అనుమానం మొగడు ఆలిని వీపుకు కట్టుకున్నడట

అనుమానం మొగడు
ఆలిని వీపుకు కట్టుకున్నడటలోకం మీద రకరకాల మనుషులు వుంటరు. కొందరికి అనుమానాలు ఎక్కువ. అనుమానం అంటే అపనమ్మకం. నాకు తెల్వకుంట ఏం జరుగుతుందో అని నిరంతరం కనిపెడుతనే వుంటరు. ఇంత పనిచేస్తున్నవు బిడ్డా అని, చేసే సూపిస్తం అని, అయ్యే పని కానిస్తరు. ఎవలనైనా నమ్మాలె అంతే. నమ్మక ఎంక్వైరీ చేస్తే తనకు తెల్సి సాటుమాటు ఎన్నో చేస్తరు. ఈ సందర్భంలోనే ‘అనుమానపు మొగడు ఆలిని వీపుకు కట్టుకున్నడట’ అంటరు. ఇంతే కాదు దీనికి కొనసాగింపు కూడా ఏందంటే ‘పెండ్లాం మిండన్ని కొప్పుల పెట్టుకున్నదట’ అని సామెతను పూర్తి చేస్తరు. వీనికి తాపతాపకు అనుమానం. ఈ అనుమానమే ఆమెకు అవమానం అయ్యింది. అనుమానపు మొగనికి తగిన బుద్ది చెప్పాలని పెండ్లం ప్రియున్ని కొప్పుల పెట్టుకున్నది. అనుమానం అంటే మొగోనికే వుండది. ఇందులో ఆడవాల్లు రెండు ఆకులు ఎక్కువే సదువుతరు. అందుకే వాల్లను కూడా ‘అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందట’ అంటరు. మనస్తత్వాల ఆదారం కొన్ని ఇలా తయారై వుంటయి. అందరు స్త్రీలు ఇట్ల అందరు పురుషులు ఇట్లా అని కాదు గాని సామెతలు చలామణిలోకి వచ్చేశాయి. ఎప్పుడైనా మనిషి సాఫ్‌ సీదాగా వుండాలి. అనుమానం, నమ్మకం లేకపోవడం వుంటే వాల్లను వీనికి ‘అనుమానం పెనుభూతం’ అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా ఎక్రిస్తరు. అట్లనే ‘అనుమానం ప్రాణ సంకటం’ అని కూడా అంటరు. కొందరి తత్వాల వల్లనే ఇట్లా ఉంటరు కావచ్చు. వైద్యులను నమ్మరు, దుకాణంలో సామాను కొనే దగ్గర వాల్లను నమ్మరు. పనిచేసే వద్ద సహచర కార్మికులను, ఉద్యోగులను నమ్మరు. అయితే వీల్లకు ఏదో దెబ్బ తగిలే ఇట్లా చేస్తరు కావచ్చు. గానీ వీల్లకే ఎక్కువ నష్టాలు జరుగుతాయి. మనిషిని ముందు సంపూర్ణంగా నమ్మాలి కదా. అపనమ్మకం, అనుమానం చెందితే కష్టమే.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love