మాంద్యం అంచున యూరోపియన్‌ యూనియన్‌

వర్తమాన సంవత్సరాంతానికి యూరోపియన్‌ యూనియన్‌ మాంధ్యంలో మునిగిపోనున్నదని మాజీ ఇటాలియన్‌ ప్రధాని, మాజీ యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు(ఇసిబి) అధ్యక్షుడు మారియో ద్రాగీ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కి చెప్పాడు. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో యూరోజోన్‌ ఆర్థిక వ్యవస్థ అంతకు ముందటి త్రైమాసికంతో పోల్చినప్పుడు 0.1శాతం కుదింపుకు గురైందని గణాంకాల ఏజన్సీ యూరోస్టాట్‌ అంచనా వేసింది. వర్తమాన సంవత్సరాంతానికి యూరో జోన్‌ లో మాంధ్యం వస్తుందని, రానున్న సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాలలో ఈ విషయం బయటపడుతుందని ద్రాగీ అన్నట్టు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ రాసింది.2011-2019మధ్యకాలంలో మారియో దాగీ యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌గా పనిచేశాడు. తక్కువ స్థాయి ఉత్పాదకత, ఇందన వ్యయం చాలా ఎక్కువగా పెరిగిపోవటం, తగినంత ప్రావీణ్యతగల శ్రామికులు లేకపోవటంవంటి కారణాలవల్ల యూరోపియన్‌ యూనియన్‌ మాంధ్యంలోకి జారుకోబోతోందని ఆయన విశ్లేషించాడు. గత 20సంవత్సరాలుగా అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లతో యూరోప్‌ పోటీపడలేకపోతున్నదని కూడా ఆయన అన్నాడు.తగినంతగా డిమాండ్‌ లేకపోవటంవల్ల యూరోజోన్‌ ఆర్థిక వ్యవస్థ గత మూడు సంవత్సరాలుగా వేగంగా కుదింపుకు గురౌతోందని తాజాగా విడుదలైన ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ నివేదిక తెలియజేస్తోంది. వ్యాపార కార్యకలాపాలను స్థాయిని కొలిచే పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచిక(పిఎమ్‌ఐ) ప్రకారం సెప్టెంబర్‌ లో 47.2 పాయింట్లున్న సూచిక అక్టోబర్‌ లో 46.5 పాయింట్లకు పడిపోయింది. ఇది ఉత్పత్తి పతనాన్ని సూచిస్తోంది. వరుసగా ఐదు నెలల పాటు ఈ సూచిక 50 పాయింట్ల నుంచి పతనమౌతూ వస్తోంది. ఉత్పత్తి పతనంతోపాటు ఉద్యోగ కల్పన కూడా స్తంభించిందని ఎస్‌ అండ్‌ పి నివేదిక పేర్కొంది. జర్మనీ, ఫ్రాన్స్‌లలో పతనం వేగవంతం అయింది. ఇటలీ గత సంవత్సరం నుంచే పతనావస్థలో ఉంది. స్పెయిన్‌ లోని ప్రయివేటు రంగంలో వృద్ధి అక్టోబర్‌లో స్తంభించింది. సెప్టెంబర్‌ 2012 తరువాత కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన కాలాన్ని వదిలితే యూరోజోన్‌ ఆర్థిక వ్యవస్థలో ఇంతగా పతనం ఎన్నడూ సంభవించలేదు. యూరోజోన్‌లో అంతిమ త్రైమాసికంలో సేవారంగం మరింతగా కుదేలయింది. రానున్న కాలంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని హాంబర్గ్‌ బ్యాంకు చీఫ్‌ ఎకనామిస్టు సైరస్‌ డి లా రూబియా అన్నది. 2023వ సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో కూడా యూరోజోన్‌ ప్రాంతంలో ఉత్పత్తి పతనం అవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది మాంధ్యానికి ఒక సూచిక.

Spread the love