ప్రేమానుబంధం

ప్రేమానుబంధంధర్మరాజు స్కూటర్‌ మీద ఆఫీస్‌కి వెళ్లి వస్తుంటే తన ఇంటి మూల మీద చిన్న కుక్క పిల్ల స్కూటర్‌ కింద పడింది. ధర్మరాజు కంగారు పడ్డాడు. సడన్‌ బ్రేక్‌ వేసి స్కూటర్‌ని పక్కనపెట్టి కుక్క పిల్లని చేతుల్లోకి తీసుకున్నాడు. ముద్దుగా బొద్దుగా ఉంది. దాని చెవి పక్కకు కొంత గాయమైంది. ఇంటికి తీసుకెళ్లి, ఆ గాయానికి కొంత డెటాల్‌ రాసాడు. దానికి పెరుగన్నం కలిపిపెట్టాడు.
అప్పటికి గోడ దగ్గర పక్కింటి ఆవిడతో ముచ్చట పెడుతున్న ధర్మరాజు భార్య శ్యామల ఆ కుక్క పిల్లను చూసి ”ఏంటి శ్యామల.. మీవారు ఊరకుక్కని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. హైదరాబాదులో మా కూతురు, అల్లుడు ఇరవై ఐదు వేలకి ఫారన్‌ బ్రీడ్‌ కుక్కపిల్లను తెచ్చుకున్నారు. దానికి రోజు సెర్లాక్‌ పెడుతున్నారు తెలుసా? ఊర కుక్కకు ఎంత పెట్టినా అది కొంచెం పెరిగిందంటే పీతి బొందల దగ్గరికి వెళ్తుంది. ఊర కుక్కలు ఏమంత అందంగా, డిగ్నిఫైడ్‌గా ఉంటాయిగ ఆ కుక్క పిల్లలు చూస్తే చిరాకేస్తుంది” అంది.
దాంతో శ్యామల గుర్రుగా భర్త దగ్గరికి వచ్చి, ”ఈ కుక్కపిల్ల ఎక్కడిదండి… మనది అసలే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మధ్యతరగతి కొంప. మన దరిద్రానికి ఇంకొకటా… ఊర కుక్కని పెంచుకుంటామా ఏంటి?”
”నువ్వు దానికి ఏం పెట్టక్కర్లేదు. నాకు పెట్టిన దాంట్లోనే ఒక ముద్ద దానికి పెడ్తాను. పాపం స్కూటర్‌ కింద పడిందే… బుజ్జిముండ… ఎంత బాగుందో” అన్నాడు చేతుల్లోకి తీసుకుంటూ.
ఆ రోజు నుంచి అది వాళ్ళ ఇంట్లో ఒక ప్రాణిగా తిరుగుతోంది. ధర్మరాజు ఆ కుక్కపిల్లకి టామీ అని పేరెట్టుకున్నాడు.
”అన్నట్టు… సులోచన ఆస్ట్రేలియన్‌ నుంచి ఆరు గంటలకి వీడియో కాల్‌ చేస్తానంది. చేసిందా..?” అని అడిగాడు.
”సులోచన చేయలేదు కానీ, అమెరికా నుంచి ప్రసాద్‌ చేశాడు. వాళ్ళ పాపని స్కూల్లో జాయిన్‌ చేశారట. కెనడా నుంచి పాండు చేశాడు. వాడు కంపెనీ మారాడట. మారిన కంపెనీలో లక్ష జీతం ఎక్కువ అంట.. ఆ అలాగే పూనే నుంచి రాధిక చేసింది. దానికి ఈరోజు 9 నెలలు నిండాయంట. తొలికాన్పు లాగా సిజేరియన్‌ చేయించుకుంటా కానీ ఈ ***
పొద్దున లేవగానే ధర్మరాజు కాళ్ళ చుట్టూ టామీ తిరుగుతూ ఉంటుంది. తన పేపర్‌ చదువుతుంటే మెల్లిగా వచ్చి ప్రేమగా తన ఒడిలో పడుకుంటుంది. బయటకి స్కూటర్‌ తీస్తుంటే వెనకే పరిగెత్తుకొని వస్తుంది. కాళ్లకు అడ్డం పడుతుంది. అప్పుడైతే దాని బతిమాలి ఇంట్లోకి తీసుకెళ్లడానికి శ్యామలకి తల ప్రాణం తోకకు వచ్చేది. ధర్మరాజు వచ్చేంతవరకు గేటు దగ్గర ఎదురుచూసేది.
రోజులు గడుస్తుంటే వాళ్ళ బంధం విడదీయరానంతగా మారింది. ధర్మరాజు పిల్లల్ని కష్టపడి మంచి చదువులు చదివించాడు. పోటాపోటీగా వాళ్లంతా విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
టామీని మొదట్లో శ్యామల అసహ్యించుకున్నా, ఇప్పుడు అదే తన గారాల పట్టీ అయింది.
ఆరు నెలలు గడిచాక… ధర్మరాజుకి సాయంత్రం పూట గుండె నొప్పి వచ్చింది. శ్యామల అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి, దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పటికే ధర్మరాజు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. బెడ్స్‌ ఖాళీ లేవని, పక్క బెడ్‌ వాళ్లు భయపడతారని ధర్మరాజు పార్థివదేహాన్ని మార్చరీలోకి తరలించారు ఆసుపత్రి సిబ్బంది.
శ్యామల బిగ్గరగా రోదించింది. గుండెను రెండు చేతులతో బాదుకుంటూ, దిక్కులు పిక్కటిల్లెల ఏడ్చింది. దు:ఖాన్ని అణిచిపెట్టుకుంటూ విదేశాల్లో వున్న పిల్లలకి ఫోన్‌ చేసింది. మొదట పెద్దోడికి ఫోన్‌ కలిపింది,
”మమ్మీ… ప్లీజ్‌… ఈసారి తమ్ముడిని రమ్మను. నేను మొన్ననే కంపెనీ మారాను. సెలవులు ఇవ్వరు మమ్మీ… అంత్యక్రియలు మాత్రం ఫోన్లో లైవ్‌లో చూపించవే…” అంటూ ఫోన్లో ఏడ్చుకుంటూ కాల్‌ కట్‌ చేసాడు.
వెంటనే ఏడుస్తూనే చిన్నోడికి ఫోన్‌ కలిపింది.
”చిన్నా… మీ నాన్నగారు వెళ్ళిపోయారు…” అని తల్లి మాట పూర్తిగా కాకముందే, ”ఇప్పుడే అన్నయ్య ఫోన్‌ చేసి చెప్పాడు. కానీ నాది అన్నయ్య కన్నా పెద్ద పొజిషన్‌… నాకెలా కుదురుతుంది. రేపు మా అత్తమామలు కూడా వస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్‌ చేసుకోవాలి. స్వప్నకి ఇప్పుడు ఏడో నెల. తనను విడిచి పెట్టి ఎలా రాను” అన్నాడు.
శ్యామలకి వాళ్లలో ఏ కొంచెం కూడా బాధ, జాలి, ప్రేమ కనపడలేదు. చిన్నోడి కాలేయం చెడిపోతే నాన్ననే ఇచ్చాడని ప్రేమ కూడా లేదు అనుకుంది. శ్యామల గుండె దిటవు చేసుకుని ఫోన్‌ పక్కకు పెట్టేసింది. తర్వాత రెండు మూడు మిస్డ్‌ కాల్స్‌ వచ్చినా ఫోన్‌ ఎత్తలేదు. కెనడా నుంచి పెద్ద కూతురు చేస్తే మాత్రం లిఫ్ట్‌ చేసింది.
”మమ్మీ ఇప్పటికిప్పుడు మేము రావాలంటే ఎలాగమ్మా. అన్నయ్యలకు కూడా కుదరదు కావచ్చు. ఒక పని చెరు. గూగుల్‌లో సెర్చ్‌ చేసి మహాప్రస్థానం వాళ్ళకి ఫోన్‌ చేసి చెప్పు. వాళ్లే అంతా చూసుకుంటారు” అంది.
శ్యామల ఫోన్‌ కట్‌ చేసింది. ఇంక పూనేలో ఉన్న చిన్న కూతురుకి ఫోన్‌ చేయాలనిపించలేదు.
‘మీ నాన్న ఆదివారం మటనో చికెనో తెస్తే మీకు సరిపోతదో లేదో అని… నేను నాన్‌ వెజ్‌ మానేశానని అబద్ధాలు చెప్పేవాడు. ఏదైనా పండక్కి స్వీట్లు తెస్తే… అది పిల్లలు నలుగురికి సరిపోతుందో లేదోనని, డాక్టర్‌ నాకు షుగర్‌ ఉందని చెప్పాడని స్వీట్లు ముట్టేవాడు కాదు. ఇంత చేసిన కూడా మీకు కృతజ్ఞత లేదురా’ అని మనసులో అనుకుంది.
టామీ కళ్ళల్లో కూడా నీళ్లు. మూసి ఉన్న మార్చురి తలుపు దగ్గరే ముడుచుకొని కూర్చుంది. ధర్మరాజు వీధిలో ఉండే బంధుమిత్రులు ఆఫీస్‌ కొలీగ్స్‌ వచ్చారు. శ్యామలను ఓదార్చారు. అందరు కలిసి ధర్మరాజు శవాన్ని మహాప్రస్థానంకి తరలించారు. ఆ గందరగోళంలో టామీకి ధర్మరాజు కనబడలేదు. ఆ మార్చురీ వద్దే కురు కురు మంటూ అటు ఇటు తిరుగుతుంది. ధర్మరాజు అంత్యక్రియలు అయిపోయాయి.
***
మార్చురి దగ్గరనే కూర్చున్న టామీ, ఎవరైనా మార్చురి గది తలుపులు తీస్తే చాలు ధర్మరాజు వస్తాడని ఆశగా చూస్తోంది. అలా నాలుగు రోజులు గడిచాయి. ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా వెళ్లగొట్టడానికి వస్తే కదలక మెదలక అరిచి పడుకునేది.
మూడు రోజుల నుంచి ఇదంతా గమనిస్తున్న ఆస్పత్రి అటెండర్‌ నారాయణ… దానికి తాను తెచ్చుకున్న టిఫిన్‌ డబ్బా ముందు పెట్టిన తినలేదు. వాసన చూసి మల్ల ముడుచుకుని పడుకునేది.
దాన్ని చూస్తే నారాయణకి తన చిన్నప్పుడు పాటల రికార్డర్‌ హెచ్‌ఎంవి లోగో గుర్తుకొచ్చేది. చిన్నప్పుడు ఎక్కడో చదివినట్టు గుర్తు, ఓ సారీ మార్క్‌ అనే సింగర్‌ పాటల రికార్డింగ్‌ ముగించుకొని ఇంటికి వస్తుంటే అతని కార్‌ కింద కుక్కపిల్ల పడింది. కంగారుగా కారు దిగి కుక్క పిల్లని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు నుంచి అది ఆయన ఎటు వెళ్లినా అటు పోయేది. చివరికి అది ఆయన పాట రికార్డింగ్‌ గదిలోకి కూడా వెళ్ళేది. ఆ రికార్డింగ్‌ గదిలో చీమ చిటుక్కుమన్నా రికార్డు అయ్యేది. ఆయన ఆ కుక్కపిల్ల రికార్డింగ్‌ గదిలో కురు మని కూడా అనకపోయేదట. కొన్నాళ్లకా గాయకుడు చనిపోయాడు. ఆ విషయం కుక్క పిల్లకు తెలియదు. గాయకుడి తమ్ముడు ఫ్రాన్సిస్‌ ఆ కుక్క పిల్లని తెచ్చి పెంచుకుంటున్నాడు. అతనొక మంచి పెయింటర్‌. ఒకసారి తన టేప్‌ రికార్డర్‌లో వాళ్ళ అన్న పాటలు పెట్టాడు. ఆ కుక్క పిల్ల వెంటనే వచ్చి దాన్ని చుట్టూ తిరిగి పక్కకు కూర్చుని వింది. వేరే పాటలు పెట్టగానే పట్టించుకోనట్టు వెళ్ళిపోతుంది. మార్కు పాటలు వినగానే మళ్లీ వచ్చి కూర్చునేది. అది గమనించిన ఫ్రాన్సిస్‌, ఆ సందర్భాన్ని ఒక బొమ్మగా గీశాడు. తర్వాత మార్క్‌ రికార్డింగ్‌ థియేటర్‌కి His Masterμs Voice (HMV) ని పెట్టి ఆ బొమ్మనే లోగోగా పెట్టారట… అప్పటి నుండి మార్కు పాటలు ఎక్కడ వినబడినా ఆ కుక్కపిల్ల అక్కడికి వెళ్లి కూర్చునేదట. ఇప్పుడు టామీ స్థితి చూసి నారాయణకు జాలేసింది.
అప్పుడే అటుగా వెళుతున్న స్వీపర్‌ సూరమ్మకు మార్చురీ దగ్గర కుక్కపిల్లని జాలిగా, దయగా చూపిస్తూ చెప్పాడు.
సూరమ్మ చెప్పింది… ”నారాయణ… ఇప్పటి మనుషుల కన్నా కుక్కలే నయం రా. అందుకే వెనుకటి రోజుల్లో, మనిషి చనిపోతే భార్య గడప దాకా వస్తుంది, కొడుకు కాటిదాకా వస్తాడు, కానీ ఒక భైరవుడొక్కడే స్వర్గం దగ్గరకో, నరకం దగ్గరకో కూడా వస్తాడట అననేవారు”
”నేను కూడా కుక్క పిల్లని రెండు మూడు సార్లు కట్టెతో తరిమేసాను. గేట్‌ దాకా వెళ్లి మళ్లీ మార్చురీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. పాపం అన్నం నోట్లో కూడా పెట్టట్లేదు. ముందటనే పడుకొని ఆ గది వైపే చూస్తుంటుంది” అంది సూరమ్మ.
అప్పుడే లోపలికి కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఇందుమతి ఖరీదైన కారు వచ్చి ఆగింది. నారాయణ లేచి నిల్చున్నాడు.
డాక్టర్‌ ఇందుమతి దిగింది. ఆమె వెనకాలనే నల్ల చిరుత పులి లాంటి జర్మన్‌ షెఫర్డ్‌ కుక్క. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది దాని శరీరం ఎంతో హుందాగా ఉన్నా కళ్ళు మాత్రం నిప్పులా ఉన్నాయి. నోరు తెరిచి నాలిక చాచి సెక్యూరిటీ గార్డుల చుట్టూచూస్తుంది.
చిన్న తోక… నలుపు రంగు… చండ్ర నిప్పుల కళ్ళకు ముట్టుకుంటనే ఒళ్లంతా చీల్చి చెండాడేటట్టు దాని పళ్ళు. దాని మెడకి ఎర్ర రంగు పట్టి. ఇందుమతి పక్కనే నడుస్తుంది. ఈ మధ్యనే దాన్ని మూడు లక్షలు పెట్టి తెప్పించారట.
ఆ కుక్క చూపు మార్చురి ముందు పడుకున్న టామీ మీద పడింది. అంతే..! ఒక్క ఉదాటున పులి గాండ్రించినట్టు టామీ మీద పడింది.
డాక్టరమ్మ తీరుకొని.. ”ఏరు ఉజ్వల్‌… కమాన్‌ రే… కమ్‌ బ్యాక్‌ … ప్లీజ్‌… అది ఊరకుక్క. దాన్ని తాకొద్దు. నారాయణ… ఆ ఊర కుక్క ఎలా హాస్పిటల్‌ లోపలికి వచ్చింది. నువ్వేం చేస్తున్నావ్‌… ఉజ్వల్‌ ఇటురా”
అప్పటికే డాక్టర్‌ గారి కుక్క టామీ మీదికి అరిచి, ఒక మూడు చోట్ల కరవసాగింది. టామీ లేచి పరిగెత్త లేకపోయింది. నారాయణ సిలిండర్‌ స్టాండ్‌ పట్టుకుని వచ్చాడు.
”నారాయణ తొందరగా పో… అది ఊరకుక్కైతే ఇన్ఫెక్షన్స్‌ ఉంటాయి.. ఉజ్వల్‌కి అంటుతాయి. అది పిచ్చికుక్క అయితే మరీ డేంజర్‌. సూరమ్మ… మణీ… నాగయ్య… వీళ్లంతా ఎక్కడ చచ్చారు” డాక్టర్‌ అరుస్తోంది.
టామీ తిరగబడుతుంది, కానీ ఒంట్లో సత్తువ లేక ఓడిపోతుంది. నారాయణ వచ్చి గేటు బయటకి టామీని తరిమి కొట్టాడు. పరిగెడుతూనే అది మూడు, నాలుగు సార్లు మార్చురి గది వైపు చూసింది. నారాయణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బలవంతంగా దాన్ని గేటు బయట వరకు తరిమికొట్టాడు.
డాక్టరమ్మ ఉజ్వల్‌ మొఖం మీద ముద్దులు పెడుతుంది.
టామీ కొంత దూరం పరిగెడుతూనే ఉంది. ఆయాసంతో ఉన్నప్పుడు మరికొన్ని ఊరకుక్కలు వెంట పడసాగాయి. మిగతా కుక్కలు వెంబడిస్తున్నాయని టామీ వీధులు దాటుతూ పరిగెడుతూనే ఉంది. ఆయాసంతో గేట్లు తెరిచే ఉన్న మహాప్రస్థానం లోపలికి వెళ్ళింది. చెట్ల నీడలో సేద తీరుతూ కాసేపు అక్కడే తిరిగింది.
అక్కడ ఒక సమాధి మీద ధర్మరాజు ఫోటో కనిపించింది. పక్కనే తెల్ల చీరలో శ్యామలమ్మ. ఒక్కసారిగా ఎగిరి గంతేసి అరచుకుంటూ ధర్మరాజు సమాధి దగ్గరికి వెళ్ళింది. శ్యామల చుట్టు తిరుగుతూ, ఫోటోలో ఉన్న ధర్మరాజును చూసి కురు మంటూ ఆమె ఒళ్ళో పడుకుంది. శ్యామల దు:ఖాన్ని ఆపుకుంటూ…ప్రేమగా టామీ తలను నిమిరింది.
– కె. వి. నరేందర్‌. 9440402871 

Spread the love