ఎన్నికల వేళ కరీంనగర్‌లో కలకలం

Election time Chaos in Karimnagar– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ హోటల్‌లో రూ.6.65కోట్లు పట్టివేత
– విశ్వసనీయ సమాచారం మేరకు అర్ధరాత్రి పోలీసుల రైడ్‌
– అకౌంట్స్‌ రూమ్‌లో దాచిన డబ్బు కార్టన్ల వెలికితీత
– ఎన్నికల ఫండేనంటూ పొలిటికల్‌ వర్గాల్లో చర్చ
– సొంత పార్టీ మనిషి నుంచే ఇన్‌ఫర్మేషన్‌ లీకైందంటూ గుసగుస
– నగదును ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు
– విచారణ తరువాతే విషయాలు వెల్లడిస్తామని ప్రకటన
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
పార్లమెంట్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన రోజునే కరీంనగర్‌లో భారీ నగదు పట్టివేత సంచలనం రేపింది. అందులోనూ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌కు చెందిన ప్రతిమా హోటల్‌లో పోలీసులు దాడులు చేసి రూ.6.65కోట్లు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకే 30మంది పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా హోటల్‌లో రైడ్‌కి దిగడం, వెనువెంటనే అకౌంట్స్‌ గదిలోని పేపర్‌కాటన్‌ బాక్స్‌ల్లో దాచిన నగదును పట్టుకోవడం సినిమా ట్విస్ట్‌ను తలపించింది. పార్టీ ముఖ్యుల నడుమే ఉండాల్సిన ఇంత పెద్ద మొత్తంలో నగదు రూపంలో ఉన్న ఎన్నికల ఫండ్‌ విషయం బయటకు పొక్కడం, ఇదీ పార్టీలోని సొంత మనిషి నుంచే ఇన్‌ఫర్మేషన్‌ లీక్‌ అయిందనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఏదేమైనా ఇంత మొత్తం నగదును ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు విచారణ అనంతరం విషయాలు వెల్లడిస్తామని ప్రకటించడం కొసమెరుపు.
కరీంనగర్‌ నడిబొడ్డున గల ప్రతిమా మల్టీప్లెక్స్‌, హోటల్‌లో పెద్ద మొత్తంలో అన్‌ అకౌంటబుల్‌ నగదు ఉన్నదనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి 30మంది పోలీసులు రైడ్‌ చేశారు. కరీం’నగర’ ఏసీపీ నరేందర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, స్పెషల్‌ యాక్షన్‌ టీమ్‌, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌బ్రాంచి పోలీసులు సంయుక్తంగా హౌటల్‌ పై మెరుపు దాడి చేసి తనిఖీలు చేపట్టారు. దాదాపు 8 గంటలపాటు హోటల్‌లోని అన్ని చోట్లా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సెల్లార్లో గల అకౌంట్స్‌ ఆఫీస్‌ రూమ్‌ నందు రూ.6కోట్ల 67 లక్షల 32వేల 50 ఉన్నట్టు ఏసీపీ నరేందర్‌ తెలిపారు. ఈ నగదుకు సంబంధించి ప్రతిమ హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ పి.రాఘవేంద్రబాబును వివరణ కోరగా, సరైన సమాధానం చెప్పలేదని చెప్పారు. దీంతో పట్టుబడిన నగదును వీడియో చిత్రీకరణ ద్వారా పంచనామా నిర్వహించారు.
తదుపరి ప్రక్రియ కోసం శనివారం ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చి.. నగదును సంబంధిత శాఖ అధికారులకు అప్పగించారు. అయితే, ఇది ఎన్నికల కోసం డంప్‌ చేసిన నగదా? లేక హోటల్‌ నిర్వహణ, ఇతర ఏదైనా లావాదేవీలకు సంబంధించినదా? అనే విషయాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ప్రకటించారు.
విశ్వసనీయ సమాచారమిచ్చిందెవరూ..?
ఇంత పెద్దమొత్తంలో నగదును పట్టుకోవడంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన విశ్వసనీయ సమాచారమేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన డబ్బే అయితే ఆ విషయాలు సంబంధిత అభ్యర్థి, తన నమ్మకస్తుల నడుమే ఉంటాయి. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే రోజుకు ముందు రోజు అర్ధరాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారా? అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో తలెత్తుతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ కదనభేరి సందర్భంగానే పార్టీ నుంచి ఎన్నికల ఫండ్‌ వచ్చి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూనే దాన్ని అభ్యర్థికి చెందిన హోటల్‌లో దాచారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ లీక్‌ వ్యవహారం కచ్చితంగా బీఆర్‌ఎస్‌లో కీలకమైన నేత నుంచే పోలీసులకు చేరిందన్న చర్చ కూడా పొలిటికల్‌ సర్కిల్‌లో సాగుతుండటం గమనార్హం.

Spread the love