ఎన్నికలు – కర్తవ్యం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోట్ల కట్టలు, మందు సీసాలు, బిర్యాని పొట్లాల చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇవి మన ఎన్నికల స్వరూపాన్ని సమూలంగా మార్చివేస్తున్నాయని, ప్రజాస్వామిక వాదులందరూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అసంబద్ధమైన పద్ధతి ఇక ముందు కూడా కొనసాగితే, మనం గర్వంగా చెప్పుకొంటున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థ శిథిలమవడం ఖాయం. ఈ ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదా? ఏ ఎన్నికలైనా ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు లొంగని ఓటర్ల అంతరంగాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి. అవినీతి, అక్రమాలు, ధన ప్రభావంతో నిండిన ఎన్నికలు, భారత రాజ్యాంగం కోరుకున్న ఉజ్వల భారతాన్ని సృష్టించలేవు. మందు, విందులు, వినోదాలతో అభ్యర్థులు ఎన్నికలని కల్మషం చేస్తుంటే, ఓటర్లంతా ఎన్నికలంటే ఒక పండుగగా భావిస్తున్నారు. ఎన్నికలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు తమ నియోజకవర్గాలకు ఏమైనా సేవలందిస్తారనుకుంటే అదికూడా అంతంతమాత్రమే. రాజకీయాలని లాభసాటి వ్యాపారంగా మార్చుకున్న రాజకీయ బేహారులు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఎన్నికల్లో పోటీ చేసేది, పెట్టిన పెట్టుబడికి పదింతలు ప్రజల వద్ద నుండి సంపాదించుకోవడానికేనన్న నగసత్యాన్ని గ్రహించని అమాయక గ్రామీణ ప్రజలు, వీరు విదిలించే నోట్లకోసం తమ గోతిని తామే తవ్వుకుంటున్నారు. అయితే ఆ వారిని తప్పు పట్టడం భావ్యం కాదు. కాకపోతే చేయాల్సింది ఓటుని ఆమ్ము కోవద్దని వాళ్ళని చైతన్యవంతుల్ని చేయడం. అందుకోసం ఒక నూతన ఉద్యమం ప్రారంభం కావాలి. భారత స్వాతంత్రోద్యమ సమయంలో ఎందరో ఉద్యమకారులు, తమ కళలను ఆయుధంగా మలచుకొని ఊరువాడ తిరుగుతూ ప్రజల స్వాతంత్య్ర కాంక్షని ప్రజ్వలితం చేశారు. అందులో కవులు, రచయితలు, రంగస్థల నటులు, హరిదాసులు, బుర్రకథలవారు, ఎందరో, ఎందరెందరో దర్శనమిస్తారు. ఆరోజుల్లో అరవిందుని కలం నుండి జాలువారిన ”వందేమాతర గీతం” దాని ప్రభావం తెలియని వారుండరు. ఇక నిజాం వ్యతిరేక పోరాట సమయంలో దాశరథిలాంటి కవులు తమ కవితలతో ”ఓ నిజాము పిశాచమా…” అని నిప్పులు చెరిగితే, బండి యాదగిరి లాంటి కవులు ”బండెనక బండి కట్టి” లాంటి పాటలతో పోరాటాన్ని ఉర్రూతలూగించారు. అంతేకాదు తెలంగాణ తొలినాటి ఉద్యమ రోజుల్లో రావెళ్ళ వెంకట చిన రామారావు ”వీరులకు కాణాచిరా తెలంగాణ, ధీరులకు మొగసాలరా” లాంటి పాటలు తెలంగాణ యువతలో చైతన్యాన్ని రగిలిస్తే మలి దశ ఉద్యమాల్లో గద్దర్‌ గళం నుండి వెలువడ్డ ”పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా”, అందెశ్రీ కలం నుండి వెలువడిన ”జయజయ హే తెలంగాణ- జననీ జయకేతనం” లాంటి పాటలు, తెలంగాణలోని పల్లెపల్లెలోనూ మార్మోగాయి ఏ ఉద్యమంలోనైనా కళాకారుల పాత్ర ఆయా ఉద్యమాలకు ఊపిరి లాంటిది… ఇప్పుడు ఇక చారిత్రక అవసరమైన ఈ గ్రామీణ ఓటర్ల చైతన్య ఉద్యమంలో కూడా కవుల, కళాకారుల భాగస్వామ్యం అత్యంత అవసరం.వీరికి తోడుగా మేధావులు అండగా నిలిచి నూతనోద్యమాన్ని ప్రారంభిస్తారని, ఆ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వాములై ఈ దేశాన్ని రాజకీయ పెట్టు బడిదారుల నుండి కాపాడుతారని ఆశిద్దాం.
– బసవరాజు నరేందర్‌రావు, 990851654

 

Spread the love