ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నాటో-రష్యా యుద్ధంగా మార్చే కుట్ర

మంగళవారం నాడు మాస్కోపైన రెండవ సారి ఉక్రెయిన్‌ డ్రోన్‌ తో దాడి చేసింది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లలో ఒకటి జనావాసాలపైన పడింది. గతవారంలో జరిగిన జి-7 దేశాల సమావేశంలో అమెరికా ఎఫ్‌-16 రకం యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌ కు సరఫరా చెయ్యటానికి సంసిద్దంగా ఉన్నట్టు ప్రకటించింది. రష్యా భూభాగంలోకి యుద్ధాన్ని చొప్పించాలని సామ్రాజ్యవాద దేశాలు నిర్ణయించాయని దీనినిబట్టి అర్థం అవుతోంది.
ఈ దాడులతో యుద్ధం తీవ్రతను పెంచి నాటో దళాలను ప్రత్యక్షంగా ప్రవేశపెట్టాలనే ఆలోచనతో అమెరికా, దాని మిత్రదేశాలు ఉన్నాయి. అమెరికా ఆమోదంలేకుండా రష్యా రాజధానిపైన ఉక్రెయిన్‌ దాడి చేయటం అనూహ్యం. రష్యాపైన దాడులు చేయమని అమెరికాతోపాటు దాని మిత్రదేశాలు గతంలోనే ప్రోత్సహించాయని లండన్‌ టైమ్స్‌ డిసెంబరులోనే రిపోర్ట్‌ చేసింది.
బాఖ్‌ ముత్‌ పతనం తరువాత ఉక్రెయిన్‌ డీలాపడి రష్యాపై తాను చేయదలచిన ప్రతిదాడిని మొదలుపెట్టటంలో ఉక్రెయిన్‌ విఫలమైంది. ఈ ఓటమిని అమెరికా ఎలా జీర్ణించుకుంటుందనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా, నాటో దళాల జోక్యంలేకుండా రష్యా ఆధీనంలోవున్న ఉక్రెయిన్‌ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవటం దుర్లభమని అమెరికా జాయింట్‌ ఛీప్స్‌ ఆఫ్‌ స్టాప్‌ చైర్మన్‌ మార్క్‌ మిల్లే జనవరిలో చెప్పాడు. రష్యాతో ప్రత్యక్షంగా తలపడాలంటే నాటో తయారు కావలసిన అవసరం ఉంటుందని చెక్‌ సైనిక దళాల అధిపతి కరేల్‌ రేకా అన్నాడు.
రష్యాను ఓడించటంలో అణుయుద్ధ ప్రమాదంవున్నా ప్రయత్నించక తప్పదని అమెరికా మీడియా సమర్థిస్తోంది. ఎంతగా రెచ్చగొట్టినా పుతిన్‌ రెచ్చిపోకపోవటంతో అమెరికా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇటువంటి చర్య మానవాళి వినాశనానికి దారితీస్తుందనే హెచ్చరికలను అమెరికా పెడచెవిన పెడుతోంది. అమెరికా, నాటో దేశాలు రష్యాపైన ఉక్రెయిన్‌ ను ఎగదోస్తున్నాయి. ఇలా ఉక్రెయిన్‌ లో జరుగుతున్న యుద్ధానికి తీవ్ర పర్యవసానాలు ఉంటాయి. ఈ యుద్ధం ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలబెడుతోంది.

Spread the love