Tuesday, April 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు

డ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు

- Advertisement -

– దానితో పంజాబ్‌ నష్టపోతుంది
– పాఠశాలల ఎదుటా గంజాయి అమ్మకాలు ఆందోళనకరం
– ఈ దందాలో ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టం : ‘స్పందన’ బృందాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మహిళలపై జరుగుతున్న 80 శాతం అఘాయిత్యాలు, అకృత్యాలకు మత్తు పదార్థాలు, డ్రగ్సే కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లాంటి రాష్ట్రం డ్రగ్స్‌ వల్ల నిర్వీర్యమైందని ఆయన గుర్తు చేశారు. వ్యసనాల బారిన పడిన ఆ రాష్ట్రం ఇప్పుడు కోలుకోని స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా పిల్లలు సరైన దారిలో నడవకపోతే అంతా వృథా అని పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలల ముందున్న చిన్న చిన్న దుకాణాల్లో కూడా గంజాయి అమ్మటం ఆందోళనకరమని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఈగల్‌ ఫోర్స్‌ను తీసుకొచ్చి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు. ఈ దందాలో ఎంతటి పెద్దవారు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులున్నా వదలకుండా అరెస్టు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ పోలీసులు ‘స్పందన’ పేరిట కొత్తగా ప్రవేశపెట్టిన తక్షణ రక్షణ బృందాలను సోమవారం సీఎం ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఇటీవల డ్రగ్స్‌ కేసులో ప్రజా ప్రతినిధులను సైతం అరెస్టు చేశామని గుర్తు చేశారు. గంజాయి, డ్రగ్స్‌, మద్యానికి బానిసైన వారి వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతు న్నాయని తెలిపారు. వారిని మార్చి, సరైన దారిలో నడిపించటంపై పీస్‌ కమిటీ సభ్యులు దృష్టి సారించాలని కోరారు. మాదకద్రవ్యాల వల్ల వచ్చే రుగ్మతలపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించినప్పుడే రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళల రక్షణ, సాధికారతే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భద్రతను ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకుం టాయని, అదే మార్గాన్ని తెలంగాణ అనుసరిస్తోందని అన్నారు. స్వాతం త్య్రం వచ్చిన వెంటనే దేశంలో మహిళ లకు ఓటుహక్కు కల్పించారనీ, మహిళలకు సమాన హక్కులు కల్పించిన చరిత్ర మనకే ఉందని గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ను బలోపేతం చేసినట్టు తెలిపారు.ప్రమాదంలో ఉన్న మహిళలకు అండగా నిలిచేలా ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామనీ, స్పందన ద్వారా 24 గంటలు సహాయం అందిస్తున్నామని వివరించారు. సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం కాదు, సమస్యనే రాకుండా చూడడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుతో ఇవ్వడం, 67 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60 వేల కోట్ల రుణాలు అందించడం వంటి చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక ఉపశమనం కలిగిందన్నారు. మహిళా సంఘాలకు బస్సులు, సోలార్‌ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్‌ బంకులు అందజేసి ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, j¶నిఫాం తయారీ వంటి బాధ్యతలు కూడా మహిళా సంఘాలకే అప్పగించినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -