రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించండి: ఎస్. వీరయ్య

నవతెలంగాణ –  భువనగిరి
రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. బుధవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలు హరించబడి, రాష్ట్రాల హక్కులు వెనుకకు పోయాయన్నారు.  రాష్ట్ర గవర్నర్ ను ఎన్నికల ఏజెంట్లుగా వాడుకొని కేంద్ర ప్రభుత్వం అధికారం చెలాయిస్తుందని వారు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల మీద, మైనార్టీ ప్రజల మీద ఎక్కువ శాతం దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణ రాష్ట్రానికి జరిగే ప్రయోజనం ఏమీ లేదని  అన్నారు. ప్రధానమంత్రి మాట్లాడుతూ ఎన్నికల సభ కాదు అంటూనే 400 సీట్లు బిజెపి గెలుస్తుందని అనడం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రధానమంత్రి రెండు రోజుల పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన విభజన హామీలు ఏ ఒక్కటి మాట్లాడలేదని అన్నారు. ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని మోడీని ముద్దాయిగా నిలబెట్టిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలక్ట్రోల్ బాండ్స్ ఏటీఎంగా మారిపోయాయన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సిగ్గుచేటని వారు ఎద్దేవ చేశారు. కేరళ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను వెంటనే వెనుకకు తీసుకోవాలని దేశంలోనే ఆదర్శమైన పాలన కేరళ రాష్ట్రం అందిస్తుందని వారన్నారు. అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి ఓటమి ద్వారానే గుణపాఠం చెప్పాలన్నారు. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దేశంలో సెక్యులరిజాన్ని దెబ్బతీయాలని కుట్ర బీజేపీ చేస్తుందని దీనిని ఎన్నికల ద్వారా బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు.  సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నుండి రావలసిన నిధులు విడుదల చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారో చెప్పాలని  ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మంగ నరసింహులు, మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, బోల్లు యాదగిరి, ఎండి పాషా, జలెల్ల పెంటయ్య, బుర్గు కృష్ణారెడ్డి, బబ్బూరి పోషేట్టి, బొడ్డుపల్లి వెంకటేశ్, గుంటోజు శ్రీనివాసచారి, గుండు వెంకటనర్సు, గంగదేవి సైదులు, బండారు నర్సింహ, మద్దెపురం రాజు, బొలగాని జయరాములు, అవ్వారు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ, గడ్డం వెంకటేష్, ఎంఎ ఇక్బాల్,  పాల్గొన్నారు.
Spread the love