మత సామరస్యానికి ప్రతీక సాగరమాత జాతర

* 7,8,9తేదీలలో మూడు రోజుల పాటు కొనసాగనున్న సాగరమాత జాతర
* రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలువైపులా నుండి లక్షల్లో భక్తుల రాక
* ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
నవతెలంగాణ నాగార్జున సాగర్: సాగర్ లోని కృష్ణా నది తీరాన వెలసిన మేరీ మాత ఆలయ ఉత్సవాలకు ఏర్పాటు పూర్తయ్యాయి .ఈ ఆలయం సర్వమతాల సర్వ మతాల సంగమంగా, ఆధ్యాత్మిక భావనకు ప్రతీకగా వెలుగొందుతున్న సాగర్ మాతా మహోత్సవాలను గురువారం నుండి మూడు రోజుల పాటు జరనున్నాయి.నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ లో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగర్ మాత దేవాలయానికి రాష్ట్రంలో ప్రత్యేకస్థానం ఉంది. కోరికలు తీర్చే తల్లిగా సాగర్ మాతను భక్తులు కొలుస్తారు. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాతను సాగర్ మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందు – ముస్లిం మతాల వారి నీరాజనాలు సైతం అందుకుంటుంది.దేశములోనే భారతీయ సంప్రదాయ రీతులతో నిర్మించిన తొలి క్రైస్తవమందిరంగా దీన్ని చెబుతారు. ధూప, దీప, నైవేధ్యాలు, కొబ్బరికాయలు కొట్టడం, అగర్ బత్తీలు వెలిగించడం, హారతి తలనీలాలు సమర్పించటం వంటి మొక్కులు చెల్లించుకొనే కార్యక్రమాలన్నీ పూర్తిగా హిందు పద్దతిలో జరిగే క్రైస్తవ ఆలయమిది.
భారతీయ సంప్రదాయలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురం పై విగ్రహ సంపద రూపదిద్దికున్నాయి. మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో విచారణ గురువుగా పనిచేసిన మొదటి సైమన్ స్వామి ఈ దేవాలయం నిర్మాణానికి నడుంకట్టగా గుంటురు క్రైస్తవ పీఠాధిపతి బాలసౌరి అన్ని విధాల సహకరించారు .1976 ఫిబ్రవరి 10 వ తేదిన మందిర నిర్మాణానికి శంకుస్ధాపన జరుగగా, ఆ తరువాత సంభవించిన వరదలు, కరువు కాటకాల వల్ల మందిర నిర్మాణం ఆగింది. తరువాత సైమన్ స్వామి రెంటచింతల అడవి సంపద నుంచి ధన సహాయం పొంది సాగరమాత ఆలయం నిర్మాణం పూర్తి చేసారు. ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాగరమాత పుణ్యక్షేత్రంలో విచారణ గురువుగా ఉన్న కే.సుందరరాజు, గుంటూరు క్రైస్ధవ పీఠాధిపతి బిషప్ గాలిబాలి సహకారంతో పాత మందిరానికి కుడివైపున చర్చినిర్మాణం చేపట్టారు. నూతన చర్చి నిర్మాణానికి 1994 మార్చి 31వ తేదిన శంకుస్థాపన జరుగగా, 1996 మార్చి 9 వ తేదిన బిషప్ గాలిబాలి చేతుల మీదగా ప్రారంభం అయింది. పాత మందిరం హిందు సంప్రదాయరీతిలో అలరారుచుండగా అందుకు భిన్నంగా నూతన చర్చినిర్మాణం పూర్తిగా క్రైస్తవ పద్దతిలో జరిగింది.సాగరమాత మహోత్సవం కు ఆలయం ముస్తాబైంది.
సాగర మాత ఉత్సవాల నేపథ్యంలో మార్చి 7 నుండి 9 వరకు సాగర్ మాత పుణ్యక్షేత్రంలో దివ్య సత్రఫ్ సాధన నిత్య ఆరాధనలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రారంభం రోజు ఏడవ తేదీన ఉదయం 5.30 గం.నిమిషాలకు సాగరమాత విచారణ గురువు గురు శ్రీ పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ చే దివ్య బలి పూజ కార్యక్రమం, 6.30గంటలకు గురు శ్రీ తంబి అన్నెంచే పూజలు, మధ్యాహ్నం ఒంటిగంటకు మహా అన్నదానం, అనంతరం వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు,సాయంత్రం ఐదున్నర గంటలకు గురు శ్రీ అల్లం చిన సైరెడ్డిచే పూజా కార్యక్రమాలు, రాత్రి 7 గంటల 30 నిమిలకు కొవ్వొత్తులతో తిరు ప్రదక్షణ, రాత్రి 8 గంటలకు సాగర మాత కళాకారుల బృందం చే సంసోడు డేలీలు నాటకం నిర్వహించబడుతుంది.ఈ సాగర్ మాతా మహోత్సవాలకు సుమారు 2 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు.రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయం మొత్తం అందంగా ముస్తాబయింది.
  ముమ్మరంగా సాగరమాత తిరునాళ్ళ ఏర్పాట్లు.. సాగర్ మాత చర్చి ఫాదర్ జోసెఫ్ బాల సాగర్
మూడు రోజులపాటు జరిగే సాగరమాత జాతర ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నట్లు సాగరమాత విచారణ గురువు జోసెఫ్ బాల సాగర్ అన్నారు. సాగర మాత మహోత్సవానికి వచ్చే భక్తులకు తాగునీరు, మెడికల్ సదుపాయం, ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేశామని అన్నారు.

Spread the love