ఆశయ పథంలో ‘ఆయన’

'He' in the Path of Ambitionకామ్రేడ్‌ చెన్నుపాటి చంద్రశేఖరరావు కమ్యూనిస్టు కార్యకర్తగా ఎన్నో ఒడిదుడుకులు, వాటిని దాటుకుంటూ ఎదుర్కొన్న పరీక్షలు, సాధించిన విజయాలు అనేకం ఆయన జీవితంలో కనిపిస్తాయి.ఆయన పోరాట జీవితాన్ని ఎర్రపూల వనంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తనతో పెనవేసుకున్న ఘటనలు, ముడివేసుకున్న సందర్భాలు, చెరిగిపోని సన్నివేశాలు కాలక్రమేణా వారిలో భాగమవుతాయి. కానీ విప్లవ నాయకులకు మాత్రం అరెస్టులు, నిర్బంధాలు, జైళ్లు వారి జీవితంలో నిత్య భాగంగా ఉంటాయి. అలాంటి పోరాటయోధుడే చెన్నుపాటి. అరవై ఏండ్ల వైవాహిక జీవితాన్ని పురస్కరించుకుని ‘ఆశయపథంలో నేను’ అనే పుస్తకాన్ని రాశాడు. తండ్రి చెన్నుపాటి వెంకటేశ్వరరావు జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు చేసిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అనేక సందర్భాల్లో అరెస్టయి జైలు జీవితం కూడా గడిపాడు. వారసత్వ ప్రభావం సహజంగా చంద్రశేఖర రావును కమ్యూ నిస్టు ఉద్యమంలోకి నడిపించింది. అయితే తండ్రి చనిపోయేవరకు అంటే తొంభై ఏండ్ల వయసులో కూడా తనకు ప్రేరణగానే నిలిచాడని నాన్న గురించి గొప్పగా చెప్పడం చూస్తుంటే వారి కుటుంబానికి సమాజం పట్ల అంకితమైన సేవను అర్థం చేసుకోవచ్చు.
చంద్రశేఖరరావుది నాన్నది ఏపీలోని కృష్ణా జిల్లా అయినప్పటికీ వలసొచ్చి స్థిరపడింది మాత్రం తెలంగాణలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా, ములుగు మండలం, గోవిందరావుపేట గ్రామం. 1964 సంవత్సరంలో కమ్యూనిస్టు అంతర్గత సిద్ధాంత చర్చలు జరుగుతున్న క్రమంలో ఆయన కుటుంబమంతా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వైపు నిలిచారు. అప్పటి పోరాట నాయ కులు పోట్ల రామనర్సయ్య, ఓంకార్‌ నాయకత్వంలో పనిచేశారు. కమ్యూనిస్టు ముఖ్యనేతలైన మోటురు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి వారి ఇంట్లో జరిగే సమావేశాల్లో రాజ కీయ రిపోర్టులు ఇచ్చేవారు. అంతకుముందు పుచ్చలపల్లి సుందరయ్యగారు, మాకినేని బసవపున్నయ్య గారూ కూడా వచ్చారు. చెన్నపాటి పెద్దనాన్నలైన వీరపనేని కృష్ణమూర్తి, వీరపనేని రామదాసుతో పాటు ముగ్గురు అన్నదమ్ములు స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఉద్యమాలతో మమేకమయ్యారు. వీరే కాదు మొత్తంగా వీరి కుటుంబం నుంచి పదహారు మంది కమ్యూనిస్టు పార్టీకి మూలస్తంభాలుగా ఉంటూ అభ్యుదయవాదులుగా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలనే తమ భుజాలపై మోశారు.
చంద్రశేఖరరావు 1949 ఏప్రిల్‌ 4న జన్మించారు. తండ్రి పోరాట వారసత్వం, పెద్ద నాన్నలు,అన్నదమ్ముల్లంతా కూడా కమ్యూనిస్టు పార్టీలోనే పనిచేశారు. ఈయన చిన్నతనం నుంచే ఆ భావజాలంతోనే పెరిగారు. ముఖ్యంగా ఈ పుస్తకంలో వారి కుటుంబం సీపీఐ(ఎం) ఉద్యమాల్లో ఎలా ంటి పాత్ర పోషించిందో చెప్పడంతో పాటు గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలిం చిన తీరు కనిపిస్తుంది. వారి కుటుంబ నేపథ్యానికి ఉన్న కమ్యూనిస్టు చరిత్రతో చంద్రశేఖరరావు చదువుకునే రోజుల్లోనే పెద్దపెద్ద నాయకుల పేర్లు విన్నాడు.1964లో పార్టీ చీలిన తర్వాత ఎబికె ప్రసాద్‌ సంపాదకత్వాన జనశక్తి పార్టీ అధికార పత్రికగా వస్తుండేది. అందులో ప్రచురితమైన వ్యాసాలను ఊళ్లోవాళ్లకు చదివి వినిపించేవాడు. వియాత్నంలో అమెరికాకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు గెరిల్లాల పోరాటగాథలు చదివి విప్లవానికి ఆకర్షితులయ్యాడు.భారతదేంలో కూడా చైనా, వియాత్నం లాగా సాయధ పోరాటాన్ని చేసి విముక్తి చేయాలని అనుకునేవాడు. విద్యార్థి, కార్మిక, పార్టీ ఉద్యమాల్లో నిత్యం పాల్గొంటూ ఆయన జీవితానికి అతనే ఓ చైతన్యపుధారను వేసుకున్నాడు.ఆయన అరెస్టయినప్పుడు కూడా బాధ కలగలేదు కానీ, సుందరయ్యగారు చనిపోయిన వార్త అతన్ని ఎంతగానో కలిచివేసింది. వెంటనే విజయవాడ వెళ్లి కడసారి చూపుతో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అక్కడే కొంతమంది పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతో కూడా పరిచయం ఏర్పడినట్టు చెన్నుపాటి జ్ఞాపకాల్లో ఉన్నవి.
పుస్తకం ముగింపులో చెప్పిన విషయాలు చూస్తే అతి పిన్న వయసులో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన చుట్టూ జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలను గమనిస్తూ ‘అసమానతలతో ఉన్న సమాజంలో నేను ఉన్నాను’ అని భావన కలిగిందని రాసుకొచ్చారు. అందుకే అధికార పార్టీ ఏదైనా కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడాన్ని సహించని చెన్నుపాటి గ్రామం నుంచి మొదలుకుని పట్టణాల వరకు ఉద్యమ విస్తరణకు, పోరాటాలను అంకితభావంతో ముందుకు తీసుకెళ్లగలిగారు. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి గనుక సిటీ కమిటీలో ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. పూరి గుడిసెల్లో ఉంటూ, ఒక్కపూట తిని మరోపూట పస్తులుంటూ, చాలీచాలని బట్టలతో ఆస్తి లేని బడుగుల గురించి చెన్నుపాటి పడ్డ తపన అంతా ఇంతాకాదు. వారిని చైతన్యపరిచి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలనే దృఢ లక్ష్యంతో సాగు తున్నాడు చెన్నుపాటి. పదవీ విరమణ చేసిన తర్వాత మరింత స్వేచ్ఛగా పార్టీ ఉద్యమాలకు తోడ్పడుతూ పనిచేయడం ఆయన విప్లవస్ఫూర్తికి నిదర్శనం.
– అజయ్ కుమార్‌ 94900 99140

Spread the love