కథల చిదంబర రహస్యం తెలిసిన ఏములాడ కథకుడు

కథల చిదంబర రహస్యం తెలిసిన ఏములాడ కథకుడువేములవాడ పేరు వినగానే కనడ ఆదికవి పంపకవి, భీమకవి, తొలి తెలుగు కందపద్యకర్త జినవల్లభుడు మొదలుకుని నిన్నటి మామిడిపల్లి సాంబకవి, జిజసురమౌళి, చొప్పకట్ల చంద్రమౌళి, సహజకవి మిద్దె రాములు వరకు అనేక మంది చరితార్ధులు యాదికి వస్తారు. ఆధునికుల్లో అనేక మంది మనకు కనిపిస్తారు. ఈ కోవలోనే చార్టెడ్‌ అకౌంటెంట్‌, కథా రచయిత, వ్యాసకర్త, బాలల కోసం కథలు రాసిన కథల తాత కూర చిదంబరం ఒకరు.
కూర చిదంబరం నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 5 సెప్టెంబర్‌, 1945న పుట్టారు. శ్రీమతి కూర లలితమ్మ- శ్రీ శంకరయ్య వీరి తల్లితండ్రులు. వృత్తిరీత్యా చిదంబరం చార్టెడ్‌ అకౌంటెంట్‌, ప్రవృత్తిరీత్యా రచయిత. రచయితగా కథలు, వ్యాసాలతో పాటు చర్మ పరిశ్రమ, అకౌంటింగ్‌ రంగాలపై చక్కని వ్యాసాలు రాసిన వీరు ఆర్యవైశ్య అఫీషియల్స్‌ అండ్‌ ప్రెఫెషనల్స్‌ అసోసియేషన్‌ పత్రిక ‘వాసవీ ప్రభ’కు గత పదిహేనేళ్ళుగా సంపాదకులుగా ఉన్నారు. కూర చిదంబరం తొలుత కథా రచయితగా ప్రసిద్ధులు. ‘ఉషస్సు’ పేరుతో తన కథలు, నాటికలను తొలి సంపుటిగా తెచ్చారు. ‘వేకువ’ రెండవ కథా సంపుటి, ‘నీటి నీడ’, ‘జీవన చదరంగం’ ఇతర కథల సంపుటాలు. కథలే కాకుండా వివిధ అంశాలపై రాసిన వ్యాసాలను చిదంబరం ‘ఆలోచనా సులోచనాలు’ పేరుతో ప్రచురించారు. తన అనుభవాలు, జీవన గమనం అన్నింటిని ‘అనుభవాలు-పాఠాలు’గా జీవిత కథగా తెచ్చారు. కవిగా రాసిన కవితలు ‘జీవన చిత్రాలు’గా కవితా సంపుటిగా వెలుడింది. ‘సమీక్షా సౌరభాలు’ వ్యాస సంపుటి త్వరలో వెలువడనుంది. వృత్తిలో పురస్కారాలు, గుర్తింపుతోపాటు రచయితగా చిదంబరం పలు గౌరవ సత్కారాలు అందుకున్నారు. వాటిలో తేజ సాహిత్య పురస్కారం, తెలుగు సాహిత్య కళాపీఠం పురస్కారం, నెలవంక – నెమలీక కథా పురస్కారం, పాలకోడేటి అప్పారావు కథానిక బహుమతి, రావికంటి వసునందన్‌ సప్తతి సత్కారం, ముట్టూరి కమలమ్మ స్మారక కథల పోటీ పురస్కారం, ఆంధ్ర సారస్వత పరిషత్‌ మచిలీపట్నం స్వర్ణోత్సవ సత్కారం, నవతెలంగాణ దిన పత్రిక సత్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం వాటిలో కొన్ని. సాహిత్య సృజనతో పాటు ఆర్థిక, సామాజిక రంగాలపైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహించిన వీరు అవోపాను తన సామాజిక కార్యక్రమాలకు వేదికగా మలచుకున్నారు. చిదంబరం సమీక్షకుడుగా అన్ని పత్రికల ద్వారా పరిచితుడు. దాదాపు పదమూడు వందలకు పైగా చిదంబరం రాసిన సమీక్షలు అచ్చయ్యాయంటే ఆయన పఠనాసక్తి, పఠనశక్తి తెలుస్తున్నాయి.
కథా రచయిత అయిన చిదంబరం ‘కథల తాత’గా పద్మారావు నగర్‌ పిల్లలకు చిరపరిచయం. ముఖ్యంగా ఇక్కడి మైలారు గూడ పాఠశాల పిల్లలకు వీరు చెప్పి కథలు, ముచ్చట్లు వీరిని కథల తాతగా మలిచాయి. అంతేకాదు అక్కడి పిల్లలకు పుస్తకాల పంపిణి, ఇతరాలు చిదంబరం చేశారు. బాలల కథా రచయితగా కూర చిదంబరం రాసిన కథలు ‘నానమ్మ కథలు’ పేరుతో అచ్చయ్యాయి. పిల్లలకు అన్ని అంశాలు, విషయాలపట్ల అవగాహన కల్పించడం, వాళ్ళకు కొత్త కొత్త అంశాలను పరిచయడం చేయడం వీరి బాలల కథల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఒక్కోసారి ప్రతి కథ నీతి కథలాగా కూడా కనిపించడం చూడొచ్చు. ఈ కథా సంపుటిలోని తొలి కథ ‘మోసం చేయవద్దు’. ఇది ఒక పిసినారికి గుణపాఠంలాంటి కథగా అనిపించినా, అన్నీ ఉన్నా లోభం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో తెలుపుతుంది. ‘కష్టేఫలి’ పిల్లలకు తప్పనిసరిగా చెప్పాల్సిన కథల్లో ఒకటి. బాల్యం నుండి పిల్లలకు వాళ్ళ ఇంటిలోని, పరిసరాల్లోని పెద్దలే అన్నింటా ఆదర్శంగా నిలవడం కద్దు. ఆ కోవలోనే బాల్యం నుండి ఇంట్లో వ్యవసాయాన్ని చూసి ఎదిగిన లక్ష్మి తన తల్లితండ్రుల్లాగే విత్తనాలు విత్తగా అవి ఎలా ఎదిగివచ్చాయో ఈ కథలో చూడవచ్చు. ఇటువంటి మరో మంచి కథ ‘కష్టపడితేనే ఫలితం’. ఈ కథ పేరులోనే అందులో కూర చిదంబరం చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా మనం చూడొచ్చు. చెడు సహవాసాల వల్ల ఏమౌతుందో పిల్లలకు కొన్నిసార్లు మనం చెబితే వెంటనే వారి బుర్రకు అది ఎక్కక పోవచ్చు, అయితే కూర చిదంబరం ‘చెడ్డవారి స్నేహం’ కథలో చెప్పినట్టు చెబితే సులభంగా ఎక్కుతుంది. ఇటువంటివే అనేక అంశాలు ఇందులో మనం చూడవచ్చు. ఇంకా ‘పోరు నష్టం’, ‘ఐకమత్యం’, ‘ఓపిక’, ‘రక్షణ’, ‘ఉపాయం’ వంటి బాలలకు నచ్చేవి, పెద్దలు సైతం మెచ్చేటటువంటి కథలు ‘నానమ్మ కథలు’ పుస్తకంలో చదవవచ్చు. అసత్యం పలకరాదు, సత్యమే ఎల్లప్పుడూ మనం మాట్లాడాలి అని చెప్పే కథ ‘అబద్ధం ఆడరాదు’ కథ. కూర చిదంబరం అనుభవంలోనే కాదు, వయస్సులోనూ, నడవడిలోనూ పెద్ద. ఆ పెదరికం, తాతగా అనుభవం అన్నీ కలిసి తన చిన్నారి మనవలు, మనవరాళ్ళతో పాటు తెలుగు బాలల కోసం తెచ్చిన చక్కని వయ్యి ఇది. కథల రహస్యం తెలిసిన మా వేములవాడ కథల వెలుగు కూర చిదంబరం బాలల కోసం మరిన్ని మంచి కథలను ‘ఏములాడ తాత కథలు’ గా తేవాలని కోరుతూ… జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love