గత రాజసానికి దర్పణాలు – నేటి జాతి వారసత్వానికి నిలయాలు

గత రాజసానికి దర్పణాలు - నేటి జాతి వారసత్వానికి నిలయాలుదేశ సంస్కృతి, వారసత్వ సంపదలో వివిధ రాజవంశీయులు నిర్మించిన కోటలు (ఫోర్ట్స్‌) అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సుమారు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుమారు 100 కోటలు ఉన్నట్లు తెలుస్తోంది. 1861లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆర్కియాలజీకల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏ.యస్‌.ఐ)’ ఈ కోటల భధ్రత, రక్షణ, సంరక్షణ, పరిశోధన వంటి అంశాలు చూస్తూ ఉంటుంది. ఏ.యస్‌.ఐ కి మొట్టమొదటి డైరెక్టర్‌ జనరల్‌గా ‘అలెగ్జాండర్‌ కన్నింగ్హామ్‌’ వ్యవహరించారు. చాలా విషయాలు నమోదు చేయడం ప్రారంభించారు. మధ్యయుగ కాలంలో నిర్మించిన కోటలు హిందూ, ముస్లిం నిర్మాణ శైలిని అనుసరించారు. 17-19 శతాబ్దాల కాలంలో నిర్మించిన కట్టడాలను దాదాపు కోటలుగా పిలిచేవారు. అయితే స్థానిక భాషలో కొన్ని ప్రాంతాల్లో దర్గా (సంస్కృతం), క్విలా (ఉర్దూ), గర్‌ (హిందీ), గఢ్‌ (రాజస్థానీ) అని పిలుస్తారు. ఉదాహరణకు సువర్ణ దర్గ, మెహరన్‌ గర్‌, సుధా గఢ్‌….
గత రాజసానికి దర్పణాలు - నేటి జాతి వారసత్వానికి నిలయాలుమొదట్లో కోటలను మట్టితోను, రాయి/ ఇటుకలతో నిర్మించగా, తరువాత రాతితో తాపీపనితో నిర్మించారు. ఇవే చాలా మట్టుకు నేటికీ నిలిచి ఉన్నాయి. 4వ శతాబ్దంలోనే బలమైన నగరాలు రూపుదిద్దుకున్నాయి. యమునానది ఒడ్డున నిర్మించిన మధుర, గంగానది ఒడ్డున నిర్మించిన మగధ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక దక్షిణ ప్రాంతంలో నర్మదా నది ఒడ్డున ఉజ్జయిని కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కౌస్తభి, రాజగర్‌ నిర్మాణ శిథిలాలు పరిశీలిస్తే ఆనాడు వాడిన పదార్థాలని తెలుస్తోంది. తరువాత కాలంలో కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు చేపట్టారు. చంద్రగుప్తుని కాలంలో దర్శించిన విదేశీ యాత్రికుడు ‘మెగస్తనీస్‌’ ఆనాటి పాటలీపుత్ర నగర కోట వైభవాన్ని ప్రశంసించాడు. నగరాన్ని పెద్ద పెద్ద కలప గోడలతో కాపాలా కాస్తున్నట్లు పేర్కొన్నారు. కోట 570 టవర్లు, 54 ద్వారాలు కలిగి ఉందని, మందిరం అంతా బంగారు వెండి ఆభరణాలతో, నగిషీలతో మిరుమిట్లు కొలుపుతున్నట్లు అభివర్ణించారు. పురాతన కాలంలో కోటలు 6 రకాలుగా నిర్మించేవారని మనుస్మతి గ్రంథం తెలుపుతుంది. వాటిలో కొండకోటలే (హిల్‌ ఫోర్ట్‌) అత్యంత రక్షణ దుర్గంగా ఉండేవి అని తెలిపింది.
దేశంలో ముస్లింల రాకతో మధ్యయుగంలో కోటల నిర్మాణంలో పెను మార్పులు చేసారు. ముఖ్యంగా ‘ఫిరంగి’ అమరికలతో కోటలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. పశ్చిమ/ దక్కన్‌ ప్రాంతంలో కూడా కోట నిర్మాణాల్లో మార్పులు చేసారు. గోల్కొండ కోట, బెరార్‌ (హైదరాబాద్‌ ప్రావిన్స్‌) కోటల నిర్మాణం చూడవచ్చు. ఈ కాలంలో కోటల ద్వారాలు బాగా అలంకరించబడి ఉండేవి. ద్వారాలు బాగా ఎత్తుగా, వెడల్పుగా పెద్ద పెద్ద ఏనుగులు ప్రవేశించడానికి అనుగుణంగా నిర్మించబడ్డాయి. లెంటల్‌ లెవెల్‌ వరకు హిందూ శైలి, ఆర్చ్‌ మొగల్‌ శైలిలో ఉండేవి. శత్రు రాజులు, సేనలు, ఏనుగులు సులభంగా లోనికి ప్రవేశించకుండా ద్వారాలకు ఇనుప మేకుల తాపడం చేసేవారు. ఉదాహరణకు పూణేలోని ‘శని వార్వాడ్‌’ కోటను చూడవచ్చు. ఇక ఈస్ట్‌ ఇండియా కంపెనీ తమ పాలకులు, అధికారులను కాపాడుకోవడానికి స్థానికంగా లభ్యమయ్యే వనరులతో బొంబాయి కోట, విలియం ఫోర్ట్‌ కలకత్తాలో నిర్మించారు. అయితే ఫ్రాన్స్‌కు చెందిన ‘వాబన్‌’ ఇంజనీర్‌ సలహాలతో కొంత మెరుగైన ‘సెయింట్‌ జార్జ్‌ ఫోర్ట్‌’ను మద్రాసులో నిర్మించారు. ఈ విధంగా పురాతన కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకూ మనదేశంలో వివిధ ప్రాంతాలను పాలించిన రాజులు పలు కోటలు నిర్మించారు. వాటిలో నేటికీ కొన్ని మన కళ్ళముందు కదలాడుతున్నాయి. వాటిలో కళాత్మకతను పదికాలాలపాటు కాపాడవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన పాలకులు దేశంలో దాదాపు అన్ని కోటలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క కోటనూ కూల్చలేదు. సరికదా అవసరమైతే మరమ్మతులు చేసి భధ్రపరుస్తున్నారు. దేశంలో ఉన్న ప్రముఖ కోటలు గూర్చి తెలుసుకోవడం సమంజసంగా ఉంటుంది.
ఎర్రకోట : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోటను రెడ్‌ శాండ్‌ స్టోన్‌తో షాజహాన్‌ కాలంలో 17వ శతాబ్దంలో నిర్మించారు. 1857వరకూ అనేక మంది మొగల్‌ చక్రవర్తులు నివాసం ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి మన దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరణ మన ప్రధాని ఇక్కడే చేస్తున్నారు.
ఆగ్రా కోట : ఇది ఆగ్రాలో ఉంది. షాజహాన్‌ పట్టాభిషేకం ఇక్కడే జరిగింది. 1638 వరకూ మొగల చక్రవర్తులకు నివాసంగా ఉంది. అక్బర్‌, షాజహాన్‌ ఈ కోటను అవసరాలకు అనుగుణంగా రెనోవేషన్‌ చేసారు. ‘అమీర్‌ కోట’ జైపూర్‌లో ఉన్నది. మండుటెండలో కూడా పర్యాటకులను ఆకర్షించే కోట ఇది. కోటపై నుంచి మైయోట సరస్సును చూడవచ్చు.
బికనీర్‌లో ఉన్న ‘జూనాగర్‌ ఫోర్ట్‌’ మరో అద్భుతమైన కోట. 1571-1611 మధ్య కాలంలో పాలించిన రాజా రామ్‌ సింగ్‌ కాలంలో ‘కరణ్‌ చంద్‌’ ఆధ్వర్యంలో ఈ కోట నిర్మాణం జరిగింది. జోద్‌పూర్‌లోని ‘మెహర్‌ గర్‌’ కోట నగర వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. 1460లో రావు జోథా నిర్మించారు.
మరొక కోట ‘జై సాల్మీర్‌’ కోట 1156లో రాజపుత్ర రాజు రావల్‌ జై సాల్‌ నిర్మించారు.
మధ్య ప్రదేశ్‌ లోని ‘గ్వాలియర్‌ కోట’ కొండపై నిర్మించినది. 8వ శతాబ్దంలో గ్వాలియర్‌ నగర వైభవానికి ప్రతీకగా నిర్మించారు. అద్భుతమైన నిర్మాణం. దీనిలోని ‘గజూరి మహల్‌’ ఆర్కియాలజీ మ్యూజియంగా ఉంది. చిత్తోర్గర్‌లో ఉన్న చిత్తోర్‌ గర్‌ ఫోర్ట్‌’ మరో అద్భుతమైన కోట. కొండపై 180 మీటర్ల ఎత్తులో ఉంది. 692 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 1567 వరకూ రాజపుత్ర రాజుల అధీనంలో ఉన్న ఈ కోట తదుపరి అక్బర్‌ అధీనంలోకి వచ్చింది. ‘ఝాన్సీ ఫోర్ట్‌’ 1613లో ఝాన్సీలో రాజా బీర్‌సింగ్‌ బాంగ్ర కొండపై నిర్మించారు. పది గేట్లు ఉంటాయి. ఇక హైదరాబాద్‌లో ఉన్న ‘గోల్కొండ కోట’ కాకతీయుల కాలంలో 480 అడుగుల ఎత్తులో నిర్మించిన మహా అద్భుతమైన కట్టడం. నేటికీ రోజూ అనేక మంది సందర్శించి, చక్కటి అనుభూతి పొందుతారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే… ఇలా దేశ వ్యాప్తంగా వివిధ కాలాల్లో అనేక ప్రాంతాల్లో పరిపాలన చేసిన వివిధ రాజవంశీయులు అనేక కోటలు నిర్మించారు. ఆనాటి సంపద, సంస్కృతి సంప్రదాయాలు, కళానైపుణ్యం, ఠీవి హుందాతనం నాగరికత, పరిపాలన, నిర్మాణ శైలి, కౌసల్యం వంటివి ఇటువంటి కోటల ద్వారా మనం అందరం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కోటలు దర్శించుట ద్వారా ఆనందం, అనుభూతి, అనుభవాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఆనాటి రాజసానికి నిలువెత్తు నిదర్శనాలు, మన జాతి వారసత్వానికి నిలయాలుగా ఈ ‘కోటలు’ నిలుస్తాయనటంలో అతిశయోక్తి లేదు. భావితరాలకు ఈ వారసత్వ సంపదను అందించుటలో మనం అందరం భాగస్వామ్యం కావాలి.

– ఐ.ప్రసాదరావు 6305682733

Spread the love