కలమే కాదు.. జూలూ విదల్చండి

– సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలి
– ఇందూరు జైలు ప్రాంగణంలో దాశరధి విగ్రహం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
సమాజహితం కోసం కలాన్ని విదల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.బుధవారం నిజామాబాద్‌లో జరిగిన హరిద రచయితల సంఘం 5వ మహాసభలో కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. దాశరధి, వట్టికోట అళ్వారుస్వామిని నిజాం కాలంలో ఇందూరు జైలులో బంధించారని, ఆ జైలు గోడ మీద దాశరధి బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మాట యావత్తు తెలంగాణ ఉద్యమానికి బాట చూపించిందని తెలిపారు. ఆ జైలు గోడను తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 40 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
జులై 22న దాశరధి జయంతి సందర్భంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త తరానికి దాని ప్రాముఖ్యత తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఢిల్లీ నగర నడిబొడ్డున ఒక ఆడపిల్లను కత్తిపోట్లు పొడిచి బండరాయితో తలపై మోది చంపేస్తే కూడా చుట్టూ ఉన్నవాళ్లు వీడియోను చిత్రీకరించారు కానీ ఎవరూ ఆపిన పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దరిద్రపు సెల్‌ ఫోన్‌ అనేది చేతికి, మనిషికి ఎక్స్‌ టెన్షన్‌ లా తయారయ్యి మనుషుల్లో మానవత్వం, సున్నితత్వం లోపిస్తున్నాయని, వాటిపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ఒక పుస్తకం చదువుతుంటే జీవితాన్ని చదువుతున్నట్టు, అనుభవిస్తున్నట్టు ఉంటుందని, కానీ సినిమాలు అలా ఉండవని, చాలా తక్కువ సినిమాలు ఆలోచింపజేసేలా ఉంటాయని చెప్పారు. లుక్‌ కల్చరా లేదా బుక్‌ కల్చరా అంటే.. తనదైతే బుక్‌ కల్చరేనని స్పష్టం చేశారు. పుస్తక సంస్కృతిలోకి మన పిల్లలను లాగకపోతే ఘోరాన్ని చూసి స్పందించే గుణాన్ని కోల్పోయి.. భవిష్యత్తులో ఇంకా దారుణాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. మనిషి, సమాజపు ఆలోచనను మార్చే శక్తి ఒక చిన్న సిరా చుక్కకు ఉందని వ్యాఖ్యానించారు.
సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హిందీ భాషలో రాసే కవులను కూడా కూడగట్టి భారతదేశంలో వస్తున్న నిర్లిప్తత ఏంటి? సంస్కృతి ఏంటి? అన్న అంశాలపై రాయాలని ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
పార్టీలు, ప్రభుత్వాలు కూడా రాజకీయం కాకుండా ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచన చేయాలని, అందుకు సీఎం కేసీఆర్‌ ఉదాహరణ అని తెలిపారు.

Spread the love