ఉక్రెయిన్‌ మద్దతును తగ్గించనున్న ఎన్నికల ఫలితాలు

ఉక్రెయిన్‌ మద్దతును తగ్గించనున్న ఎన్నికల ఫలితాలు– ఫ్రెంచ్‌ ప్రధాని
రాబోయే పార్లమెంటరీ ఎన్నికలలో అందరూ ఊహిస్తున్న రైట్‌-వింగ్‌ నేషనల్‌ ర్యాలీ పార్టీ అధికారంలోకి వస్తే దేశీయ, అంతర్జాతీయ సమస్యలపై దేశం వైఖరిలో చాలా తీవ్రమైన మార్పులు చేయగలదని ఫ్రెంచ్‌ ప్రధాన మంత్రి గాబ్రియేల్‌ అట్టల్‌ హెచ్చరించాడు. యూరోపియన్‌ పార్లమెంట్‌ ఎన్నికలలో తన పార్టీ ఓటమి తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఫ్రెంచ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఈ నెల ప్రారంభంలో ముందస్తు ఎన్నికలను ప్రకటించాడు. జూన్‌ 30న కొత్త జాతీయ అసెంబ్లీని ఎంచుకోవడానికి ఫ్రాన్స్‌ ఎన్నికలకు వెళ్లనుంది. రెండవ రౌండ్‌ జూలై 7న జరగనుంది.
గురువారం బీఎఫ్‌ఎమ్‌ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో మితవాద పార్టీల విజయం 2020లో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ నిష్క్రమించినట్టుగా ”ఫ్రెక్సిట్‌”కు దారితీస్తుందని అట్టల్‌ ప్రత్యేకించి ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో ఉక్రెయిన్‌కు చేస్తున్న సహాయం తగ్గిపోతుందని, ”రష్యాకు సాష్టాంగపడే ప్రమాదాన్ని” పెంచుతుందని ఆయన అన్నాడు. ఇటీవల బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం, అనేక ఇతర యూరోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆందోళనలను వ్యక్తం చేశాయి. మాక్రాన్‌ ఓటమి కీవ్‌ ప్రధాన మద్దతుదారుల్లో ఒకరిగా ఫ్రాన్స్‌ పాత్రను బలహీన పరుస్తుందని, ఉక్రెయిన్‌కు సైనిక బోధకులను పంపే ప్రణాళికలను కూడా ప్రభావితం చేయగలదని అనేక యూరోపియన్‌ దేశాలు విశ్వసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నేషనల్‌ ర్యాలీ పార్టీ ప్రధానమంత్రి మాక్రాన్‌కు పూర్తిగా విరుద్ధమైన రాజకీయ అవగాహన కలిగి ఉంటాడని, మాక్రాన్‌ అధ్యక్ష పదవి 2027 వరకు కొనసాగుతుందని సైన్సెస్‌ పో యూనివర్సిటీలోని రాజకీయ శాస్త్రవేత్త గిల్లెస్‌ ఇవాల్డి చెప్పాడు. ఇది రష్యా, ఉక్రెయిన్‌, యూరోపియన్‌ రక్షణ వంటి సమస్యలను ప్రభావితం చేస్తుంది. వాతావరణ మార్పు, యూరోప్‌ బలహీనపడటానికి దారి తీస్తుంది. తాను అధికారంలోకి వస్తే, ఉక్రెయిన్‌కు మందుగుండు సామగ్రిని అందించడం కొనసాగిస్తానని, అయితే ఎలాంటి ఫ్రెంచ్‌ సైనిక సిబ్బందిని సంఘర్షణ ప్రాంతానికి పంపబోనని లేదా కీవ్‌కు సుదూర క్షిపణులను సరఫరా చేయబోనని నేషనల్‌ ర్యాలీ చైర్మన్‌ జోర్డాన్‌ బార్డెల్లా ప్రకటించాడు. నా అవగాహన మారలేదు. ఇది పరికరాలు, మందుగుండు సామగ్రి, కార్యాచరణ లాజిస్టిక్స్‌ మద్దతు, రక్షణ ఆయుధాలను అందించడం ద్వారా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం, తద్వారా తనను తాను రక్షించుకోగలుగుతుంది అని బార్డెల్లా చెప్పాడు.
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు చేస్తున్న సైనిక సహాయాన్ని మాస్కో పదేపదే ఖండించింది. దేశానికి ఎటువంటి నాటో దళాలను పంపకుండా హెచ్చరించింది. అలాంటి చర్య పశ్చిమ దేశాలకు యుద్ధంలో ప్రత్యక్ష ప్రమేయాన్ని కలిగిస్తుందని, వారు రష్యన్‌ సైన్యానికి చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతారని రష్యా ప్రకటించింది.

Spread the love