విద్యతోనే వికాసం-అభివృద్ధి

– మన ఊరు- మన బడితో 172పాఠశాలలు అందుబాటులోకి..
–  ప్రాధాన్యతాపరంగా ఒక్కో సమస్య పరిష్కరించుకుందాం: మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ – ఎల్లారెడ్డిపేట
విద్యతోనే వికాసం, అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ప్రాధాన్యతాపరంగా ఒక్కో సమస్యను పరిష్కరించుకుందామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా 172 పాఠశాలలు అందుబాటులోకి వస్తున్నట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ.8.5 కోట్లతో అభివృద్ధి చేసిన విద్యా క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. చిన్నారుల బంగారు భవిష్యతుపై మరింత దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. చిన్నారులను ఎట్టా తీర్చిదిద్దాలి, వాళ్ల కాళ్లపై నిలబడేలా.. ఇరుగు పొరుగుతో ఎట్టా మెదులుకోవాలో, సంతోషంగా ఎట్టా జీవించాలో కరికులమ్‌లో ప్రభుత్వం పొందుపరుస్తుందన్నారు. మానవ సంబంధాలు మెరుగుపర్చేందుకు బోధనలో భాగంగా
శిక్షణ ఇచ్చేలా చూస్తామన్నారు. తొమ్మిదేండ్ల కిందట విద్యా, వైద్యం, విద్యుత్‌, వ్యవసాయ రంగాలు ఎలా ఉండేవో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. తండాలను జీపీలుగా చేశామన్నారు. అనేక సమస్యలకు పరిష్కారం చూపామని వివరించారు. పలకతో వచ్చి పట్టాతో వెళ్లాలనే లక్ష్యంతో గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్‌ ఏర్పాటు చేశామన్నారు. మూడు దశల్లో 510ప్రభుత్వ పాఠశాలల్లో 12మౌలిక సదుపాయలు, వసతులు సమకురుతాయన్నారు. 60పాఠశాలల్లో 22వేల మంది విద్యార్థులకు కంప్యూటర్‌ చాంప్స్‌ పేరుతో బేసిక్‌ కంప్యూటర్‌ పరిజ్ఞానం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలలకు టి-ఫైబర్‌తో అనుసంధానం చేయనున్నామన్నారు. సిరిసిల్ల ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోనే ముందుందన్నారు. దేశంలో విద్య విషయంలో బెస్ట్‌ స్కూల్‌ ఎక్కడ ఉన్నాయంటే సిరిసిల్ల అనే పేరు రావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలకు సెల్ప్‌ డిఫెన్స్‌పై శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ రాఘోత్తంరెడ్డి, టెస్కాబ్‌ చైర్మెన్‌ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జెడ్పీ చైర్మెన్‌ అరుణ, గ్రంథాలయ చైర్మెన్‌ ఆకునూరి శంకరయ్య, సెస్‌ చైర్మెన్‌ చిక్కాల రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love