పురపాలనలో పౌరభాగస్వామ్యం అప్పుడే సత్ఫలితాలు సాధ్యం

– ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పురపాలనలో పౌరభాగస్వామ్యం పెరిగితేనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సంస్థ తెలిపిందని వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారంనాడిక్కడి అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తొమ్మిదేండ్ల క్రితం హైదరాబాద్‌ నగరం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, పాలనా దక్షత గురించి అనేక అనుమా నాలు వ్యక్తం అయ్యాయనీ, కానీ నేడు రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్‌ నగరం గ్లోబల్‌ సిటీగా మారాలంటే మరింత శ్రమిం చాల్సి ఉందన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. పురపాలనలో ఆస్కీ తమతో కలిసి పనిచేస్తున్నదనీ, మంచి సలహాలు, సూచనలు ఇస్తున్నదని ప్రసంసించారు. ”ఇల్లు మాత్ర మే నాది. నగరం నాది కాదు” అనే బాధ్యతా రాహిత్యం ప్రజల్లో ఉన్నన్ని రోజులు ఎన్ని నిధులు ఖర్చుపెట్టినా నగరం సంపూర్ణంగా మారదని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలనీ, అప్పుడే మార్పు సాధ్యమవుతుందన్నారు. ‘రెడ్యూస్‌, రీసైకిల్‌, రీయూజ్‌’ అనే ట్రిపుల్‌ అర్‌ మంత్ర ఉన్నదనీ, దాన్ని విస్త్రుతంగా ఆచరణలోకి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కలు నాటి, వాటిని కాపాడుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామనీ, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ పెట్టి, చెట్ల పెరుగుదలకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామ న్నారు. పట్టణ, పంచాయతీరాజ్‌ చట్టంలో గ్రీన్‌ బడ్జెట్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల అవస రాల మేరకు ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయలు అందుబాటు లోకి వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధించడం సాధ్యమవుతుందని వివరించారు. డ్రై రిసోర్సెస్‌ సెంటర్ల ద్వారా మహిళా సంఘాలు గౌరవ ప్రదమైన ఆదాయాన్ని పొందుతున్నాయనీ, రాష్ట్రంలో ఈ సెంటర్ల ద్వారా రూ.6 కోట్లకు పైగా ఆదాయాన్ని స్వయం సహాయక సంఘాలు అర్జించాయని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ఉత్పత్తి అయ్యే వెట్‌ వేస్ట్‌ ద్వారా దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నదని చెప్పారు. నగరం పెరుగుతున్న కొద్దీ చెత్త సేకరణతో పాటు దాన్ని రీసైకిల్‌ చేసే వ్యవస్థలు మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ నగరంలో మరో రెండు కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌్‌ రీసైకిల్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్టు తెలిపారు. పురపాలికల్లో చెత్త నుంచి గ్యాస్‌ వెలికితీసి వంటకి, వాహనాలకు ఉపయోగించే కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నామన్నారు. 141 పుర పాలికల్లో 178 కోట్ల రూపాయలతో బయో మైనింగ్‌ ప్రారంభించామనీ, మానవ వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వంద శాతం వృధా నీటిని రీసైకిల్‌ చేస్తున్న నగరంగా త్వర లో హైదరాబాద్‌ నిలుస్తుందన్నారు. సోలార్‌ ఉత్పత్తి లో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆస్కీ చైర్మెన్‌ కే పద్మనాభయ్య, డైరెక్టర్‌ వీ శ్రీనివాసచారి, సీడీఎమ్‌ఏ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love