పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు ఫారం 12 ను అందజేయాలి

– కలెక్టర్ హరిచందన దాసరి 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు ఈనెల 22లోగా ఫారం- 12 ను సమర్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. 22 తర్వాత సమర్పించే ఫారాలు పరిగణనలోకి తీసుకోబడవని ఆమె స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు ఉద్దేశించి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లోక సభ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఇదివరకే ఉద్యోగులు వారి పేర్లను, ఇతర వివరాలను సమర్పించిన వారందరూ తక్షణమే ఓటరు గుర్తింపు కార్డు,డ్యూటీ ఆర్డర్ ఇతర వివరాలతో ఫారం- 12డి ని అందజేయాలని అన్నారు. హోమ్ వోటింగ్ లో భాగంగా వృద్ధులు, వికలాంగులు అత్యవసర సేవలు అందించే వారికి ఫారం 12-డిని, అదేవిధంగా ఎన్నికల విధులలో ఉండే అధికారులు, సిబ్బంది, పోలీసులు, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లు, వివరాలను  అందజేయాలని సూచించారు.కాగా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు  రీసోర్స్ పర్సన్ ఫారం 12  పంపిణీ, పూర్తి చేసిన ఫారాల సమర్పణ, జత చేయాల్సిన ధ్రువపత్రాలు, నిర్దేశించిన సమయం, తదితర వివరాలను క్షుణ్ణంగా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవి, జిల్లా ఎన్నికల శిక్షణ రిసోర్స్ పర్సన్ తరాల పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love