మీ పిల్లలు బెదిరింపులకు గురౌతున్నారా?

మీ పిల్లలు బెదిరింపులకు గురౌతున్నారా?ఈమధ్య తరచుగా పిల్లలు బెదిరింపులు గురౌతున్నారు. బెదిరింపు లేదా సైబర్‌ బెదిరింపులు అనుభవించడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా బలహినులవుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలును ఈ హింస నుండి ఎలా రక్షించాలో తెలియదు. వేధించే వారు సాధారణంగా పెద్దవారై ఉంటారు. జనాధారణ పొందిన వారో, ఉన్నత సామాజిక స్థితి లేదా అధికార స్థానంలో ఉన్న వారై ఉంటారు. వీరి వల్ల పిల్లలు బెదిరింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బెదిరింపులకు గురయ్యే వారు అట్టడుగు వర్గ, పేద, అమ్మాయిలు, వైకల్యాలున్న వారు లేదా వలస వచ్చిన శరణార్థి పిల్లలు.
బెదిరింపును గుర్తించే లక్షణాలు: ఉద్దేశం, పునరావృతం, శక్తి. వేధించే వ్యక్తి శారీరక హాని చేసేందుకు ప్రయత్నిస్తాడు. లేదా బాధ కలిగించే మాటలు పదేపదే అంటుంటాడు. అబ్బాయిలపై కూడా ఈ మధ్య కాలంలో శారీరక వేధింపులు బాగా పెరిగిపోయాయి. అయితే బాలికలు మానసిక వేధింపులకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.
ెదిరింపు వ్యక్తి నుండి జరగవచ్చు లేదా ఆన్‌లైన్‌లోనూ జరగవచ్చు. సైబర్‌ బెదిరింపు తరచుగా సోషల్‌ మీడియా, మెసేజ్లు, ఇన్‌స్టంట్‌ మెసేజ్లు, ఈ మెయిల్‌ లేదా పిల్లలు ఇంటరాక్ట్‌ అయ్యే ఏదైనా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిత్యం చూడలేకపోవచ్చు. దాంతో పిల్లలు ఎప్పుడు వీటికి ప్రభావితమవుతారో తెలుసుకోవడం కష్టం.
బెదిరింపులు పిల్లలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయి. భౌతిక ప్రభావాలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డిప్రెషన్‌తో పాటు మాదకద్రవ్య దుర్వినియోగానికి, పాఠశాలల్లో పిల్లల పనితీరు తగ్గడానికి దారితీస్తుంది. వ్యక్తిగత బెదిరింపులకు భిన్నంగా సైబర్‌ బెదిరింపులు ఎక్కడైనా, ఏ క్షణంలోనైనా జరగవచ్చు. ఇది తీవ్రమైన హాని కలిగిస్తుంది. పాఠశాలలు సైతం బెదిరింపులకు మినహాయింపు కాదు.
పిల్లలు సురక్షితంగా ఉండడానికి…
1.బెదిరింపు గురించి మీ పిల్లలకు అవగాహన కల్పించండి
బెదిరింపు అంటే ఏమిటో తెలుసుకుంటే మీ పిల్లలు దానికి గురౌతున్నా, ఇతర పిల్లలు బెదిరింపులకు గురౌతున్నా సలుభంగా గుర్తించగలుగుతారు.
2. పిల్లలతో బహిరంగంగా మాట్లాడండి
బెదిరింపు గురించి మీరు మీ పిల్లలతో ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది. వారు దానిని చూసినా లేదా అనుభవించినా మీతో సులభంగా చెప్పుకోగలుగుతారు. కనుక ప్రతిరోజూ మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. తరగతి, చదువుకు సంబంధించిన విషయాలే కాకుండా వారి భావాల గురించి కూడా ఆరా తీయండి.
3. మీ బిడ్డ సానుకూల రోల్‌ మోడల్‌గా ఉండేందుకు సహాయం చేయండి బెదిరింపులో మూడు పార్టీలు ఉన్నాయి: బాధితుడు, నేరస్థుడు, ప్రేక్షకుడు. పిల్లలు వేధింపుల బారిన పడకపోయినా, వారు తమ తోటివారితో కలిసి మెలిసి గౌరవంగా, దయతో ఉంటే బెదిరింపులను నిరోధించవచ్చు. వారు బెదిరింపును చూసినట్లయితే బాధితురాలి కోసం నిలబడవచ్చు, మద్దతును అందించవచ్చు లేదా బెదిరింపు ప్రవర్తనలను ప్రశ్నించవచ్చు.
4. మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడండి : మీ పిల్లలను తరగతుల్లో చురుకుగా ఉండేలా చూడండి. సంఘంలో వారు ఇష్టపడే కార్యకలాపాలలో చేరమని ప్రోత్సహించండి. ఇది వారిలో విశ్వాసాన్ని అలాగే స్నేహితుల సమూహాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.
5. రోల్‌ మోడల్‌గా ఉండండి : ఇతరులు చెడుగా ప్రవర్తించినప్పుడు మీరు ఎలా మాట్లాడతారో, చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నారో అదే పిల్లలకు నేర్పించండి. ఇతర పిల్లలతో, పెద్దలతో దయ, గౌరవంతో ఉండాలని పిల్లలకు నేర్పించండి. ఆన్‌లైన్‌లో ఎలాంటి పోస్టులు పెట్టాలో కూడా పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. కనుక మీరు పిల్లలకు రోల్‌ మోడల్‌గా ఉండాలి.
6. పిల్లల ఆన్‌లైన్‌ అనుభవంలో భాగం అవ్వండి
మీ పిల్లలు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌లతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్రపంచం ఎలా కనెక్ట్‌ చేయబడిందో మీ పిల్లలకు వివరించండి. వారు ఆన్‌లైన్‌లో ఎదుర్కొనే విభిన్న ప్రమాదాల గురించి వారికి తెలియచేప్పండి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love