన్‌ కంటెంట్‌ వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది. వివిధ రకాల బాడీ సిస్టమ్స్‌ను, కార్డియక్‌, రెస్పిరేటరీ ఇతర నాడీవ్యవస్థను డెవలప్‌ చేయడానికి సహాయ పడుతుంది. మామిడి పండ్లలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ – ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్దక సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
మామిడి బ్లడ్‌ ప్రెజర్‌ను నార్మల్‌ లెవల్స్‌కు తీసుకొస్తుంది. ఇందులో ఉండే సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఆక్సిజన్‌ ఫ్రీరాడికల్స్‌ నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇది డీజనరేటివ్‌ డిసీజ్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. న్యూమరాలజికల్‌ ఫంక్షన్‌ మెరుగు పరుస్తుంది. ఇది కొల్లాజెన్‌ ఫార్మేషన్‌ను పెంచుతుంది. గాయాలను మాన్పుతుంది. దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మామిడి పండ్లలో ఉండే పొటాషియం హార్ట్‌ రేటును కంట్రోల్‌ చేయడానికి సహాయ పడుతుంది. గర్భధారణ సమయంలో బ్లడ్‌ వాల్యూమ్‌ పెరుగుతుంది. కాబట్టి ఎక్స్‌ ట్రా మినరల్స్‌ అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ బి6 మతిమరుపును నివారిస్తుంది. ఇది బేబీ బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌ను, నర్వస్‌ సిస్టమ్‌ను మెరుగుపరుస్తుంది. హార్ట్‌, స్కెలిటిన్‌ సిస్టమ్‌, బ్లడ్‌ వెజిల్స్‌ ఫార్మేషన్‌కు మామిడి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫొల్లెట్‌ కంటెంట్‌ బ్రెయిన్‌, స్పైనల్‌ కార్డ్‌ డిఫెక్ట్స్‌ను, లోపాలను నివారిస్తుంది. ఫొల్లెట్‌ రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌, డిఎన్‌ఎ ఏర్పాటుకు సహాయపడుతుంది. కార్డియక్‌ ఫంక్షన్‌ సిస్టమ్‌కు సహాయపడుతుంది.
మామిడిపండ్లలో ఉండే విటమిన్‌ ఎ, సి లు జుట్టు నిగారింపునిస్తాయి. బాగా పండిన మామిడి పండ్ల నుండి గుజ్జు తీసి జుట్టుకు అప్లై చేయాలి. ఈ నేచురల్‌ ట్రీట్మెంట్‌ వల్ల హెయిర్‌ ఫాలీ సెల్స్‌ ఆరోగ్యంగా ఉంటాయి. కమర్షియల్‌ హెయిర్‌ కలర్స్‌ కంటే ఇది చాలా ఉత్తమమైనది.
కమ్మనైన రుచితో నోరంతా తీపి చేసే మామిడి పండ్లు ఆరోగ్య ప్రదాయినే కాదు, సౌందర్య సంరక్షిణి కూడా. పచ్చి/ పండు మామిడి తొక్కను ముఖానికి, చేతులకు బాగా రుద్దాలి. అవసరం అయితై మిల్క్‌ క్రీమ్‌ ఉపయోగించి కూడా స్క్రబ్‌ చేయవచ్చు. 10-15 నిముషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడంవల్ల సన్‌టాన్‌ పోతుంది.
బాగా పండిన మామిడిపండు గుజ్జులో అర టీస్పూన్‌ పాలు, రెండు మూడు చుక్కల తేనె మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేసి సర్క్యులర్‌ మోషన్‌లో బాగా మర్ధన చేయాలి. ఇది డెడ్‌స్కిన్‌ సెల్స్‌ తొలగిస్తుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. ముఖంలో డార్క్‌ స్పాట్స్‌ కనబడకుండా ఉండాలంటే ఎండుమామిడికాయని పొడి చేసి, దీనికి కొద్దిగా పెరుగు కలిపి ఈ పేస్ట్‌ ను ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. క్రమంగా డార్క్‌ స్పాట్స్‌ తొలగి ముఖానికి గోల్డెన్‌ గ్లో ను అందిస్తుంది.
మామిడి రసంలో నీరు, కొంచెం పంచదార కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. సూర్యుని వేడి వల్ల శరీరం వేడి స్ట్రోక్‌ తగ్గకపోతే మూత్రవిసర్జన ఆగి, మూత్రపిండాలు విషపదార్థాలతో ఓవర్లోడ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. దానిని నివారించటానికి మామిడికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.
మరో కోణం
మామిడిపండ్లు త్వరగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం కార్బైడ్‌ (కార్సినోజెన్‌) వంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. సహజ సిద్దంగా పండిన వాటిని మాత్రమే తినాలి. రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లతో ఆరోగ్యానికి హాని. కాల్సియం కార్బైడ్‌లో 20 శాతం మలినాలు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఆర్సెనిక్‌, ఫాస్ఫరస్‌ కాంపౌండ్‌లు ఉంటాయి. ఇవి వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కాల్షియం కార్బైడ్‌ తేమతో కలిసినపుడు విడుదలయ్యే ఎసిటిలిన్‌ వాయువు మెదడుకు ప్రాణవాయువు సరఫరాను తగ్గించి నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది. సాధారణంగా పండ్లన్నీ వాటిలో జరిగే రసాయనిక చర్యల కారణంగానే మగ్గుతాయి. కాయలు పూర్తిగా పక్వానికి రాక ముందే వాటిని కోసి మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో అవి బాగా పండినట్లుగా తయారవ్వడానికి క్యాల్సియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పూర్తి పసుపురంగులోనే ఉన్నా వాటిపై ఆకుపచ్చని రంగులో మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనబడుతుంటాయి. అలాగే మరి కొన్నింటిలో మామిడి పండు సహజసిద్దంగా పండినప్పుడు వచ్చే రంగు కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
సహజ సిద్దంగా పండినవి తెలుసుకోవాలంటే మామిడి పండ్లను వాసన చూడాలి. సహజంగా పండినవి తీయని వాసనతో మధురంగా అనిపిస్తుంది.
కృత్రిమంగా మగ్గబెట్టిన పండును తింటున్నప్పుడు నోట్లోలో గొంతులో మంట పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటివి తిన్న కొంత సేపటి తర్వాత కొందరిలో కడుపు నొప్పి, డయేరియా, వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళ్ళు చేతులు లాగడం, తిమ్మెర్లు, ఫెరిఫెరల్‌ న్యూరో థెరఫి వంటి సమస్యలు వస్తాయి. పూర్తిగా పక్వానికి వచ్చి సహజసిద్దమైన రీతిలో మగ్గిన మామిడి పండులో రసం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా తియ్యగా కూడా ఉంటుంది. మామిడి పండును సహజసిద్దంగా పండేలా చేసే ఎథిలీన్‌ వల్ల పండులో రసం ఎక్కువగా ఉంటుంది.
ఒక మీడియం సైజ్‌ మామిడి పండులో 135 క్యాలరీలుంటాయి. ఒకేసారి ఎక్కువ మామిడిపండ్లు తినడం వల్ల క్యాలరీలు పెరిగి బరువు పెరుగుతారు. మామిడి పండ్లలో ఫ్రూట్‌ షుగర్‌ (ఫ్రక్టోజ్‌) అధికంగా ఉంటుంది. షుగర్‌ లేదా స్వీట్‌ కంటెంట్‌ అధికంగా ఉన్న వాటిని ఎక్కువ తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. శరీరంలో ఇన్సులిన్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి. ఆర్థ్రైటిస్‌, సైనటిస్‌ వంటి నరాల వ్యాధితో బాధపడేవారికి మంచిది కాదు. వీరు పచ్చిమామిడి, మామిడి పండ్లు, లేదా జ్యూస్‌ రూపంలో తీసుకున్నా మంచిది కాదు. మామిడి పండ్లను తినడం వల్ల కొన్ని అలర్జీలు వస్తాయి. కొంత మంది అలర్జిక్‌ రియాక్షన్‌ వల్ల కళ్లు, ముక్కు వెంబట నీళ్లు కారడం, శ్వాససమస్యలు, పొట్ట ఉదరంలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
చిట్టి చిట్కా:
మిరియాల పొడితో తింటే కాయైనా, పండైనా మామిడి అపకారం చేయకుండా ఉంటుంది.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
8008 577 834

Spread the love