ముహుర్తం కుదిరింది

– ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభం
– అదేరోజు సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర నూతన సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈమేరకు సంక్రాంతి రోజున ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టినరోజైన ఫిబ్రవరి 17న కొత్త సచివాలయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఏడాదిలోగా సచివాలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో కొంత ఆలస్యమైనా ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈనెల 18న సచివాలయానికి శ్రీకారం చుట్టాలని తొలుత భావించినా, అదే రోజున ఖమ్మంలో భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఆవిర్భావ సభను నిర్వహించాలని ఆపార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీ నేతలను ఆహ్వానించారు. ఈనేపథ్యంలో సచివాలయ ప్రారంభోత్సవం దాదాపు నెల వాయిదా పడినట్టయింది. తాజాగా సీఎం తేదీని నిర్ణయించడంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారు లను వెంటనే సచివాలయ పనులను షిప్ట్‌లవారీగా మరింత పకడ్బంధిగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఏడు అంతస్థుల కొత్త సచివాలయంలో పనులు దాదాపు 95 శాతం పూర్తయినట్టు రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే భవనం వెలుపల ఐదు శాతం, బయట మరో ఐదు శాతం పనులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. సచివాలయానికి ఇప్పటికే రంగులు సైతం వేస్తున్నారు. లైటింగ్‌ అమర్చారు. గుమ్మటాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. లైటింగ్‌తో రాత్రిపూట సచివాలయం ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. లోపల ఆరో అంతస్థులో ఉన్న సీఎం ఛాంబర్‌తోపాటు కార్యాలయం, అలాగే చీఫ్‌ సెక్రెటరీతో పాటు మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరం, మంత్రుల పేషీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర సెక్షన్ల కార్యాలయాల పనులు కొలిక్కి వస్తున్నట్టు అధికారిక సమాచారం. దాదాపు రూ. 750 కోట్లతో సచివాలయం పనులు చేపట్టారు. నిజానికి గత ఏడాది దసరా పండుగ నాటికే సచివాలయం ప్రారంభించాల్సి ఉంది. కరోనా, మ్యాన్‌ పవర్‌ లేమీ తదితర ఆటంకాలు ఎదురైనట్టు అర్‌ అండ్‌ బీ అధికారులు చెబుతున్నారు. కోవిడ్‌ అనంతరం మూడు షీప్టుల్లో పనులు శరవేగంగా చేయించిన సంగతి తెలిసిందే. నీటి సరఫరాకు సంబంధించి జర్మన్‌ టెక్నాలజీని సమకూర్చుకున్నారు. అలాగే అమెరికా నుంచి సచివాలయానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇతర వస్తువులను దిగుమతి చేసుకున్నారు. దీనికోసం అధికారులు అమెరికా పర్యటన వెళ్లిన విషయం విదితమే. తేదీ నిర్ణయించడంతో సంబంధిత శాఖ అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. చివరల్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేసి మూడు, నాలుగు రోజుల ముందే సచివాలయాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ప్రారంభోత్సవంలోగా మరోసారి సీఎం కేసీఆర్‌ కొత్త సచివాలయాన్ని సందర్శించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టినట్టు ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఐ.గణపతిరెడ్డి చెప్పారు. అలాగే సీఎం కేసీఆర్‌ ప్రారంభించే ఈ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. మొదట సికింద్రాబాద్‌లోని ఆర్మీగ్రౌండ్స్‌లో సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్‌ భావించినా, కేంద్ర ప్రభుత్వం ఆ స్థలం ఇవ్వడానికి నిరాకరించిన సంగతి విదితమే. కాగా సోమవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నతాధికారులపై సచివాలయం పనులపై సమీక్ష చేశారు.

Spread the love