అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రాలకు అకాడమీ అవార్డులిస్తుంది. వీటినే ఆస్కార్స్ అంటాం. ఆస్కార్ అవార్డులు 1929 నుండి మొదలయ్యాయి. మొదటి సంవత్సరం ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డ్ గెలుచుకున్న సినిమా ‘వింగ్స్’. అన్ని కేటగిరీలకు అవార్డు ఇచ్చిన తరువాత ఆఖరున ఈ అవార్డు ప్రకటిస్తారు. ఉత్తమ చిత్రంగా ఓ చిత్రం ఎన్నికవడం, ఆ సినిమాకు సంబంధించినవారందరికీ గర్వకారణం అవుతుంది.
1927, 28 లలో నిర్మించిన చిత్రాలను ఆ సంవత్సరం అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఔట్ స్టాండింగ్ పిక్చర్‌గా ‘వింగ్స్’, యూనిక్ అండ్ ఆర్టిస్టిక్ పిక్చర్ కేటగిరీలో ‘సన్ రైజ్’ సినిమాలు ఆ సంవత్సరం ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. అయితే మొదట వరుసలో వింగ్స్‌కే అవార్డు ప్రకటించారు. తరువాత ఈ అవార్డుని ‘బెస్ట్ పిక్చర్’గా మార్చడం జరిగింది. అలా మొదటి ఆస్కార్, లేదా అకాడమీ ఆవార్డు పొందిన ఉత్తమ చిత్రంగా ‘వింగ్స్’ చరిత్రలో నిలిచిపోయింది.
వింగ్స్ చిత్రం మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తీసిన సినిమా. ఇది ఆ తరువాత వచ్చిన విమానయాన చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. 1929 సైలెంట్ సినిమాలు మెల్లిగా మాయమవుతూ ఉన్నాయి. వింగ్స్‌ని ముందు పూర్తి మూకీ చిత్రంగా నిర్మించారు. తరువాత ప్రేక్షకులకు మూకి చిత్రాలపై విముఖత పెరుగుతుందని గ్రహించి సమకాలీకరించబడిన సౌండ్ ఎఫెక్ట్స్, సంగీతాన్ని జోడించి ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేసారు. ఇతర మూకీ సినిమాలవలే సంభాషణలు అవసరమైన చోట రాసి తెరపై ప్రదర్శించారు. ఇది యుద్ధ నేపథ్యంతో వచ్చిన సినిమా. కాని ఇది ముక్కోణపు ప్రేమ కథ కూడా. ఆ సంవత్సరం ఈ చిత్రానికి విశేషమైన ఆదరణ లభించింది. ఇప్పటికీ పెరిగిన టెక్నాలజీతో గొప్ప చిత్రాలను నిర్మించినా హాలీవుడ్‌లో యుద్ధ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో వింగ్స్ మొదటి వరుసలో నిలుస్తుంది.
వింగ్స్‌కు దర్శకత్వం వహించింది, విలియం. ఎ. వెల్మాన్. ఈయన మొదటి ప్రపంచ యుద్ధంలో మిలటరీ పైలట్‌గా పని చేశారు. అందుకే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో దర్శకులుగా ఎన్నుకున్నారు. ఇక అప్పట్లో పారమోట్ స్టూడియోలో ప్రాధాన నటి క్లారా బౌ. ఈమె ఈ చిత్ర కథానాయిక కూడా. అమెరికా’స్ బారు ప్రెండ్ అని ముద్దుగా ప్రజలు పిల్చుకున్న చార్ల్స్ ఎడ్వర్డ్ రోగర్స్ ఈ సినిమాలో మొదటి కథానాయకుడు జాక్ పావెల్‌గా నటించారు. రెండవ కథానాయకుడు డేవిడ్ పాత్రను రిచర్డ్ ఆర్లెన్ పోషించారు. ఈయనకు కెనడాలో మొదటి ప్రపంచ యుద్ధంలో పైలట్‌గా పని చేసిన అనుభవం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో విమాన శిక్షకుడిగా కూడా పని చేశాడు రిచర్డ్. సినిమాకు కథ అందించిన జాన్ మాంక్ సాండర్స్ కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడాలో విమాన శిక్షకుడుగా పని చేసారు. అందుకే సినిమా వాస్తవ యుద్ధ వాతావరణానికి అతి దగ్గరగా ఉంటుంది. ముందు కథ పూర్తిగా యుద్ద్ధ నేపథ్యంలో రాసుకున్నా క్లారా బౌకు ఉన్న విశేష ప్రజాదరణ కారణంగా ఆమెని ఈ చిత్రంలో తీసుకోవాలని ప్రేమ కథగా దీన్ని మార్చారు.
ఈ సినిమాను అప్పట్లోనే ఎంతో డబ్బు ఖర్చు చేసి తీసారు. యుద్ధ సన్నివేశాల కోసం, వందల కొద్ది ఎక్స్‌ట్రా నటులను తీసుకుని దాదాపు 300 పైలెట్లను ఉపయోగించుకున్నారు. అమెరికా వైమానికా దళం ఈ సినిమా కోసం తమ పైలట్లను, ప్లేన్లను ఇచ్చింది. జర్మనీతో అమెరికన్లు, ఫ్రెంచి వారు కలిసి 12 నుంచి 15 సెప్టెంబర్ 1918, న జరిపిన యుద్ధాన్ని బాటిల్ ఆఫ్ సెంట్ మిహైల్ అంటారు. ఆ యుద్ధం సంఘటనలు యథావిధిగా చిత్రించారు దర్శకులు. దీని కోసం యుద్ధంలో పాల్గొన్న వారి దగ్గర ఎంతో సమాచారాన్ని సేకరించి, ఆ యుద్ధంలో పైలెట్ల ప్రణాళికలను తెలుసుకుని తమ సినిమాలో ఆ సంఘటనలను యధావిధిగా చిత్రించారు. దీని కోసం అమెరికా వైమానిక దళాలు పూర్తి మద్ధతుని ఈ చిత్ర పరివారానికి ఇచ్చారు.
అమెరికాలోని ఓ చిన్న పట్టణంలో జాక్ పావెల్, డేవిడ్ ఆర్మ్ స్ట్రాంగ్ పెరుగుతారు. ఇద్దరికీ తమ స్నేహితురాలు సిల్వియా లూయిస్ అంటే ప్రేమ. జాక్ మధ్య తరగతికి చెందిన యువకుడు. ఇతనికి కార్లు, ఇతర వాహనాలంటే విపరీతమైన ఆసక్తి. పాత కారుని కొత్తగా మార్చుకుని అందులో ఆనందం పొందుతాడు. ఈ వాహనాల పిచ్చి కారణంగా యుద్ధంలో పైలెట్ శిక్షణ కోసం తన పేరు నమోదు చేసుకుంటాడు. పక్కింట్లో ఉండే మేరీ ప్రెస్టట్ జాక్‌ని ప్రేమిస్తుంది. ఆమెతో కలిసి సమయాన్ని గడిపే జాక్ మాత్రం సిల్వియాని ఇష్టపడతారు. దీనికి కారణం డేవిడ్ సిల్వియాను ఇష్టపడడమే. డేవిడ్ తల్లిదండ్రులు ధనవంతులు. తండ్రి సైనికుడిగా పని చేసి కాళ్లు పోగొట్టుకుంటాడు. ఆ ఇంటి వాతావరణం కారణంగా కూడా డేవిడ్ పైలట్‌గా యుద్ధంలో పని చేయడానికి పేరు నమోదు చెసుకుంటాడు.
యుద్ధ సమయంలో ఇద్దరికీ పిలుపు వస్తుంది. జాక్ సిల్వియా దగ్గర సెలవు తీసుకోవాలని వస్తాడు. సిల్వియా డేవిడ్‌కి కానుకగా తన ఫొటో వెనుక ప్రేమ సందేశం రాసి ఓ లాకెట్ ఇవ్వడానికి సిద్దం చేస్తుంది. అది తన కోసమే అనుకుని జాక్ అది సిల్వియా నుండి చొరవగా లాకుంటాడు. యుద్ధానికి వెళ్తున్న అతన్ని బాధపెట్టలేక సిల్వియా మౌనంగా ఉండిపోతుంది. ఇది చూసిన డేవిడ్‌కు, జాక్ మొహం చూసి తానేమీ అడ్డు చెప్పలేకపోయానని, తాను ప్రేమిస్తుంది డేవిడ్‌నే అని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెబుతుంది సిల్వియా.
డేవిడ్ తల్లి ఓ చిన్న బొమ్మను డేవిడ్ చిన్నతనం గుర్తుగా దాచుకుంటుంది. డేవిడ్ ఆ బొమ్మను తనతో తీసుకెళతాడు. తల్లి తండ్రులు భారమైన మనసుతో అతనికి వీడ్కోలు పలుకుతారు. జాక్ ప్రయాణానికి బైలుదేరినప్పుడు మేరి కన్నీళ్ళతో అతనికి వీడ్కోలు పలుకుతుంది. సిల్వియా ప్రేమలో మునిగి ఉన్న జాక్ ఆమె ప్రేమను అర్ధం చేసుకోలేడు. శిక్షణ పొందే దళంలో డేవిడ్, జాక్ ఇద్దరూ కలుస్తారు. ముందు ఒకరిపై మరొకరు ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శించుకున్న క్రమంగా మంచి స్నేహితులవుతారు. వీరి స్నేహం పైలట్లందరినీ ఆకట్టుకుంటుంది. ఇద్దరూ కష్టమైన యుద్ధ రీతులను ప్రదర్శించి తమ దేశానికి పేరు తీసుకువస్తారు. జాక్ తన విమానంపై తోకచుక్క బొమ్మ వేసుకుంటాడు. అతన్ని అందరూ తోకచుక్క పైలట్ అని పిలుస్తారు.
డేవిడ్, జాక్‌లతో పాటు వారి ఆవాసంలో వైట్ అనే మరో పైలట్ ఉంటాడు. అప్పుడే పరిచయమైన అతను కొన్ని నిముషాలలోనే యుద్ధంలో మరణించడం డేవిడ్ జాక్‌లను కలిచి వేస్తుంది. తమ జీవితంలో నిత్యం పొంచి ఉన్న ప్రమాదాన్ని వాళ్ళు గుర్తిసారు. ఈ వైట్ పాత్రలో గేరో కూపర్ మొదటిసారి తెరపై కనిపిస్తారు. తరువాత హాలీవుడ్ కథానాయకుడిగా ఈయన చరిత్ర సష్టించారు. వింగ్స్‌లో ఓ పది నిముషాలు కనిపించే పాత్రతో మొదటిసారి తెరంగేట్రం చేసారు ఆయన.
మేరి కూడా డేవిడ్ ప్రేమలో మునిగి యుద్ధంలో ఆంబులెన్స్ డ్రైవర్‌గా చేరుతుంది. యుద్ధంలో చూపిన ధైర్య సాహసాలకు డేవిడ్ జాక్‌లకు పారిస్‌లో సెలవు గడిపే అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. ఆ సమయంలో తాగిన మత్తులో అమ్మాయిలతో సరదాగా గడిపుతున్న జాక్‌ను మేరి చూస్తుంది. అందులో కొందరు జాక్‌తో అతి చనువు తీసుకోవడం చూసి భరించలేక ఆమె జాక్‌ను తన గదికి తీసుకొస్తుంది. తాగిన మత్తులో ఉన్న జాక్ మేరిని గుర్తు పట్టడు. అప్పుడే యుద్ధం తీవ్రమై సైనికుల సెలవుని ప్రభుత్వం రద్దు చేసిందనే సమాచారం వస్తుంది. హోటల్లో గడుపుతున్న సైనికులను తీసుకువెళడానికి ఓ దళం వస్తుంది. వీరికి హోటల్ గదిలో బట్టలు మార్చుకుంటున్న మేరి కనిపిస్తుంది. ఆ పక్కన మత్తులో దొర్లుతున్న జాక్‌ని చూసి ఆ సైనికులు వారిద్దరిని ప్రేమికులనుకుంటారు. మేరి చేతిలో యుద్ధ యూనిఫాం చూసిన వాళ్ళు ఆమె తప్పు చేసిందని నిర్ధారించి ఆమెను సస్పెండ్ చేస్తారు. దీనితో మేరి తన స్వగ్రామం వెళ్ళిపోతుంది. ఈ వార్తను జాక్ పేపర్‌లో చదువుతాడు. మేరి యుద్ధంలో చేరిందని అతనికి అలా తెలుస్తుంది. ఆమె రిజైన్ చేసి వెళ్లిందని పేపర్‌లో వస్తుంది. అతనికి పారిస్‌లో తనను గదికి తీసుకెళ్ళింది మేరి అన్నది కూడా తెలియదు. మేరి రిజైన్ చేసే నైజం ఉన్న అమ్మాయి కాదని ఆమెలో పట్టుదల ఎక్కువని జాక్ చెప్తున్నప్పుడు. తప్పు చేసిన అమ్మాయిలను ఇలా పంపించేస్తారని తోటి పైలెట్ అంటాడు. దానితో జాక్‌కి చాలా కోపం వస్తుంది. మేరి గురించి తప్పుగా మాట్లాడావని ఆ పైలేట్ పై కోపాన్ని ప్రదర్శిస్తాడు. అతను మేరి నీ ప్రేమికురాలని నాకు తెలియదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా వింటున్న డేవిడ్‌కి జాక్ మేరిని ప్రేమిస్తున్నాడని అయితే సిల్వియా మోజులో ఇది అతను గ్రహించట్లేదని అర్ధం అవుతుంది.
సెంట్ మిహెల్ యుద్ధం మొదలవుతుంది. ఈసారి తాను తిరిగి రానని అనిపిస్తుందని డేవిడ్ జాక్‌తో చెబుతాడు. జాక్ ఈ విషయాన్ని పట్టించుకోడు. మాట మార్చడానికి తన దగ్గర కూడా ఓ అదష్ట తాయత్తు ఉందని డేవిడ్‌కు చెబుతాడు. సిల్వియా యిచ్చిన లాకెట్‌ను చూపిస్తాడు. అది చూపించేటప్పుడు అందులో సిల్వియా ఫొటో జారి పడిపోతుంది. ఫొటో వెనుక డేవిడ్‌కు ప్రేమతో అని సిల్వియా రాసిన వాక్యం డేవిడ్‌కు కనిపిస్తుంది. సిల్వియా తననే ప్రేమిస్తుందని డేవిడ్‌కు పూర్తిగా అర్ధం అవుతుంది. కాని యుద్ధానికి బయలు దేరే ముందు నిజం తెలిస్తే జాక్ మనసు గాయపడి కోపంతో ప్రమాదం తెచ్చుకుంటాడేమో అని డేవిడ్ భయపడతాడు. అందుకని ఆ ఫొటో తీసుకుని చింపేస్తాడు. ఆ ముక్కలను లాక్కున్న జాక్‌కు డేవిడ్ పై చాలా కోపం వస్తుంది. అతను మిత్ర ద్రోహి అని తూలనాడుతూ కోపంతో విమానం ఎక్కి డేవిడ్‌కు సరయిన వీడ్కోలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఈ గొడవలో ప్రతిసారి తనతో తీసుకెళ్లే బొమ్మను డేవిడ్ మర్చిపోతాడు. దాన్ని తల్లి దీవెనగా తలచుకుని ఎప్పుడు తనతో ఉంచుకునే డేవిడ్ ఇప్పుడు అది లేకుండానే ఆకాశంలోకి తన విమానంతో వెళ్ళిపోతాడు.
డేవిడ్ ఎక్కిన విమానం శత్రు శిబిరాల మధ్య కూలిపోతుంది. అతను మరణించాడన్న వార్త జాక్ పరివారానికి చేరుతుంది. డేవిడ్ చింపిన ఫొటో ముక్కల వెనుక సిల్వియా రాసిన వాక్యాన్ని చదివి విషయం జాక్‌కు అర్ధం అవుతుంది. డేవిడ్ తనను ఎంతగా ప్రేమించాడో తెలుసుకున్న జాక్ అతను దూరమైన బాధను శత్రువులపై కోపంగా మార్చుకుని శత్రు విమానాలను కూల్చి జర్మన్ పతాకాలను ఆ విమానాల నుండి సేకరించి డేవిడ్‌కు నివాళి ప్రకటిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. భయంకరమైన యుద్ధ విమానాల మధ్య తన ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధం చేస్తాడు. ఎన్నో విమానాలను కూల్చి పడేస్తాడు.
చనిపోయాడనుకున్న డేవిడ్ గాయపడి కొన్ని రోజులుగా శత్రు శిబిరాల మధ్యనే దాక్కుని ఓ జర్మన్ ప్లేన్‌ను దొంగలిస్తాడు. దాన్ని తమ శిబిరాల వైపుకు నడుపుకుంటూ వెళ్తాడు. జాక్ విమానం శత్రు విమానాల పై దాడి చేస్తూ ఉంటుంది. విమానంపై ఉన్న తోక చుక్కను చూసి డేవిడ్ అందులో ఉన్నది జాక్ అని తెలుసుకుంటాడు. అతన్ని బిగ్గరగా సహాయం కోసం పిలుస్తూ ఈ విమానంలో తానున్నానని చెప్పాలని ప్రయత్నిస్తాడు. కాని కసితో కోపంతో ఉన్న జాక్‌కి ఈ పిలుపు వినిపించదు. ఈ విమానంపై బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. అది దగ్గరలో ఉన్న ఓ ఇంటిపై కూలి పోతుంది. ఆ ఇంట్లో ఓ తల్లి అసహాయంగా పడున్న డేవిడ్‌ని చూస్తుంది. అవి అతని ఆఖరి ఘడియలు అని అర్ధం చేసుకుంటుంది. గోడ బైట జర్మన్ విమానం పై నుండి జెండాను సేకరిస్తున్న జాక్‌ని పిలిచి ఆఖరి ఘడియల్లో ఉన్న వ్యక్తిని ఓ సారి చూడమని పిలుస్తుంది. జాక్ లోపలికి వెళ్లి అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటున్న డేవిడ్‌ను చూసి నిర్ఘాంతపోతాడు. డేవిడ్ జర్మన్ విమానం ఎందుకు నడుపుతున్నాడని అడుగుతాడు. మిత్రుడిని చూసిన డేవిడ్ తాను ఆ విమానం దొంగతనం చేసి తప్పించుకుని తమ శిబిరాల వైపుకు వస్తున్నానని చెప్తూ, ఇలా మరణిస్తున్నందుకు తనకు బాధ లేదని, తాను జాక్‌ను క్షమిస్తున్నానని చెప్తాడు. డేవిడ్ తాను జాక్ కోసమే అంత కసిగా జర్మన్ విమానాల పై గుళ్ళ వర్షం కురిపించానని, అతని మరణానికి బదులు తీర్చుకుంటున్నానని అనుకుంటున్నానని చెప్తూ కన్నీరు కారుస్తాడు. మిత్రుడు తననెంత ప్రేమిస్తున్నాడో తనకు తెలుసని, జాక్‌ని తానూ అంతలా ప్రేమిస్తున్నాని చెప్తూ డేవిడ్ కన్ను మూస్తాడు. అతని అంత్యక్రియలను జాక్ నిర్వహిస్తాడు.
యుద్ధం ముగిసిన తరువాత జాక్ తన ఊరు తిరిగి వెళతాడు. అతనికి ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతారు. ఆ సమారోహంలో కూడా డేవిడ్ లేని లోటు జాక్‌కి ముల్లులా మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది. అతను డేవిడ్ తల్లిదండ్రులను కలవడానికి వెళతాడు. తనతో డేవిడ్ అదష్టంగా భావించే బొమ్మను తీసుకుని వెళతాడు. అది చూసి డేవిడ్ తల్లి కన్నీళ్ళ పర్యంత మవుతుంది. డేవిడ్‌కు యుద్ధంలో ప్రభుత్వం బహుకరించిన మెడల్‌ను అతని తండ్రికి ఇస్తాడు జాక్. డేవిడ్ తల్లి కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకుంటాడు. దానికి ఆమె నిన్ను నేను క్షమిస్తున్నాను జాక్. తప్పు నీది కాదు యుద్ధానిది అంటుంది.
యుద్ధంలో జరిగే ప్రాణహాని ఆ చంపుకోవడం చూస్తే మనిషి సష్టించిన ఈ మారణహోమం అతన్ని ఓ పావుగా చేయడం ఎన్నో సందర్భాలలో తెలుస్తుంది. ఒకరిని ఒకరు చంపుకునే సైనికుల యుద్ధం దేశాల మీదకాని వ్యక్తుల మీద కాదు. కాని దేశం పేరుతో ఒకరినొకరు చంపుకుంటూ తాము సోదరులమనే భావాన్ని మర్చిపోయి గుండు పేలుస్తుంది ఎవరు, అవి తగిలి మరణిస్తుందెవరు అర్ధం కాని అయోమయిపు స్థితిలోకి వెళ్లిపోతారు. అదే యుద్ధంలోని అతి పెద్ద విషాదం. ఆ విషాదమే ఇద్దరు ప్రాణ మిత్రులు ఒకరినొకరు కాల్చుకునే స్థితికి తీసుకువచ్చింది. సినిమా ముగింపులో చాలా లోతు ఉంది. అందుకే ఈ సినిమా నేటికీ సంబంధిత యుద్ధ సినిమాగా సినీ ప్రేక్షకులను అలరిస్తుంది.
చివరికి మేరీ జాక్‌లను కలిపి కథను ముగించారు దర్శకులు. ఈ సినిమాలో చిత్రించిన యుద్ధ సీన్లు, ఆకాశంలో ఆ విమానాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, ఆ విమాన వ్యూహాలు, వీటి మద్య ఓ అందమైన ప్రేమ కథ, ఇద్దరు స్నేహితుల అనుబంధం, ఇవన్నీ సంభాషణలు లేకుండా చిత్రీకరించడం ఇప్పుడు ఈ రీతిలో చేయడం కష్టమే. అందుకే ఈ అపురూపమైన చిత్రానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ చిత్రం నెగిటివ్ చాలా కాలం దొరకలేదు. దీన్ని పోగొట్టుకున్నామనే అనుకున్నారు అంతా. కాని ఓ స్పేర్ నెగెటివ్ పారిస్‌లో దొరికాక దీన్ని మళ్లీ రిలీజ్ చేయగలిగారు. అమెరికా వైమానికాదళం 1968లో స్వయంగా ఈ సినిమాను రీప్రింట్ చేసి ఓ పుస్తకం రూపంలో కూడా దీన్ని రిలీజ్ చేసింది. అంతగా ఇది అమెరికా దళంలో ఓ భాగం అయింది.
హాలీవుడ్ సినిమాను అధ్యయనం చేస్తున్నప్పుడు వింగ్స్‌ని మరో రెండు విషయాలలో గుర్తుచేసుకుంటారు. ప్రేక్షకులు. మొదటిసారి స్త్రీ, పురుష నగ శరీరాలను కెమెరా బహిర్గతపరిచింది ఈ సినిమాలోనే. సైనికుల పరీక్షల సమయంలో దూరంగా పురుష దేహాలను, హోటల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటున్న మేరీ వక్షాన్ని కేమెరా ఓ అరక్షణం చూపిస్తుంది. అదే అప్పట్లో పెద్ద సంచనలం. ఇక పేరిస్ హోటల్లో సైనికులు ఆడిపాడే సీన్లో మొదటి సారి ఓ లెస్బియన్ జంట ఒకరి కళ్లలోకి మరొకరు ఓరగా చూసుకుంటూ ఉండగా కెమెరాకు చిక్కుతారు. ఈ దశ్యాలకు మొదలుగా వింగ్స్ సినిమాని ప్రస్తావిస్తారు విశ్లేషకులు.
ఏమైనా మొదటి ఆస్కార్ గెలుచుకున్న ఈ ఉత్తమ చిత్రం నిజంగా ఓ అపురూపమైన సినిమా. సినీ ప్రేమికులు తప్పకుండా చూడవలసిన గొప్ప మూకీ చిత్రం కూడా.
– పి.జ్యోతి,
98853 84740