ఢిల్లీ హ్యాట్రిక్ ఓటమి
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంతగడ్డపైనే 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీకిది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లు.. భువనేశ్వర్ కుమార్ (3/5), జోష్ హేజిల్‌వుడ్ (4/12) సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించారు. రసిఖ్ సలామ్ దార్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 6.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. దేవ్‌దత్ పడిక్కల్ (34; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లీ (23; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), జాకబ్ బెతెల్ (20; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. దిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్ ఒక్కడే వికెట్ తీసుకున్నాడు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ పొరెల్ (30) టాప్ స్కోరర్. డేవిడ్ మిల్లర్ (19), కైల్ జేమీసన్ (12) పరుగులు చేశారు. భువనేశ్వర్, హేజిల్‌వుడ్ విజృంభించడంతో ఒక దశలో ఢిల్లీ ఎనిమిది పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ డకౌట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (5), కేఎల్ రాహుల్ (1), నితీశ్ రాణా (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 13/6. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో ఇదే అత్యల్ప స్కోరు. ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన తీరును చూస్తే ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంటుందా అనే అనుమానం కలిగింది. పవర్ ప్లే తర్వాత ఢిల్లీ బ్యాటర్లు కాస్త పుంజుకోవడంతో చెత్త రికార్డు నుంచి తప్పించుకుంది.
ఆర్సీబీ అదుర్స్
- Advertisement -
- Advertisement -



