కమ్యూనిస్టుల ఖిల్లా.. నల్లగొండ

– తెలంగాణ సాయుధ పోరాటానికి దిక్సూచి ఉమ్మడి జిల్లా
– భువనగిరి ఖిల్లాలో పాగా కోసం సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం
– పూర్వవైభవం కోసం అగ్ర నేతల యత్నం
– నేడు నామినేషన్ వేయనున్న యంపీ అభ్యర్థి జహంగీర్
– హాజరు కానున్న పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– సభను విజయవంతం చేయండి:  రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
దేశంలోనే ప్రజా ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయువు పట్టుగా నిలిచిన ప్రాంతం నల్లగొండ జిల్లా. 1952 నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉండేది. వామ పక్షాలు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చాలా కాలం పాటు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాలు కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉండేవి. నల్లగొండ, మిర్యాలగూడ పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి, సీపీఐ(ఎం), సీపీఐ లు లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించాయి. నల్లగొండ నుంచి పీడీఎఫ్‌ తరపున రావి నారాయణ రెడ్డి, డి.వెంకటేశ్వర్‌రావు, సీపీఐ నుంచి రావి నారాయణరెడ్డి (1962), బి.ధర్మభిక్షం (1991,1996), సురవరం సుధాకర్‌రెడ్డి (1996,1998)లో విజయం సాధించారు. మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) తరఫు లక్ష్మీదాస్‌(1962), భీంరెడ్డి నర్సింహారెడ్డి (1971,1984,1998) గెలుపొందారు. అనంతరం పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ స్థానంలో భువనగిరి 2009లో ఏర్పాటైంది. పునర్విభజన అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో భువనగిరి నుంచి సీపీఐ(ఎం) తరఫున నోముల నర్సింహయ్య, 2019 లో చెరుపల్లి సీతారాములు పోటీ చేసిన విషయం తెల్సిందే. 2019లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ తరఫున గోదా శ్రీరాములు బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకనాడు కమ్యూనిస్టు ఉద్దండులు అసెంబ్లీకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వామపక్షాల బలం తగ్గుతూ వచ్చింది. కాగా మునుగోడు లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో అప్పటి బీఆర్ యస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపులో కీలకంగా మారిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికలతో తిరిగి కమ్యూనిస్టు పార్టీలు అటు రాష్ట్రంలోను….ఇటు జిల్లాలోనూ తమ ఉనికిని చాటుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‎తో జత కట్టిన వామపక్షాలు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చెరో దారిపట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సీపీఐ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‎తో జత కట్టింది. తమకు ఓటు బ్యాంకు ఉన్న సీటు భువనగిరి, నల్లగొండ స్థానాల్లో ఒకటైన కేటాయించాలని సీపీఐ కోరింది. అయితే సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఇండియా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఒంటరి పోరుకు సిద్ధమైన సీపీఐ(ఎం):
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు సాగించిన సీపీఐ(ఎం)..భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒంటరి పోరుకు “సై” అంటోంది. మరోసారి పోరుగడ్డపై ఎర్రజెండాను ఎగురవేయాలన్న ఉత్సాహంతో ఒంటరి పోరు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా భువనగిరి నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్‌ను బరిలోకి దింపింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సీపీఐ(ఎం) కు చెప్పుకోదగిన బలం ఉంది. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో గతంలో ఒంటరిగా, టీడీపీతో పొత్తులో ఎమ్మెల్యేలుగా గెలిచారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజక వర్గంలోని ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, జనగామ, నకిరేకల్‌ నుంచి సీపీఐ(ఎం) చట్టసభలకు ప్రాతినిధ్యం వహించింది. భువనగిరి, ఆలేరులో గతంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నేపథ్యంలో పోరాటాల గడ్డ నుంచి ఎండీ.జహంగీర్‌ను బరిలోకి దింపింది. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా సీపీఐ(ఎం) కాంగ్రెస్‎కు మద్దతు ఇస్తోంది. అయితే రాష్ట్రంలో తాను పోటీ చేస్తున్న భువనగిరి మినహా మిగిలిన 16 నియోజకవర్గాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై కేంద్ర కమిటీ కసరత్తు చేస్తోంది. భువనగిరిలో మాత్రం పోరు తప్పదని నేతలు చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తోనే తమ పార్టీకి ప్రధాన పోటీ అని నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే భువనగిరి స్థానం నుంచి తమకు మద్దతు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వం సీపీఐని కోరుతోంది. ప్రగతిశీల వామ భావజాలం కలిగిన నేతలు.. భావ సారూప్యం కలిగిన సీపీఐ(ఎం)కు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఉద్యమాల గడ్డ భువనగిరిపైనే గురి..
పోరాటాల పురిటి గడ్డలో ఎర్ర జెండాను రెపరెపలాడించిన సీపీఐ(ఎం).. పోరాట స్ఫూర్తితో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా కోసం పోరాడుతోంది. ఎన్నికల్లో తన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు సీపీఐ(ఎం) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులను ఇన్‌చార్జీలుగా నియమించింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సీనియర్‌ నేతలను కన్వీనర్‌, కో కన్వీనర్‌లుగా ప్రకటించింది.
నియోజకవర్గాలకు ఇన్‌చార్జీల నియమాకం..
పార్టీ నేతలు అందరిని ఇన్చార్జిలుగా నియమిస్తూ ప్రచారాన్ని మొదలు పెట్టింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జీగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు చెరువపల్లి సీతారాములును పార్టీ నియమించింది. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించింది. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పాలడుగు భాస్కర్‌, ఆలేరు నియోజకర్గానికి టి.సాగర్‌, నకిరేకల్‌కు జి.నాగయ్య, తుంగుతుర్తికి మల్లు లక్ష్మి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి జాన్‌వేస్లీ, జనగామ నియోజకవర్గానికి ఎండి.అబ్బాస్‌, మునుగోడు నియోజకవర్గానికి జూలకంటి రంగారెడ్డి లను నియమించింది. వీరంతా లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, గతంలో సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులుగా ప్రాతినిథ్యం వహించిన వారిని కలుస్తూ, పార్టీ బలోపేతంతోపాటు అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి అన్ని నియోజకవర్గాల్లో అంతర్గంతంగా పార్టీ తీసుకున్న నిర్ణయాలపై సమావేశాలు పూర్తయ్యాయి.
నేడు నామినేషన్ దాఖలు.. భారీ రోడ్ షో..
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి. జహంగీర్ గురువారం భువనగిరిలో నామినేషన్ వేయనున్నారు.  భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి జగదేపూర్ చౌరస్తా వద్ద వరకు భారీ ర్యాలీ నిర్వహిoచ నున్నారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఎస్. వీరయ్యతో పాటూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కేంద్ర, రాష్ట్ర నాయకులు, నల్లగొండ సూర్యాపేట జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి పలువురు హాజరవుతున్నారు.
నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నామినేషన్ దాఖలు కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలన్నారు. ఎండలు తీవ్రత వల్ల ఉదయం 10 గంటల వరకే కార్యకర్తలు, డప్పు కళాకారులు చేరుకోవాలని అన్నారు. భువనగిరిలో సీపీఐ (ఎం) పోటీ చేయడాన్ని స్వాగతిస్తూ కవులు, కళాకారులు, ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయ వాదులతో పాటు కార్మికులు మద్దతు పలుకుతున్నారని ఆయన తెలిపారు. భారీ ర్యాలీతో నామినేషన్‌ వేసిన అనంతరం కేంద్ర పార్టీ నేతలతో బహిరంగ సభ జరుగుతుందని జూలకంటి రంగారెడ్డి తెలిపారు.
Spread the love