క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

– రాజన్న జోన్‌ డీఐజీ రమేష్‌నాయుడు
ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనిఖీ
నవతెలంగాణ – కరీంనగర్‌ క్రైం
ట్రాఫిక్‌ పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాజన్న జోన్‌ డీఐజీ కే.రమేష్‌నాయుడు సూచించారు. కరీంనగర్‌లోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఏసీపీ విజరు కుమార్‌ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో డీఐజీతో పాటు, పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు మొక్కలు నాటారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఐజీ కె.రమేష్‌నాయుడు మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ పోలీసులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించా లన్నారు. ఎక్కువగా ప్రజలకు కనిపించే విధంగా ఉండే ట్రాఫిక్‌ పోలీసులను 99శాతం ప్రజలు గమనిస్తుంటారని, విధుల్లో క్రమశిక్షణ తో మెదులుతూ చురుకుగా ఉండాల ని చెప్పారు. శాస్త్రీయ బద్ధమైన రీతిలో విధులను నిర్వహించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు వివిధ రకాల శిక్షణలు పొందేందుకు ఆసక్తి చూపాలని తెలిపారు. కరీంనగర్‌లో ట్రాఫిక్‌ సిగల్స్‌ వినియోగంలోకి రావడం ద్వారా 50శాతం శారీరక శ్రమ తగ్గుతుందని చెప్పారు. నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తు న్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ సుబ్బరాయుడు, ఏసీపీ విజరు కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు తిరుమల్‌, నాగార్జునరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love