బ్రిబ్‌కో కంపెనీపై ఈడీ దాడులు

– రూ.12 కోట్ల విలువైన నగలు, నగదు స్వాధీనం
– రూ.800 కోట్ల మేర వ్యాపారంలో అవకతవకలు గుర్తింపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నగరంలోని బ్రిబ్‌కో కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మెరుపుదాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో బ్రిబ్‌కో కంపెనీ యాజమాన్యం నివాస గృహాల నుంచి రూ.12 కోట్ల విలువైన నగదు, బంగారు నగలను స్వాధీనపర్చుకున్నారు. అంతేగాక, రూ. 800 కోట్ల మేరకు వ్యాపార లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బ్రిబ్‌కో కంపెనీ యాజమాన్యం ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి వ్యాపారలావాదేవీల్లో అక్రమాల కు పాల్పడినట్టు ఈడీ దృష్టికి వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని బ్రిబ్‌కో కంపెనీ కార్యాలయంతో పాటు ఆ కంపెనీ ఎండీ సురేశ్‌రెడ్డి, సీఎఫ్‌ఓ రాజు, చీఫ్‌ ఆడిటర్‌ మురళీమోహన్‌ల నివాసాల్లో ఈడీ అధికారులు గత మూడ్రోజులగా సోదాలను నిర్వహించారు. ఈ సోదాలలో యాజమాన్యం నివాసం నుంచి రూ.3 కోట్ల నగదుతో పాటు, రూ.9 కోట్లకు పైగా విలువైన బంగారు నగలను అధికారులు స్వాధీనపర్చుకున్నారు. అంతేగాక, ఈ కంపెనీ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి వ్యాపార లావాదేవీలు సాగించినట్టుగా చూపే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, ఇతర రికార్డులను కూడా ఈడీ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. మొత్తమ్మీద ఈ కంపెనీ రూ.800 కోట్ల మేరకు వ్యాపారలావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు తేల్చారు. అలాగే, మరో రూ.300 కోట్ల మేరకు వ్యాపారాలకు సంబంధించి లెక్కపత్రాలు లేనట్టుగా కూడా గుర్తించారు. విచారణ ఇంకా కొనసాగుతున్నదని ఈడీ అధికారులు తెలిపారు.

Spread the love