Saturday, May 9, 2026
E-PAPER
Homeఖమ్మంమండే ఎండల్లో విద్యా వారోత్సవాలా..?

మండే ఎండల్లో విద్యా వారోత్సవాలా..?

- Advertisement -

– ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ హడావిడి
– వేసవి సెలవుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు 
– తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎలా..?
నవతెలంగాణ పాఠకుల కోసం ప్రత్యేక కథనం
నవతెలంగాణ – అశ్వరావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు “తెలంగాణ విద్యా వారోత్సవాలు” నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించింది. పాఠశాల విద్యను పండుగలా మార్చాలనే ఉద్దేశంతో విద్యాశాఖ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కొత్త పాఠశాల భవనాల ప్రారంభోత్సవాలు, పీటీఎంలు, లైబ్రరీ ఉత్సవాలు, కళా ప్రదర్శనలు, విద్యార్థుల సన్మానాలు, రెమెడియల్ క్యాంపులు, వేసవి శిబిరాలు వంటి కార్యక్రమాలను భారీగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మండుతున్న ఎండలు, కొనసాగుతున్న వేసవి సెలవుల నేపథ్యంలో ఈ కార్యక్రమాల అమలుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొనగలరా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మే 11 నుండి 25 వరకు నిర్వహించనున్న వేసవి శిబిరాల్లో కోడింగ్, యోగా, క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.అయితే సెలవుల సమయంలో చాలామంది విద్యార్థులు స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లడం, కొందరు ప్రైవేట్ కోచింగ్‌లకు హాజరవడం వల్ల హాజరు శాతం తగ్గే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇక “జయశంకర్ బడి బాట”, ఇంటింటి నమోదు, అలుమ్ని మీట్, మిడ్‌ డే మీల్ వంటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు గ్రామీణ పాఠశాలల్లో తగిన వసతులు ఉన్నాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడం గమనార్హం.

శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను వెంటనే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం స్వాగతించదగ్గ అంశమే అయినప్పటికీ,వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎంతవరకు అందుబాటులోకి వస్తాయన్నది చూడాల్సి ఉంది. విద్యను సామాజిక చైతన్య కార్యక్రమంగా మలచాలనే ప్రభుత్వ ప్రయత్నం అభినందనీయమే అయినప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో వాస్తవాలు, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించి ఉంటే మరింత ఫలప్రదంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -