తూర్పు రఫాను ఖాళీ చేయండి

– ఇజ్రాయిల్‌ ఆదేశాలు
– పాలస్తీనియన్లలో పెరిగిన భయాందోళనలు
– మూటా ముల్లె సర్దుకుని వీధుల్లో గుంపులు, గుంపులుగా : ప్రతిఘటనకు సిద్ధమయ్యామన్న హమాస్‌
– రఫాను మానవతా సంస్థలు వీడరాదని విజ్ఞప్తి
– కైరో చర్చల్లో ప్రతిష్టంభన?
గాజా, జెరూసలేం: తూర్పు రఫా నగరాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్‌ మిలటరీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పది లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్న ఈ నగరంపై పూర్తి స్థాయిలో మిలటరీ దాడి జరగబోతోందన్న భయాందోళనలు ప్రజల్లో పెరిగాయి. కాగా, రఫా నగరంపై జరిగే ఏ దాడైనా ఇజ్రాయిల్‌ బలగాలకు ‘పిక్నిక్‌’ లా వుండబోదని హమాస్‌ వ్యాఖ్యానించింది. ఏదేమైనా పాలస్తీనియన్లను రక్షించుకోవడానికి తాము పూర్తిగా సంసిద్ధంగా వున్నామని చెప్పింది. సాయుధ విభాగం అల్‌ కసమ్‌ బ్రిగేడ్ల నేతృత్వంలో వీరోచితంగా ఇజ్రాయిల్‌ బలగాలను ప్రతిఘటించేందుకు సమాయత్తమయ్యామని హమాస్‌ ప్రకటించింది. ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే వేలాదిమంది ప్రజలు మూటా ముల్లె సద్దుకుని, పిల్లలు, వృద్ధులతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ముఖ్యమైన వస్తువులను తీసుకుఏని స్వంత వాహనాల్లో రఫా సెంట్రల్‌, అల్‌ మవసి ప్రాంతాలకు వెళుతుండడం కనిపిస్తోంది. నుస్రత్‌, డేర్‌ ఎల్‌ బాలా వీధుల్లో ప్రజలు గుంపులు, గుంపులుగా తరలుతున్నారు. ఎక్కడ సురక్షిత ప్రాంతం వుందో కూడా తమకు అర్ధం కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయిల్‌ ఆదేశాలు వెలువడిన వెంటనే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, నెతన్యాహుతో మాట్లాడారు. మరో ఊచకోత మొదలవబోతోందని జోర్డాన్‌ వ్యాఖ్యానించింది. పరిస్థితులేమీ బాగా లేవని మానవతా సాయం కార్యకర్తలు తెలిపారు. మొండిగా ముందుకు సాగుతున్న ఇజ్రాయిల్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని బెల్జియం ప్రకటించింది. దీనిపై కసరత్తు జరుగుతోందని తెలిపింది.
ఎవరెంత చెప్పినా వినకుండా మొండిపట్టుతో, మూర్ఖత్వంతో ఒక పద్ధతి ప్రకారం రఫాపై దాడికి ఇజ్రాయిల్‌ సిద్ధమవుతున్న తరుణంలో అంతర్జాతీయ సమాజం అత్యవసరంగా చర్యలు తీసుకుని ఈ నరమేథాన్ని ఆపాలని హమాస్‌ కోరింది. అనూహ్యమైన విపత్తు చోటు చేసుకుంటుందని హెచ్చరించింది. తూర్పు రఫాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే దాదాపు లక్ష మందిని అక్కడ నుండి తరలిపోవాల్సిందిగా ఇజ్రాయిల్‌ మిలటరీ ఆదేశించిన నేపథ్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా వందల వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందని పేర్కొంది. అలాగే రఫా నగరాన్ని వీడి వెళ్ళవద్దని పాలస్తీనియన్ల వ్యవహారాలు చూసే ఐక్యరాజ్య సమితి శరణార్ధ సంస్థ (యుఎన్‌ ఆర్‌డబ్ల్యుఎ)తో మానవతా సంస్థలకు హమాన్‌ విజ్జప్తి చేసింది. మరోవైపు, ఈజిప్ట్‌ రాజధాని కైరోలో కాల్పుల విరమణ చర్చలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రఫా తరలింపు వున్నా చర్చలు కొనసాగించాలని భావిస్తున్నట్లు హమాస్‌ తెలిపింది. సానుకూల ధోరణితోనే చర్చలు కొనసాగించాలనుకుంటున్నామని అబ్దుల్‌ లతీఫ్‌ మీడియాకు తెలిపారు. శాశ్వతంగా కాల్పుల విరమణ కోసం ఒప్పందం కుదుర్చుకోవడం అవసరమని హమాస్‌ ప్రతినిధి చెప్పారు. కాగా ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణ ప్రతిపాదనలను బహిరంగంగానే తోసిపుచ్చుతోంది. కాగా, ఇజ్రాయిల్‌ వైఖరి వెంటనే తెలియరాలేదు. గత ఏడు మాసాలుగా సాగుతున్న యద్ధంలో 34,735 మంది పాలస్తీనియన్లు మరణించగా, 78,108మంది గాయపడ్డారని పాలస్తీనా అధికారులు సోమవారం తెలిపారు.
దిక్కుతోచడం లేదు
సోమవారం రఫాలో ఇజ్రాయిల్‌ మిలటరీ వైమానిక దాడులు జరిపిందని ప్రజలు తెలిపారు. రఫాలోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటే ఇజ్రాయిల్‌ ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలో ఈ దాడులు జరిగాయి. తరలిపోవాలని ప్రజలు ఆదేశాలు అందుకున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇజ్రాయిల్‌ ఆర్మీ ఈ వైమానిక దాడులు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో రఫాలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎక్కడకు వెళ్ళాలోకూడా తెలియడం లేదని పాలస్తీనియన్లు వాపోతున్నారు. ‘ఇజ్రాయిల్‌ ఆదేశాల నేపథ్యంలో తమకు దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయని ఉత్తరప్రాంతంలో తలదాచుకున్న అబూ ముహే వ్యాఖ్యానించారు. భారీగా వర్షం పడుతోంది, ఎక్కడకు వెళ్ళాలో తెలియడం లేదు. ఇలాంటి రోజొకటి వస్తుందని భయపడుతునే వున్నాను. నా కుటుంబాన్ని ఎక్కడకు తీసుకెళ్ళాలో చూడాల్సి వుంది.’ అని మరో శరణార్ధి అబూ రయీద్‌ వ్యాఖ్యానించారు.
ఆమోదయోగ్యం కాదు
రఫాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్‌ జారీ చేసిన ఆదేశాలు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని యురోపియన్‌ యూనియన్‌ దౌత్యవేత్త జోసెఫ్‌ బారెల్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. భద్రతా మండలి ఆమోదించిన 2728 తీర్మానాన్ని ఇజ్రాయిల్‌ తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన కోరారు.
బ్రిటన్‌ వర్శిటీల్లో నిరసన శిబిరాలు
గత కొద్ది వారాలుగా అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌ సహా పలు దేశాల్లో సాగుతున్న విద్యార్ధుల నిరసన శిబిరాలు తాజాగా బ్రిటన్‌కు పాకాయి. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి వర్శిటీల్లో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల శిబిరాలను ఏర్పాటు చేశారు. పాల స్తీనియన్లకు సంఘీభావం తెలియచేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కొన్ని రోజుల పాట ఈ శిబిరాన్ని ఇలాగే కొనసాగిం చాలని భావిస్తున్నట్లు విద్యార్ధులు తెఇపారు. గాజాలో మారణహోమాన్ని, వర్ణవివక్షతను తక్షణమే నిర్మూలించాలని కోరారు. ఇజ్రాయిల్‌ ఆక్రమణల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సంస్థలు, కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కోరారు. గాజాలో ఉన్నత విద్యా రంగాన్ని పాలస్తీనా నేతృత్వంలో పునర్నిర్మిస్తామని ఆక్స్‌ఫర్డ్‌ వర్శిటీ హామీ ఇవ్వాలని కూడా వారు కోరారు.

Spread the love