శ్రీశ్రీని దాటి పోలేం

శ్రీశ్రీని దాటి పోలేం‘అందమైన అబద్దాలలో కన్నా నిష్టూరమైన నిజంలోనే మంచి కవిత్వం దర్శనీయమవుతుందని విశ్వసించాను. దీనితో మహాప్రస్థాన గీతాల సామాజిక వాస్తవికతకు దర్పణం పట్టడం జరిగింది’ అని మహాకవి శ్రీశ్రీనే స్వయంగా ప్రకటించుకున్నాడు.
అంతేకాదు ఒక అడుగు ముందుకేసి ఈ దోపిడీని దుయ్యబట్టి తిప్పికొట్టడం కంటే మరో మహత్తర కర్తవ్యం మంచి కవిత్వానికి ఉండబోదని స్పష్టం చేశాడు.
ఇక చివరిగా ‘మహాప్రస్థానం’లో అభ్యుదయ కవిత్వం విప్లవ బీజాలు వున్నాయి. విప్లవ సాహిత్యం లేదు అని చెబుతూనే విప్లవ సాహిత్యం అంటే సామాన్య ప్రజానీకాన్ని విప్లవాచరణకు ఉద్యుక్తుల్ని చేసే విధంగా సాగేదే!’ అని తిరిగి తానే బదులిచ్చాడు (1980).
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు కవిత్వంలో అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం వేరయా అని ఆవిధంగా తేల్చి చెప్పాడు.
ఆధునిక కవిత్వ ముడిసరుకు ‘సామాజిక వాస్తవికతే’ అని బల్ల గుద్ది చెప్పడం వల్ల తదనంతర కవులు ఎవరైనా శ్రీశ్రీ దారుల్లో లేదా పక్కనుంచే పోగలరు తప్ప శ్రీశ్రీ ని దాటుకుని పోలేరనేది యధార్ధం.
ఆధునిక కవిత్వానికి దశాదిశ నిర్దేశనం చేసినవాడు శ్రీశ్రీ. వస్తువు దశను నిర్ణయిస్తే శిల్పం దిశను నిర్ణయిస్తుంది. ఏది రాయాలో వస్తువు (ఇతివృత్తం) చెబితే, ఎలా రాయాలో (శిల్పం) దిశను తెలుపుతుంది.
‘ఐ’లో భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవగీతాన్ని నేను, స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం… అంటూనే చివరకు నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం అని మరల తానే స్వయంగా గర్జిస్తాడు చెలం అందుకే యోగ్యతా పత్రంలో …
నెత్తురూ, కన్నీళ్లు తడిపి కొత్త టానిక్‌ తయారు చేసాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అని చెలం కితాబు ఇచ్చాడు.
‘శ్రీశ్రీ ఇప్పుడు రాస్తున్న కొత్త తనాలకి ప్రజలు ఇంకా అలవాటు కాలేదే. ఇంకా ఈ సర్రలియజం (అతివాస్తవికత) తెస్తే అసలు గాబరాపడి చదవడం మానేస్తారేమో! అన్నాడు చెలం. మ్యాన్‌ ఆఫ్‌ లిటిల్‌ ఫైత్‌.
శ్రీశ్రీ ఏం జవాబు చెపితేనేం, మానవ జాతిని ఉద్దరించడానికి కొత్త మతాన్ని కనిపెట్టిన ప్రవక్త వలె చిరునవ్వు నవ్వాడు. తన రాతలు అంగీకారాన్ని పొందేందుకు ఇంకా ఆశ వదలక కాచుకుని వున్న చెలం మానవత్వం మీద శ్రీశ్రీ కి వున్న గాఢ విశ్వాసాన్ని చూసి తలవొంచాడు. (1940).
మహారచయితల, మహాకవుల అక్షరాలు భావాలే కదు మానవత్వంపై గల అచంచల విశ్వాస, అభిసారిక నిరీక్షణ కూడా మనం గమనించవచ్చు.
అక్కడితో ఆగలేదు చెలం, ఈ విధ్వంసం అనంతరం నవ ప్రపంచ నిర్మాణ కర్రల ఉత్సాహంలో కలసి పాడుతున్నాడు.
ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు ఏడుపులు, క్షామాలు, యాచకా క్షుద్ర కవిత్వాలు, శిక్షణలు, స్కాండిల్స్‌ (కుంభకోణాలు) లేవో, ఆ లోకాన్ని డ్రీమ్‌ చేస్తున్నాడు కవి. మీ ఆనందం కన్నా ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు నరకం అంటే అట్లాంటి లోకం శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు?
ఇంకా రాత్రి చీకట్లో లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటూ దీనంగా పలువరించే సమయాన్ని ఉషోదయాన్ని గర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ. దేవుడు అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు మూటగట్టుకుని కులికే మీకు అర్ధంకాని బాధ మరణం దరిద్రం, అవిశ్వాసం, అశాంతి… ఇవన్నీ అర్ధంగాక గట్టిగా సృష్టిస్తే ప్రశ్నిస్తున్న యువకుల లక్ష కంఠాన్ని ఏకం చేసి పలుకుతున్నాడు శ్రీశ్రీ.
శ్రీశ్రీ దార్శనికత ఎంత వాడిదో వేడిదో నిష్కర్షగా ఎనభై ఏళ్ల క్రితమే తెలిపాడు చెలం.
వర్తమాన పరిస్థితులకు అవి దర్పణం పట్టినా, ఇక్కడితో ఆగితే అది అసంపూర్ణమే మరి.
‘చారిత్రక విభాత సంధ్యల/ మానవ కథ వికాసమెట్టిది/ ఏ కాలంలో సాధించినదీ పరమార్ధం? ఏ శిల్పం? ఏ సాహిత్యం? ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?/ ఏ వెల్గులకీ ప్రస్థానం? ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?’
అని దేశ చరిత్రల్లో ప్రశ్నించినా అది చరిత్రకే కాదూ, వర్తమానానికీ వర్తిస్తుంది. కవుల్ని, కళాకారుల్నే కాదు, ప్రతి ఒక్కర్ని వర్తమానంలోకి లాక్కుపోతాడు శ్రీశ్రీ. నీ కృషి ఏమిటి? నీ మార్గం ఏమిటి? అని ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు.
తిరగబడేవాడా! ప్రశ్నించేవాడా? అన్యాయాలకు ఆహుతి కావడానికైనా జంకనివాడా? ఖైదా! రైడీ! ఖూనీకోర్‌! బేబీ! మానవుడా మానవుడా అని మానవుని భిన్న రూపాలను చూపిస్తూ ముగిస్తాడు.
కనుకనే మన కవులెవ్వరం శ్రీశ్రీని దాటి పోలేం!
– కె.శాంతారావు,
9959745723

Spread the love