బంగారు కథలు, గీతాల ‘వెన్నెల పూలు’

బంగారు కథలు, గీతాల 'వెన్నెల పూలు'కవయిత్రి, రచయిత్రి, వంటింటి రెసిపి చానల్‌ నిర్వాహకులు, నటి, సినీ నిర్మాత శ్రీమతి నెల్లుట్ల రుక్మిణి. అంతేకాదు బాలల కోసం కథలు, కవితలు, గేయాలు వ్రాసి మెప్పించిన వీరు జనగాం సమీపంలోని కొమాళ్ళ గ్రామంలో 12 అక్టోబర్‌, 1963 న పుట్టింది. అమ్మా నాన్నలు శ్రీమతి నెల్లుట్ల లక్ష్మీదేవి – శ్రీ నెల్లుట్ల రామచంద్రరావు. నెల్లట్ల రుక్మిణి పదవ తరగతి వరకు స్వగ్రామం కొమాళ్ళలో చదువుకుంది. తొలుత ఈ గ్రామంలోనే రెండేండ్లపాటు స్థానిక వయోజన విద్యా కేంద్రంలో ఉపాధ్యాయురాలుగా పెద్దలకు పాఠాలు బోధించింది. ఈ సందర్భంలోనే వీరు పాటలు, గేయాలు కథల వైపుకు మళ్ళారు.
భర్త ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లా ఇల్లందులో నివాసం ఉన్న నెల్లుట్ల రుక్మిణి విద్యా బోధనా రంగంలోకి ప్రవేశించి ‘క్రాంతి స్కూల్‌’ స్థాపించి నిర్వహించారు. దాదాపు పదిహేను సంవత్సరాలు ఈ స్కూలుకు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించారు. పాఠశాల పిల్లలో నిరంతరం గడపడం, వారితో విజ్ఞాన, వినోద యాత్రల వంటివి బాలల మనసుకు మరింత దగ్గరయ్యేలా చేశాయి. అలా పిల్లల కోసం ఆలోచనలతో పాటు రచనలను చేసింది నెల్లుట్ల రుక్మిణి. ఈ సమయంలోనే పిల్లలకు తాను స్వయంగా రాసిన పాటలు నేర్పి, నాటకాలు, నాటికలతో వేదికలపైన పరిచయం చేసింది. ఒక్క రచనా, విద్యా రంగంతోనే నెల్లుట్ల రుక్మిణి ఆగిపోలేదు. తనకు యిష్టమైన వంటలను ‘గామా – గెలాక్సీ : రుక్మిణి వంటిల్లు చానల్‌’ నిర్వహిస్తున్నారు. ఈ చానల్‌కు రెండులక్షలకు పైగా సందర్శకులు ఉండడం విశేషం. దాదాపు ఆరు వందలకు పైగా వంటల వీడియోలు ఈ చానల్‌లో అందరికోసం అందుబాటులో ఉన్నాయి.
రచయిత్రిగా నెల్లుట్ల రుక్మిణి సుపరిచితులే కాదు, వివిధ పత్రికల్లో వీరి కథలు, వ్యాసాలు, బాలల కథలు వివిధ పత్రిల్లో అచ్చయ్యాయి. అంతర్జాల రచయిత్రిగా కూడా నెల్లుట్ల రుక్మిణి పాఠకులకు తెలుసు. ‘తెలుగు స్టోరీస్‌’ చానల్‌ కోసం ‘భార్య-భర్త’ వెబ్‌ సీరిస్‌లో నలభై షార్ట్‌ ఫిలింలకు కథలు రచించి అందించడమేకాక, నటిగా కూడా పలు ఎపిసోడ్‌లలో నటించింది. మొక్కల పెంపకం, ఫొటోగ్రఫీల వంటి అభిరుచులతో ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న నెల్లుట్ల రుక్మిణి సినీ నిర్మాతగా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్మం’, ‘ఈ రాత్రి గడిస్తే చాలు’ మొదలైన చిత్రాలు నిర్మించారు.
బాల సాహితీవేత్తగా పిల్లల కోసం కథలు, గేయాలు రాసిన నెల్లుట్ల రుక్మిణి బాల గేయాలను 2023లో ‘వెన్నెల పూలు’ పేరుతో ప్రచురించింది. ఈ పాటల వెన్నెల పూలన్నీ పిల్లలు హాయిగా పాడుకోవడానికి వీలుగా ఉండమేకాక ఇందులోని లయ వారిని ఆకర్శిస్తుంది. ప్రకృతి, పరిసరాలు, జంతువులు, మాటలు, మానసిక వికాసం, మొదలైన అనేక అంశాలు ఉన్నాయి. తొలిగేయం హాయిగా జోకొట్టే జోల పాట కాగా, బాలల గురించి ‘నిదురపో చిట్టి కన్నా/ నిదురపో నా చిట్టి నాన్న/ నిదురలో కమ్మని కలలు వస్తాయి/ కలలోన అమ్మ ముద్దులిస్తుంది/ నిదురపో నా చిన్ని నిదురపోవయ్యా/ నిద్రలోనే నీవు అలసట మరిచిపో’ అంటూ రాస్తుంది కవయిత్రి. మరో గీతంలో ‘కోడి కొక్కరకో కూసింది/ చీకటి మాయం అయ్యింది’ అంటూ ‘తూర్పు ఎర్రగ మారింది/ సూర్యోదయం అయ్యింది/ పని పాటలతో మా పల్లె/ ఒక్కసారిగా మేల్కొంది’ అంటూ పల్లె తల్లిని చక్కగా తన గేయంలో చూపిస్తుంది నెల్లుట్ల రుక్మిణి. పల్లె నేపథ్యంగా వచ్చిన కవయిత్రి కదా! పిల్లలదే ప్రకృతి అంటూ చెప్పిన రుక్మిణి ‘ప్రకృతి అంతా నీదేలే – అందాలన్నీ నీవేలే’ అంటూ చెట్టూ చేమ, పుట్టా పురుగు, గాలీ, నీరు అన్నీ పిల్లల కోసమని, ఆ పిల్లలు ప్రకృతిలో భాగమని భావించి రాయడం బాగుంది. ఇంకా… ‘నీరు, నేల, నింగి, మబ్బులు ఈ పూదోటలు నీవేలే’, ‘పక్షుల గుంపు నువ్వేలే…. పాటల కోయిల నువ్వేలే… పచ్చని చిలుకవు నువ్వేలే… కొంగల బారువు నువ్వేలే… ఊర పిచ్చుకవు నువ్వేలే’ అంటూ ప్రకృతితో పిల్లలను మమేకం చేస్తూ రాస్తుంది కవయిత్రి రుక్మిణి.
‘అన్ని ఊళ్ళ కంటే మా ఊరు మంచిది/ ఇక్కడికి మీరొస్తే అన్ని చూపిస్తాను’, ‘పెద్దల మాటెపుడు పెనుసద్ది మూటరా/ పెద్దవారి మాట పెడ చెవిని పెట్టకు/ కన్నతల్లి మనసు వెన్నపూసంటారు/ కన్నతల్లిని ఎపుడు తూలనాడకురా/ అమ్మానాన్నలు నీకు జన్మనిచ్చినవారు/ అమ్మనాన్నల మాట తలదాల్చి నిలువరా’, ‘చదువుకోవడం మాకిష్టం/ చదువంటేనే మాకిష్టం / చదువు లేనిచో ఎంతో కష్టం/ విద్య రానిచో కలుగును నష్టం/…అక్షర దీపం వెలిగిద్దాం/ ఆనందమును అందిద్దాం/ మన చదువే మన ఇంటికి వెలుగు/ ఈ సత్యమునే చాటి చెపుదాం’ వంటి గీతాలు ఈ పుస్తకానికి అందాన్నిచ్చాయి. బడి నేపథ్యం కదా పిల్లలను వీరులుగా, ధీరులుగా చూడాలన్నది నెల్లుట్ల రుక్మిణి తపన. ‘తెలుగు వీరుల వంటి వీరులే ఇల లేరు/ తెలుగు కవుల వంటి ఘనులు లేరు/ తెలుగు దేశములోన చేవ తక్కువ లేదు/ తెలుగు చిగురు కొమ్మ వెలుగుచాటు’ అంటూ వారికి ఉద్భోదిస్తుంది. రచయిత్రి, కవయిత్రి, నిర్మాత, బాలల భవితవ్యాన్ని తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయిని నెల్లుట్ల రుక్మిణి భవిష్యత్తులో మరిన్ని చక్కని బాల గేయాలు రాయాలని కోరుకుంటూ… జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love