ఉపాధి హామీ కూలీలకు రోజువారి కూలి రూ.300 రూపాయలు ఇవ్వాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు రోజువారి కూలి 300 రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశంలో టెంట్, నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ డిచ్ పల్లి మండలంలో  ఉపాధి హామీ కూలీలతో ఎఐపికెఎంఎస్ జిల్లా అధ్యక్షులు సాయ గౌడ్ అద్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 లో అనేక పోరాటాల ద్వారా కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేసే విధంగా నిధుల కొరతను సృష్టిస్తూ పేదలకు పని లేకుండా చేస్తుందని దుయ్యబట్టారు. కేంద్రంలో  బిజెపి ప్రభుత్వాం పేదల సంక్షేమమే ధ్యేయమని చెప్పి అధికారంలోకి వచ్చి నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్య ప్రజలు జీవించలేని స్థితిలోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా  కుటుంబంలో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని, ఏడాది కి కనీసం 250 రోజులు పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు మురళి, సాయిబాబా, మోహన్, మహిపాల్, గంగాధర్, బాబు, సాయిలు, లక్ష్మి ,సుజాత ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Spread the love