చౌక బేరం

చౌక బేరంభూస్వామి అన్నవరం బేరను పొగాకు వ్యవసాయం చేస్తాడు. దాని కోసం నారుమళ్ళు కట్టి, నీళ్ళు చల్లటానికి నాలుగు టిన్నులు కొని పాలేరుకు అప్పగించాడు. పాలేరు మళ్ళకు తడి వేసి మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి టిన్నులు కనిపించలేదు. గాభరాగా అన్నిచోట్లా వెదికాడు. పక్క పొలంలో పనిచేసే కూలీలను వాకబు చేశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. యజమాని తనని తిడతాడని, వస్తువుల ఖరీదు తన దగ్గర వసూలు చేస్తాడని దిగులు పడ్డాడు. కొన్న మర్నాడే టిన్నులు చోరీ కాబడటంతో చెప్పరానంత ఆగ్రహం కలిగింది రైతుకి. వాటిని ఎవరూ దొంగిలించరు గనుక నీటి గోతుల దగ్గరే వదిలేశాడు పనివాడు.
జరిగిందేమంటే అతడు భోజనానికి వెళ్ళిన కాసేపటికి పొరుగువాడైన గోపాలం దారి వెంట పోతూ మధ్యాహ్నపు ఎండలో తళతళ లాడిపోతున్న టిన్నులను చూసాడు. అక్కడ ఎవరూ లేకపోవటంతో వాటిని కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది. అటూ ఇటూ చూసి, ఎవరూ గమనించటం లేదని రూఢి పరుచుకుని, టిన్నులను తన చేతిలో ఉన్న కర్రకు తగిలించి, భుజాన వేసుకుని చక్కా పోయాడు.
కాసేపు పాలేరుని మందలించి, ఆనక కోపాన్ని దిగమింగుకున్న అన్నవరం జేబు లోంచి డబ్బులు తీసి పాలేరుకిచ్చాడు. ‘నీరు లేకపోతే మొలకలు ఎండి పోతాయి. కొత్త టిన్నులు కొనుక్కురా. నేను వేరే పని మీద వెళ్తున్నాను” అని పురమాయించాడు. అతడు బెంగగా ఇల్లు చేరి బట్టలేసుకుని బయలుదేరుతుంటుంటే, గోపాలం పలకరించాడు.
”ఎక్కడికో ప్రయాణం, పైగా విచారంగా ఉన్నావు. ఏదైనా దుర్వార్త వచ్చిందా?” అన్నాడు సానుభూతిగా. ప్రకాశం లేదంటూ తనకి వచ్చిన కష్టం చెప్పుకున్నాడు. గోపాలం ఏమీ ఎరగనట్టు జాలిపడి ”అయ్యో పాపం ఎంత పని జరిగింది? నువ్వసలే వెర్రిబాగులోడివి. ఆ దుకాణం దగ్గర బేరసారాలు చేయటం నీకు రాదు” అని క్షణం ఆగి, ”ఒక పని చెయ్యి, మా రైతు కోసం నేను కూడా టిన్నులు తెచ్చాను. వాటిని నీకు ఇచ్చి నేను మళ్ళీ కొనుక్కుంటాను” అన్నాడు.
పాలేరుకి ప్రాణం లేచొచ్చింది. ప్రయాణభారం తగ్గించిన ‘ఆపద్భాందవుడ’ని గోపాలాన్ని పొగిడాడు. టిన్నులను పరిశీలించి, అవి కొత్తవేనని తృప్తిపడి, డబ్బులిచ్చి టిన్నులు తీసుకుని ఆనందంగా వెనుది రిగాడు.
సాయంత్రం వచ్చిన రైతు ‘టిన్నులు కొని సకాలంలో తడి పెట్టినందుకు’ సంతృప్తి చెందాడు. పాలేరు హాయిగా నిట్టూర్చబోతుండగా, రైతు టిన్నులను పరీక్షించి ఉలిక్కిపడ్డాడు. ”టిన్నులు ఎక్కడ కొన్నావు?” అడిగాడు తీవ్ర స్వరంతో. పాలేరు అయోమయంగా చూసాడు. రైతు మరోసారి గద్దించటంతో తడబడి, జరిగింది పొల్లు పోకుండా చెప్పాడు. అన్నవరం తలపంకించి ”సరే నువ్వెళ్ళు” అన్నాడు సాలోచనగా. ఆ రోజు రాత్రి రచ్చబండ దగ్గర తగువు పెట్టబడింది. ‘తన టిన్నులు గోపాలం దొంగిలించాడ’ని ఆరోపించాడు అన్నవరం.
జరిగిన మోసం తెలియని పాలేరు తనకు సాయం చేసిన మంచి మనిషని గోపాలాన్ని వెనకేసుకొచ్చాడు కృతజ్ఞతతో. గోపాలం మాత్రం తేలు కుట్టిన దొంగలా గతుక్కుమన్నాడు. తన గుట్టు ఎలా రట్టయిందో అర్ధం కాని గోపాలం అమాయకంగా ముఖం పెట్టి తాను నిర్దోషినని బుకాయించాడు. ‘పుణ్యానికెళ్తే పాపమెదురైంద’ని బాధ పడ్డాడు. గ్రామాధికారి ఆ కల్లబొల్లి మాటలు వినిపించుకోకుండా గోపాలానికి టిన్నుల ఖరీదుకి రెట్టింపు సొమ్ముని జరిమానాగా విధించాడు. ప్రజలు విస్తుపోతుంటే, గోపాలం ”రుజువు లేకుండా కేవలం అనుమానం మీద నన్ను దోషిని చేసి, అపరాధ రుసుం ఎలా విధిస్తారు?” అంటూ ఎదురు తిరిగాడు.
గ్రామాధికారి ఒక టిన్నుని పైకి చూపి, పట్టుకునే కాడ కింద పరికించ మన్నాడు. చూసిన వారికి అక్కడ ‘A’ అనే అక్షరం కనిపించింది.
”అన్నవరానికి తాను కొన్న ఏ వస్తువు మీదైనా తన పేరులోని మొదటి అక్షరం రాయటం అలవాటు. అలా టిన్నుల మీద కూడా మేకుతో గీసాడు. ఇప్పుడు కొత్త టిన్నుల మీదా రాయబోయి, అప్పటికే అక్కడ తను వేసిన అక్షరం ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అదే గోపాలం చేసిన దొంగతనాన్ని పట్టించింది” అని తీర్పు ముగించాడు. దొంగిలించిన సామాను తిరిగి సొంతదారుడికే అమ్మిన దొంగ గడుసుదనానికి జనం ‘ఔరా’ అని ముక్కున వేలేసుకున్నారు అక్కడి జనం.
– కౌలూరి ప్రసాదరావు, 7382907677

Spread the love