కోవిడ్‌ ముందటి స్థాయిని దాటిన రష్యా వాణిజ్యం

రష్యా వాణిజ్య టర్నోవర్‌ ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కోవిడ్‌ ముందటి స్థాయిని దాటిందని రష్యా కస్టమ్స్‌ అధారిటీ ప్రకటించింది. జనవరి-జూన్‌ మధ్య పెరుగుదల 2019లో అదే కాలం కంటే 3శాతం పెరిగిందని ఫెడరల్‌ కస్టమ్స్‌ సర్వీస్‌(ఎఫ్‌ సి ఎస్‌) అధినేత, రస్లాన్‌ దవీదోవ్‌ అన్నాడు. రష్యా వాణిజ్యం పెరుగుదలకు ఎఫ్‌సిఎస్‌ తీసుకున్న అనేక చర్యలు ఉపయోగపడ్డాయని రష్యా ప్రధాని మైఖైల్‌ మిషుస్టిన్‌తో జరిగిన సమావేశంలో దవీదోవ్‌ పేర్కొన్నాడు. కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ప్రక్రియలను వేగ వంతం చేయటం, కొన్ని సరుకులపైన కస్టమ్స్‌ డ్యూటీ లను తొలగించటం, ఆన్‌ లైన్‌ లో కొన్న వస్తువులపైన పన్ను మినహాయింపు పరిధిని పెంచటంవంటి చర్యలు రష్యా వాణిజ్యం పెరగటానికి ఉపయోగపడ్డాయి.
యూరోపియన్‌ యూనియన్‌ కేంద్రకంగా సాగిన రష్యా వాణిజ్యం తూర్పు, దక్షిణ దేశాలకు మారిందని దవీదోవ్‌ చెప్పాడు. వస్తువుల ప్రవాహం వేగవంతం కావటంతో రష్యాలో కస్టమ్స్‌ విభాగంలో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్యను గణనీయంగా పెంచారు. చెక్‌ పాయింట్లను తగ్గించారు. కొన్ని చెక్‌ పాయింట్లను 24/7 పనిచేసేలా చేశారు. పెద్ద పెద్ద కార్గోలను పర్యవేక్షించటానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్నిప్రవేశపెట్టారు. ఉక్రెయిన్‌ లో సైనిక చర్యను ప్రారంభించాక రష్యాపైన పశ్చిమ దేశాలు ఆంక్షలను విధించటంవల్ల యూరోపియన్‌ యూనియన్‌ మార్కెట్‌ ను కోల్పోయాక రష్యా బ్రిక్స్‌ దేశాలతో తన వాణిజ్యాన్ని పెంచుకుంది.
2022లో ఇదే కాలంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రష్యా, చైనాల మధ్య వాణిజ్యం 40శాతం పెరిగి 114.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని చైనా విడుదల చేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చినప్పుడు రష్యా, ఇండియాల మధ్య కూడా జనవరి, ఏప్రిల్‌ నెలల మధ్యకాలంలో వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగి 22బిలియన్‌ డాలర్లకు చేరుకుందని భారతదేశ వాణిజ్య, పరిశ్ర మల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ఆధారంగా ఆర్‌ ఐ ఏ నొవోస్తి వార్తాసంస్థ జూన్‌ లో రిపోర్ట్‌ చేసింది. చైనా, ఇండియా, టర్కీ, అజర్బజాన్‌లతో రష్యా పెంపొందించిన వాణిజ్యం యూరోపియన్‌ యూనియన్‌లో తాను కోల్పోయిన విదేశీ వాణిజ్యాన్ని భర్తీ చేసిందని రస్లాన్‌ దవీదోవ్‌ అన్నాడు.

Spread the love